జ్ఞానోదయం:--డి.కె.చదువులబాబు

 మిట్టమధ్యాహ్నం .ఎండమండిపోతోంది,ఇల్లుదగ్గరేకదా  అని నడిచి వెళ్తున్నాడు చిదానందం.దారిలో చెప్పు తెగిపోయింది.అటూ,ఇటూ దిక్కులు చూశాడు.కోంతదూరంలో ఓచెట్టుక్రింద కూర్చుని వున్నచెప్పులు కుట్టే మనిషి కనిపించాడు.చెప్పుతెగినకాలు ఈడ్చుకుంటూ కష్టంగా అక్కడకు
చేరుకున్నాడు.చెప్పుకుట్టమని  ఇచ్చాడు.ఆ మనిషి చెప్పుకుట్టిఇచ్చాడు.ఇంతలో రవీంద్రనేవాడు తెగిన చెప్పు తో అక్కడకోచ్చాడు."డబ్బులు ఎంతివ్వమంటావ్"?   అడిగాడు చిదానందం "పదిరూపాయలివ్వండి" అన్నాడు "బెత్తెడు దారానికి పదిరూపాయలా!పెట్టుబడిలేని పని కదా!ఐదురూపాయలు తీసుకో" అంటూ ఐదు రూపాయలు తీశాడు.చెప్పు లు కుట్టే మనిషి ముఖం మాడిపోయింది.ఇంతలో రవీంద్ర కల్పించుకుంటూ "ఓ మాట చెబుతాను వింటారా!అన్నాడు చిదానందంతో చెప్పమన్నాడు చిదానందం. " మండుటెండలో మన చెప్పు తెగిపోయింది.తెగిన చెప్పు తో నడవలేము.చెప్పు లు తీసేసీ తిరగలేము.చెప్పు తెగిన చోట చుట్టు పక్కల ఏ సమయం లోనైనా మన చెప్పు కుట్టడానికి ఓ మనిషి ఉదయం నుండి రాత్రిదాకా ఎండకు,గాలికి,వానకు,దుమ్ముకు,ధూళికి ఓర్చుకోని రోడ్డు పక్కన కూర్చుని వుండాలిగా ఆ కష్టాన్ని,సేవను డబ్బుతో వెలకట్టలేము.కోత్త చెప్పు లు కోనాలంటే వందలరూపాయలు కావాలి ఈ రోజుల్లో పది రూపాయలకు ఏమెుస్తుంది?ఆ మనిషి తెచ్చే తిండిగింజల కోసం ఎదురు చూసే పిల్లలు పెద్దలు వుంటారు కదా!దానం చేయటానికి చేతులు రాకున్నా పర్వాలేదు కానీ కష్టపడే వారి దగ్గర బేరమాడ కూడదు"అన్నాడు రవీంద్ర. చిదానందానికి జ్ఞానోదయమయింది.తన అజ్ఞానానికి సిగ్గు పడ్డాడు.జేబులో నుండి ఇరవై రూపాయలనోటు తీసిచ్చి వుంచుకోమని చెప్పి వెళ్ళి పోయాడు,ఆ మనిషి ముఖంలో కదలాడిన సంతోషానికి వెలకట్టలేము.రవీంద్ర ముఖం కలువపువ్వులా విచ్చుకుంది