కుంటిసాకులు:-- డా.. కందేపి రాణీప్రసాద్.
ఆశీర్వాద్ ఆటా దొరకలేదనీ
పిల్లలు పాలకూర అడిగారనీ
కూలర్ లో వైర్ పాడైపోయిందని
బైకుల్లో షికార్లు చేస్తున్నారు!

రకరకాల కుంటిసాకులు చెప్పేసి
రోడ్లు పట్టుకు వేలాడుతున్నారు
భద్రతను బైటి గాలికొదిలేసి
బాధ్యతను తుంగలో తోక్కేస్తున్నారు!

“తాటి చెట్టెందుకు ఎక్కవురా అంటే
దూడ మేతకోసం’ అన్నాడొకడు
“లాక్ డౌన్ లో బయటకు వచ్కావేం” అంటే
“ఇంట్లో బోర్ కొడుతుంది” అన్నాడింకొకడు!

లంచ్ కో దేశం, డిన్నర్ కో దేశం
భాషా భేదాలు లేకుండా విహరిస్తోంది
బ్రిటిష్ రాజుల్ని, ప్రధాన మంత్రుల్ని
వదలక తన కౌగిట్లో బిగించేస్తోంది!

తిరిగే కాలూ, తిట్టే నోరూ
ఊరుకోవని సామెత ఉంది
కాలు ఊరుకోదని బజారేల్తే
కరోనా చూస్తూ ఊరుకుంటుందా!

తల్లి మరణించినా వెళ్ళకుండా
విధులు నిర్వర్తిస్తున్న పోలీస్!
రోగికి వైద్యం చేస్తూనే
కరోనాకు బలైపోయిన డాక్టర్!

వీరి త్యాగాలు ఎవరికీ పట్టవా
వారి ప్రాణాలకు విలువ లేదా!
ఎవరిని మోసం చేస్తున్నారు?
ఎవరికీ అబద్ధాలు చెబుతున్నారు?

ఎవరి కోసమీ లాక్ డౌన్ ప్రకటన
కరోనాతో ముప్పు మీకు లేదా!
స్వచ్చంద కర్ఫ్యూ పాటించకపోతే
ప్రపంచమే తుడిచిపెట్టుకుపోతుంది!