సహాయం...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఒకరికొకరు సహాయం  చేసుకుంటూ ఉంటేనే బంధాలు అనుబంధాలు ఏర్పడతాయి. చీమలు తేనెటీగలు కూడా గుంపుగా కలసికట్టుగా తిరిగి తమ విధులు నిర్వహిస్తాయి.పూర్వం  కుటుంబం అంటే బామ్మ తాత  బాబాయిలు వారి పిల్లలు  అంతా ఒకెఇంట్లో ఉండి ఇచ్చి పుచ్చుకునేభావం తో ఉంటే  నేడు పరిస్థితులు మారాయి.అమ్మా నాన్నా ఒకరో ఇద్దరో పిల్లలు!కొత్తవారితో ఎలామెలగాలి ఇచ్చిపుచ్చుకోడాలు తెలీటంలే దు. బడిలో చేరాక వివిధ ప్రాంతాలవారు  కులమతాలవారితో స్నేహం  అవుతుంది. మరి రాము మంచి బాలుడు."నాయనా!అందరితో చక్కగా మాట్లాడు.ఏదైనా తెలీకపోతే అడుగు.నీకు తెలిసింది  తెలీని వారికి చెప్పి సాయం చేయి"అని కొత్త గా ఆరోతరగతిలోచేరిన కొడుకుకి చెప్పేది. రాము అమ్మ చెప్పింది ఆచరించి మంచివాడు  అని పేరు తెచ్చుకున్నాడు. గోపి తెలివితేటలున్న  తుంటరి. చదువు అంటే బద్దకం. అందుకే   చిన్న చిన్న స్లీప్ టెస్టుల జవాబు రాముని అడిగిరాసేవాడు.ఇలా పరీక్షల్లో రాము సాయం తో గట్టున పడేవాడు. వాడు ఛైర్మన్ మనవడు కావటంతో టీచర్లు ఏమీ అనేవారు కాదు. ఆబడికి కొత్తగా వచ్చిన టీచర్ ఈవిషయం గమనించి "రాము!నీవు పరీక్షల్లో  గోపీకి జవాబులు చెప్పకూడదు. వాడి భవిష్యత్తు  పాడవుతుంది.టెన్త్ పబ్లిక్  పరీక్షల్లో  పట్టుబడితే మిమ్మల్ని  డిబార్ చేస్తారు. భవిష్యత్ నాశనం అవుతుంది. "అని బోధించింది. ఆరోజు  బిట్ పేపర్  అన్నీ అడిగి రాశాడు గోపి. కొత్త టీచరు గమనించి  దూరం గా  కూచోపెట్టింది.గోపికి సున్నా.రాముకి కేవలం  పాస్ మార్కులు వచ్చాయి.ఇద్దరినీ ఒంటరిగా పిలిచి టీచర్ అంది"మీరు నిజమైన స్నేహితులు అయితే  తెలీని విషయాలు చెప్పుకోవాలి. సందేహాలు తీర్చుకోవాలి.పెన్సిల్  ఎరేజర్  లాంటివి  షేర్ చేసుకోవాలి.  అంతేకాని ఇలా అడ్డదారుల్లో సాయం చేయరాదు.కొంత మంది  తమకు తెలిసినా కూడా  అవతలివారికి చెప్పితే తమకు గుర్తింపు ఉండదని చెప్పరు.చదువు  చెప్పితే మనకు ఆ సబ్జెక్ట్ పై పట్టు ఏర్పడుతుంది. కాకపోతే  పోటీలు జరిగేప్పుడు చెప్పరాదు.వ్యాస వక్తృత్వపోటీలపుడు  సాయం వద్దు. వారిలో ఆలోచన శక్తి తగ్గుతుంది. కానీ క్లాసు సబ్జెక్ట్ విషయంలో చర్చ  అభిప్రాయంతెలుసు కోటం మంచి ది. "టీచర్ మాటలతో ఇద్దరు తమ తప్పు  తెలుసు 
కున్నా రు.