అమ్మ చీర:-- యామిజాల జగదీశ్
అమ్మ
అమ్మ జ్ఞాపకంలోనే
ఉంటుంది ఎప్పటికీ
అందులోనూ
"అమ్మ చీర"
బంధం విడదీయలేనిది!

అమ్మా.....
నన్ను
ఈ భూమ్మీదకు
తీసుకొచ్చిన క్షణాన
నీ చీరే తడిసింది!  

నేను
నిద్రపోవడానికి
నీ చేరే కదమ్మా
నాకు 
ఉయ్యాలవుతుండేది!

నాకు 
పాలు తాగించేటప్పుడు
నీ చీరే కదమ్మా
నాకు తెరయ్యేది!

నేను 
పాలు తాగుతున్నప్పుడు
నా పెదవులను
తుడిచేది
నీ చీరేనమ్మా!
.
నేను
వర్షంలో తడవకుండా
ఉండటానికి
నీ చేరేనమ్మా 
నాకు గొడుగయ్యేది!

నేను
వర్షంలో
తడిసొచ్చినప్పుడు
తలను తుడవడానికి
తువ్వాలయ్యేది
నీ చీరేనమ్మా!

నేను 
అల్లరి చేయకుండా 
ఉండటానికి
నా మొలతాడుకి 
నీ చీరంచుతోనే
ముడి వేసిదానివమ్మా!

నేను
అన్నం తిన్న తర్వాత
కడుక్కున్న చేతులను
తుడుచుకునేదీ
నీ చీరతోనే కదమ్మా!

నన్నెవరైనా
కోప్పడితే 
నేను దాక్కునేది
నీ చీర చాటునేనమ్మా!

నన్ను
నాన్న బెదిరించడానికొస్తే
నన్ను నువ్వు
దాచిపెట్టింది
నీ చీరచాటునేనమ్మా!

నాకిష్టమైనవేవైనా
చేసినప్పుడు
ఒకటి రెండు ఎక్కువగా 
ఇవ్వడానికి
నీ చీరచాటే ఉపయోగపడేదమ్మా!

నేను
అల్లరి పనులు
చేసినప్పుడూ
సరిగ్గా రాయనప్పుడూ
నన్ను కట్టి కొట్టడానికి
ఉపయోగించేదీ
నీ చీరనే కదమ్మా!

నానారకాలుగా
నీ చీరతో
నాకెప్పటికీ
విడదీయరాని బంధమేనమ్మా!

అమ్మా
అంతటి బంధాన్ని 
కల్పించిన నీ చీరనొక్కటైనా
నాకు మిగల్చకుండా
దూరమైపోయావు కదమ్మా!

కోల్పోయిన సంతోషాన్ని
నీలో చూడటానికి
నా దగ్గర మిగిలినదల్లా 
ఇక ఫోటోలేనమ్మా....
అందులోని చుక్కల నీలంచీరలో
నిన్ను చూసుకుని
సరిపెట్టుకోమంటున్నావు
కదమ్మా!!


మరుజన్మలోనూ
నువ్వే కావాలమ్మా అంటూ
నీ మంచి మనసుతో
చెప్పుకునే
నా ఈ మొరను కాదనకు!
అయినా నువ్వెలా కాదనగలవు
నా అల్లరంటే నీకిష్టమేగా!