నీ అలికిడి లేక - సఖియ వగపులు; :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఆకులు కదలవే తోటలో నీఅలికిడి లేక  
ఊసులు సాగలేదోయ్ మరి నీమాటలు లేక... 

బాటలోను వేచిఉన్న బహుచక్కని పూలు 
చీకటిపడు వేళ రాలె నీమెప్పులు లేక 

మోహపు తిమిరం ఏదో మోకరిల్లు తుంది 
దాహపు వలపుల తీర్చే నీనవ్వులు లేక.. 

చింతతోపు అలిగినట్టు చీకట్లో నిలిచే 
పూతల పిందెలు వాడెను నీ కోత లేక 

చెరుకుతోట చెలరేగె ఇరుకుదారి లోను 
నరకమేగ వంటిపైన నిప్పుల సెగ లాగ

మలయపవన మేదో ఒకమాట చెప్పి పోయే 
కిటకిట చప్పుడు గుట్టపై కీచు రాళ్ళ వేట.. 

అసమ్మతి తెలుపుతూనె అటు ప్రక్కన బావి 
గిలకల చప్పుడు నీకే గురుతురాక పోదా? 

పాలకంకి తిన్నపాల పిట్ట పొగరు చూడూ 
మొగుడేడే ఎంకీ అని ఎగిరినాది పాడూ.. 


పరిసరాల పరిస్థితే ఇలాఉంది చూడూ 
చెలికాడా సఖియ వగచె నీ అలికిడి లేక... !

 (ఉత్తమ కవితగా ఎంపికైనది)