నిజాయితీ పరీక్ష (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  రాము, రాజు నిరుద్యోగులు. ఒకరోజు  పట్నంలో  ఓ ఉద్యోగానికి ఇంటర్యూకు వెళ్లారు.  రాత పరీక్ష రాశారు. అడిగిన వాటికి జవాబులు చెప్పారు.  తరువాత ఫలితాలు ప్రకటిస్తామన్నారు.  వారి వద్ద  బసు టిక్కెట్లు  తీసుకుని  వాటికి సరిపడ రాను పోను చార్జీలు ఇచ్చారు. అయితే వారు ఇవ్వవలసిన దానికన్నా 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. దారి మధ్యలో ఈ విషయం వారు గ్రహించారు.  "అరే రాజు! మనకు పొరపాటున ఎక్కువ డబ్బులు ఇచ్చారు. తిరిగి ఇచ్చేసి వద్దాం పదా?" అన్నాడు రాము.  "బలేవాడివిరా రాము. వాళ్ళు ఉద్యోగం ఇస్తారో, చస్తారో తెలియదు.  తిరిగి ఇచ్చి ఈ 100 రూపాయలు కూడా  ఎందుకు పోగొట్టుకోవడం"  అన్నాడు రాజు.
    రాము అందుకు ఒప్పుకోలేదు. వేగంగా వెళ్ళాడు. వంద రూపాయలు ఎక్కువ వచ్చాయని చెప్పి తిరిగి  ఇచ్చేసాడు. ఇంటర్యూ నిర్వాహకులు రామును అపి కావాలనే మేము అందరికి వంద రూపాయలు ఎక్కువ ఇచ్చాం. ఇది నిజాయితీకి పరీక్ష. ఈ పరీక్షలో నీవు నెగ్గావు. రేపే వచ్చి ఉద్యోగంలో చేరు"  అని  ఉద్యోగ నియామక పత్రం అందజేశారు.