ఏం చెప్పన్ రతన్!:-- యామిజాల జగదీశ్

 ఉదయం మూసేసిన తర్వాత 1995 లో మూడు నెలలకు మద్రాస్ వెళ్ళాను. ఆంధ్రజ్యోతిలో కంట్రిబ్యూటర్ గా చేరాను. రాయడం కాక రాసినవి అచ్చయితేనే డబ్బులు. అదీను సెంటీమీటరుకు డెబ్బయ్ అయిదు పైసలు ఇచ్చేవారని గుర్తు. వార్తతో పాటు ఇచ్చిన ఫోటో అచ్చవుతే దానికో యాభై రూపాయలు ఇచ్చేవారు. ఎంత కష్టపడినా నెలకు వెయ్యో పన్నెండు వందలో వచ్చేవి. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అక్కడ ఇద్దరుండే వారు. ఒకరు కనకదుర్గగారు. మరొకరు కృష్ణగారు. కనకదుర్గగారున్నప్పుడు కాస్త ఎక్కవ వచ్చేవి వార్తలు. కృష్ణగారున్నప్పుడు తక్కువ వచ్చేవి. డబ్బులు సరిపోయేవి కావు. ఆరు వందల రూపాయలు ఇంటి అద్దె. 
కనుక ఏదైనా పనుంటుందా అని తిరుగుతుంటే రత్నకుమార్ పేరు స్ఫురించింది. వెళ్ళి కలిసాను. పరిస్థితి చెప్పుకోవడంతోనే పనిచ్చాడు. అప్పటికే తను రాస్తున్న ఓ స్క్పిప్ట్ ఫెయిర్ చేసిపెట్టే వర్క్ ఇచ్చాడు. దాదాపు ఏడాదిన్నరపైనే అతని దగ్గర ఈ పని చేస్తుండేవాడిని. ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసేవాడు. ఒక్కొక్కప్పుడు నేను వెళ్ళే సమయానికి అతను ఇంట్లో లేకపోయినా వాళ్ళావిడ డబ్బులిచ్చేసేవారు. 
అదలా ఉంచితే, జెమినీ టెలివిజన్ ఛానెల్లో విశ్వదర్శనం అనే కార్యక్రమం వచ్చేది. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చింది. అందుకు కారణం స్క్రిప్ట్ తోట భావనారాయణగారు రాయడం, యాంకర్ పార్ట్ రత్నకుమార్ చదవడం. ఓ పన్నెండు పదమూడు కథనాలు ఉండేవి. అప్పటికప్పుడు భావనారాయణగారు రాయడం, కెమేరా ముందు కూర్చున్న రత్నకుమార్ ఓ మారు యాంకర్ పార్టులన్నీ చూసుకున్నాక టేక్ అని చదివిన తీరు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతోంది. పెద్దగా మేకప్ కూడా చేసుకునేవాడు కాదు. 
చదివిన తీరు తనకు తృప్తిగా లేకుంటే మరొక్కసారి చదివేవాడు. అంతతప్ప ఏదో చదివేసాను, చాల్లే అనుకునేవాడు కాదు. ఆ ఈ విశ్వదర్శనం రికార్డింగప్పుడు స్టూడియోలో నేనూ, శ్రీహరి, కెమేరామాన్ ఆనంద్ ఉండేవాళ్ళం. రత్నకుమార్ చదవడం ఓ ఎత్తయితే భావ నారాయణగారి స్క్రిప్ట్ అద్భుతంగా ఉండేది. యాంకర్ పార్టులో పద్యపంక్తి లేదా ఓ గొప్ప నానుడి వంటివి కోట్ చేసే వారు. అంతేకాదు భావనారాయణగారి దస్తూరీకూడా ముత్యాల్లా ఉండేవి. ఇప్పటికీ ఓ రెండు స్క్రిప్టులు నా దగ్గర దాచుకున్నాను.
షూటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. టీ. నగర్లోని పార్థసారథిపురంలో అతనిల్లు. అక్కడిదాకా కారు నడుపుతూనే ఎన్నో కబుర్లు చెప్పేవాడు. ఒక్కొక్కప్పుడు పాండిబజారులో రోడ్డుకి ఓ పక్కగా కారు ఆపి కబుర్లు చెప్పేవాడు.
బాగా సన్నిహితుడైన రత్నకుమార్ ఇక లేడన్న వార్త వినీ చదవీ మనసు బరువెక్కింది. ఏం చెప్పాలో తెలీడం లేదు. 
వాడి కంఠం ఇంకా చెవిన వినపడటం కాదు, హృదయాన్ని స్పర్శిస్తున్నట్టే ఉంది. రూపం సరేసరి. 
అలాగే ఓ తెలుగు సీరియల్ డబ్బింగ్ రచనప్పుడూ కొంత పని ఇచ్చిన రత్నకుమారు మాటలెన్నో జ్ఞాపకంలో ఉన్నాయి ఇప్పటికీనూ.