వృత్తిపై గౌరవం - యామిజాల జగదీశ్

 మన దేశానికి ఆర్ధిక శాఖ మంత్రిగా ఉండిన కీ.శే.  సి. సుబ్రహ్మణ్యం (సిఎస్) ఓమారు అమెరికా వెళ్ళారు. అప్పుడాయన ఓ కార్యక్రమంలో ఒక నోబుల్ బహుమతి గ్రహీతను కలిశారు. ఆయన ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కూడా. ఇద్దరూ ఐనేక విషయాలపై మాట్లాడుకున్నారు. 
అదేరోజు సాయంత్రం సి. సుబ్రహ్మణ్యం ఒక హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్ళారు. తీరా అక్కడ ఒకర్ని చూసి ఆశ్చర్యపోయారు.
నాటి ఉదయం ఓ కార్యక్రమంలో కలిసి మాట్లాడిన నోబుల్ బహుమతి గ్రహీత ఒక యువకుడికి క్రాఫ్ చెస్తుండటం చూసారు సుబ్రహ్మణ్యం.
ఆయనను సిఎస్ పలకరించారు.
"మీరు ప్రొఫెసరా లేక...." అని అంటుండగా ఆ ప్రొఫెసర్ "నేను ప్రొఫెసర్ నే. కానీ సాయంత్రం ఓ గంట ఇక్కడ పని చేసే అవకాశం ఉందని తెలిసి నాకున్న ఖాళీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలనుకుని ఇక్కడ ఈ పని చేస్తున్నాను" అన్నారు.
"ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు కదా?" అని అసిఎస్ ప్రశ్నించగా ఆయన "ఇక్కడ అలాటివేమీ ఉండవు. అయినా నేనేమన్నా దొంగతనం చేస్తున్నానా? తప్పుడు పనులు చేస్తున్నానా? పాపపు పనులు చేస్తున్నానా? అక్రమంగా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తున్నానా ఎవరైనా నన్నేదైనా అనుకోవడానికి" అని అన్నారు.