నిర్లక్ష్య భూతం:-ద్వారపురెడ్డి.జయరాం నాయుడు

 యమలోకంలో అలజడి మొదలయింది. ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మనలో చాలామందికి ఉద్యోగాలు తీసివేస్తారు అని ఆందోళన. ఎందుకంటే మరణాలు తగ్గిపోయి యమలోకంలో ఉన్న శిక్షాకేంద్రాలకు పని లేకుండాపోయింది. అందుకనే సిబ్బందిని తగ్గించే యోచనలో యమధర్మరాజు ఉన్నాడు. ఇది మా హక్కులను కాలరాయడమే అని యమభటులు అందరూ ఉద్యమ బాట పట్టారు. అంతకంతకు ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.


ఉద్యమ నాయకులను యమధర్మరాజు చర్చలకు పిలిపించారు. "మీ ఉద్యోగాలు పదిలంగా ఉండాలంటే మీ చేతి నిండా పని ఉండాలి. అందుకు ఒక్కటే మార్గం. భూలోకంలో మరణాల సంఖ్య పెరగాలి. మానవుడు తమ తెలివితేటలతో అనేక రకాల టీకాలు,మందులు కనుగొని తమ మరణాల సంఖ్య తగ్గించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మన లోకానికి పూర్వ వైభవం తీసుకురాగల సామర్థ్యం మీలో ఎవరైనా ఉంటే మీరు గానీ, మీ తరపున ఎవరైనా ముందుకు రండి, మిమ్మల్ని ప్రతినిధిగా నియమిస్తాను" అని ధర్మరాజు అన్నాడు.


ముందుగా కలరా వచ్చి నేను ఒకేసారి చాలామందిని చంపగలను అని,  క్యాన్సర్ వచ్చి నేను నయం కాని జబ్బుతో చంపగలను అని, మధుమేహం వచ్చి జనాలకు తెలియకుండానే మెల్లమెల్లగా హరిస్తాను అని, గుండెపోటు వచ్చి హఠాత్తుగా చనిపోయేలా చేస్తానని అన్నవి. ఎబోలా, డెంగు, స్వైన్-ఫ్లూ లు ముందుకు వచ్చి ప్రస్తుత కాలంలో మా పనితనంతో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాం, కావున మేమే సమర్థులం, మమ్మల్ని నియమించండి అన్నాయి.
అంతలో కరోనా వికటాట్టహాసం చేస్తూ, నేడు ప్రపంచ దేశాలు అన్నీ  నా పేరు వింటేనే హడలిపోతున్నాయి. మిమ్మల్ని రకరకాల టీకాలతో, మందులతో నియంత్రించగలరు, కానీ నన్ను ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు.ఇప్పటికే నేను లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాను. కాబట్టి నేనే ఈ పదవికి సరైన అభ్యర్థిని. నన్నే నియమించండి అన్నది.
యమధర్మరాజుకి కరోనా మాటలు సబబుగానే తోచాయి. కరోనానే ప్రతినిధిగా నియమిద్దామని తీర్మానించే లోపు, నిర్లక్ష్య భూతం వచ్చి నన్ను నియమించండి అన్నది. కలరా మొదలుకుని డెంగు, స్వైన్-ఫ్లూ తదితర వ్యాధులు మానవుల మరణానికి కారకులవ్వటానికి నేనే కీలక పాత్రధారిని. ప్రకృతిని,పరిసరాలను మానవుడు తన నిర్లక్ష్యంతో నాశనం చేయడవల్లే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి అన్నది నిర్లక్ష్యం.
      కరోనా విషయంలో కూడా అదే సంగతి. సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవటం, చేతులు పరిశుభ్రపరుచుకోకపోవటం, నాకు రాదులే అనుకోవటం, ఇవన్నీ నేను ఆవహించడం వలనే వచ్చాయి. నేను ఆవహించడం వల్లనే ఈ కరోనా ఇంత వ్యాప్తి చెందగలుగుతుంది అని గంభీరంగా పలికింది నిర్లక్ష్య భూతం. ఇవే కాకుండా, వాహన ప్రమాదాలు మరియు ఇతర ప్రమాదాల వలన సంభవించే మరణాలు కూడా నా ప్రమేయం వల్లనే. 


   నిర్లక్ష్య భూతం పలికిన మాటలు అక్షరాల సత్యం అనిపించి, నిర్లక్ష్య భూతం ఆవహిస్తే మన చేతి నిండా పని, మీ అందరికి ఉద్యోగ భద్రత ఉంటాయి. కావున మన లోకానికి ఈ నిర్లక్ష్య భూతాన్ని ఏకగ్రీవంగా ప్రతినిధిగా నియమిస్తున్నాను అని అన్నాడు యమధర్మరాజు.
            

కామెంట్‌లు