రుణానుబంధం..!!:- -----శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 బాల్యం అన్నది తల్లిదండ్రులు, అన్నదమ్ముల తోనే కాక రకరకాల బంధువులు, బంధుత్వాల తో పెనవేసుకొని ఉంటుంది.  రకరకాల వ్యక్తులు, పెద్ద వారి స్నేహితులు, ఇరుగు పొరుగు వారు,  మన చిన్నతనంలో వారి ఆదరణ అభిమానంతో ఎంతో ప్రేమ  చూపిస్తారు.  మనం కూడా బాల్యంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అరమరికలు లేకుండా అందరితో ప్రేమగా కలిసిపోయి  సమయాన్ని గడిపేస్తాం.  అటువంటిదే నాతో, కర్ణాకర్ మరియు వారి కుటుంబ సభ్యుల మధ్య  నా బాల్యం గడిచింది.
 నా బాల్యమిత్రుడు , నాతో కలిసి చదువుకున్న కర్ణాకర్ మాత్రమే కాక ,నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని వారు కరుణాకర్ గారి అమ్మగారు ,నాన్నగారు కూడా .   పక్కనున్న నాగిరెడ్డి పల్లి  అనే పల్లెటూర్లో వారి ఇల్లు ఉండేది. ఏ సమయంలో నేను అక్కడికి     వెళ్ళినా  వాళ్ళ  నాన్నగారు ప్రేమగా పలకరించి బాగున్నావా అంటూ ,  "మణి ,చూడు ! శ్యాం వచ్చాడు ,అన్నం పెట్టు" అనేవారు.  ఆవిడ అప్పటికప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వేడివేడిగా నాకు వంట చేసి , ఎదురుగా కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ భోజనం పెట్టేది.  వంట చేస్తున్నంత సేపు  ఎన్నో విషయాలు మాట్లాడుతూ కూర్చునేవాడిని.  అత్తయ్య కూడా ఎన్నో కుటుంబ విషయాలు అరమరికలు లేకుండా నాతో పంచుకునేది.  కర్ణాకర్ చెల్లెలు పద్మ మాత్రం ఏ పని చేయకుండా రెండుజడలు ముందుకు   వేసుకొని ,దూరంగా కూర్చుని చూస్తూ ఉండేది. భోజనం అయిన తర్వాత చాలా సేపు అంటే దాదాపుగా పది గంటల వరకు అన్ని మాట్లాడుతూ పడుకునే వాడిని.   ఆ రోజుల్లో 10 గంటల వరకు మేలుకొని ఉండడం అన్నదిచాలా గొప్ప. అక్కడ ఉన్న పెద్ద  బల్ల పీట మీద నాకు పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేవారు.  ఒకరోజు ఉదయం తెల్లవారిన తర్వాత   మాంచి   నిద్ర  లో ఉన్న నేను ,పక్కకి తిరిగి   బల్ల పీట మీద నుంచి    ధడేల్ న  కింద  పడ్డాను.
 కాళ్ళకి , చేతులకి బాగా దెబ్బ తగిలి నొప్పి మొదలైంది. నేను పడ్డ చప్పుడు విని అక్కడే ఉన్న సత్తెమ్మ అనే పనిమనిషి పరిగెత్తుకొని వచ్చింది.  ఆమె చూస్తే నా పరువు పోతుందని వెంటనే చటుక్కున లేచి ఏమీ కానట్టు కూర్చున్నాను. ఆవిడ  వచ్చి ఏమీ అర్థం కాక అటు ఇటు చూసి ,నన్ను చూసి ,చుట్టుపక్కల చూసి వెళ్ళిపోయింది.   తను వెళ్లిపోయినట్లు  నిర్ధారించుకుని, అప్పుడు నేను కాళ్ళు చేతులు రుద్దుకుంటూ నొప్పి భరించడం మొదలుపెట్టాను.
 తర్వాత  ఎప్పుడో ఒకసారి టిఫిన్ తింటూ ఈ విషయం నేను మా అత్తయ్య కి చెప్పాను. అది విని  పనిమనిషి సత్తెమ్మ పగలబడి నవ్వి "   అమ్మా ... ఆదా సంగతి! నేను ఆ చప్పుడు విని పరిగెత్తి చూశానమ్మా, అక్కడ ఏమీ లేనట్టు కూర్చున్నాడు ,    పైగా అమాయకంగా నా వైపు చూస్తున్నాడు. అమ్మో శ్యామ్ చాలా హుషారు , మస్తు తెలివి" అంది.   ఆ మాట విని నేను  మనసులో భలే మురిసిపోయాను .  సత్తెమ్మ కు నలుగురు పిల్లలు.   భర్త అందర్నీ వదిలేసి చెప్పకుండా ఎటో పారిపోయాడు.  ఆమె  వీళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ  ,పిల్లల తోటి ,ఇక్కడే జీవితాన్ని గడిపింది. కానీ ఏనాడూ తన బాధను  చూపించేది కాదు.  ఆవిడ ను ఇంటి మనిషిలా చూసుకునే వారు.  ఒకసారి చాలా సీరియస్ గా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, పద్మ వైపు సైగ  చేస్తూ, గుసగుస గా మాట్లాడుతూ "ఏంటి  ఆ అమ్మాయి ని చేసుకుంటావా?"  అని అడిగింది.   
" ఎందుకు అలా అడుగుతున్నావ్? " అని అయోమయంగా అడిగాను. "
". వద్దు   పిల్లకు పొగరు ఎక్కువ!!  "   అని నాకు చాలా సీరియస్ గా సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు నిజానికి ,ఎందుకు  అలా అడిగిందో నాకు అర్థం కాలేదు.  బహుశా అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది.   సత్తమ్మ కే  కాదు  నా స్నేహితులు చాలామందికి, మరియు నాతో ఆడుకునే అమ్మాయిలకు అందరికీ అనుమానం గా ఉండేది.   కొందరు అమ్మాయిలు అయితే     " ఛీ  !!   ఏం బాగుంటుంది? ఏమి వద్దు. నువ్వేమో  హీరో లాగా ఉంటావు,.  అందమైన అమ్మాయిని చేసుకో !"  అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు.  ఆ చిన్నతనంలో మాకెవ్వరికీ కులాలు  గోత్రాలు  మతాల గురించి అవగాహన ,పెళ్లి లో ఇవన్నీ ముఖ్య పాత్ర వహిస్తాయి అని తెలియదు.   నిజం చెప్పాలంటే పద్మ వీరందరి కంటే అందంగా ఉండేది.  జడ చాలా పొడవుగా ఉండేది. దాదాపు  మోకాలు దాటి వచ్చేది.    ఆ జడలు వేయడానికి మా అత్తయ్యకు దాదాపుగా రోజూ అరగంట పైనే  పట్టేది. 
 పద్మ వాల్ల ఇంటి ముందు ఆవరణలో పెద్ద వేపచెట్టు ఉండేది.  దాని కొమ్మలు నాకు అందుబాటులో , చాలా తక్కువ ఎత్తులో ఉండేవి. అవి   చెట్టు కాండం నుంచి అడ్డంగా భూమికి సమాంతరంగా చాలా తక్కువ ఎత్తులో సాగి  ఉండేవి.  వాటిని పట్టుకుని గట్టిగా కిందకి లాగి దాని పైకి ఎక్కి కూర్చునేవాడిని.  ఒకసారి  పద్మజ వచ్చి  నేను  కూడా ట్రై చేస్తాను అంది.  కానీ దాన్ని కిందికి  వంచి  ,పైకి ఎక్కడానికి తన బలం సరిపోవడం లేదు.  అదే  కొమ్మ మీద ఎక్కడానికి పద్మ తమ్ముడు ఇంకో వైపు నుంచి ట్రై చేస్తున్నాడు.  నేను నా బలం ఉపయోగించి ఆ కొమ్మను గట్టిగా లాగి  కిందికి వంచి పట్టుకున్నాను.  పద్మ శతవిధాల ప్రయత్నించి "బావ నా వల్ల కావట్లేదు" అని వదిలేసింది.  సరేలే అంటూ నేను కూడా నా బలం దానిపైన తీసేసి  చేతుల నుంచి  కొమ్మను వదిలేశాను.  కొమ్మ వెంటనే   రివ్వుమని పైకి లేచి పోయింది.  నేను గమనించలేదు ,కానీ పద్మ తమ్ముడు శ్రీనివాస్ కూడా పైకి ఎక్కడానికి ఇంకో వైపు నుంచి అదే కొమ్మమీద ప్రయత్నిస్తున్నాడు.  నా దృష్టి అంతా పద్మ మీద ఉండటం మూలాన అబ్బాయి కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నేను గమనించలేదు.  ఒక కాలు కింద వుంది., ఇంకో కాలు కొమ్మ మీద. ఇంకేముంది ..!ఆ కొమ్మ తోటి నిటారుగా అబ్బాయి   కూడా గాల్లోకి ఎగిరాడు.  పక్కనే ఉన్న నేను అబ్బాయిని రక్షించడానికి పరిగెత్తాను.  సరిగ్గా అదే సమయానికి అతను కొమ్మ నుంచి పట్టుతప్పి సరిగ్గా నా చేతిలో పడ్డాడు.  అదే రకంగా కిందపడి ఉంటే కాళ్లు చేతులు  విరిగిపోయి ఉండేవి.  అదృష్టవశాత్తూ అది ఏమీ జరగలేదు.  కానీ ఆ అబ్బాయి భయంతో కేకలు  పెడుతూ ఏడుపు మొదలు పెట్టాడు.  అత్తయ్య వచ్చి అని తెలుసుకొని నవ్వుతూ ఈ  శ్యామ్ చేసే పనులు ఒకటి కాదు, అన్ని ఇటువంటివె !అంటూ  నా వైపు ఆప్యాయంగా చూస్తూ ఇంటి లోపలికి  వెళ్ళిపోయింది. 
ఇంకో విషయం వాళ్ళింట్లో ఎప్పుడు జరిగే విచిత్రం నేను చెబుతాను. అదేమిటంటే
  నాకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను సరిగ్గా వాళ్ళ ఇంటి గడప  మీదే ఉండేవాణ్ణి .  సరిగ్గా గడప  దాటె  సమయానికి  తుమ్ము వచ్చేది.  అప్పుడు నన్ను అలాగే నిలిపి గడప మీద  నీళ్లు చల్లి  ఆ తర్వాత పైన గుమ్మం మీద కూడా నీళ్లు చల్లేవారు.  అది ఒక రివాజు.  గడప మీద   తుమ్మ కూడదు అని నమ్మేవారు.  ఒకసారి అలాగే తుమ్ము వస్తే  గడప   దాటుతూ ఉన్నానని నాకు నేనే   ఆ విషయం గమనించి వెంటనే అవతలికి దూకి ,  బ్యాలెన్స్ పోయి, కింద పడి, అప్పుడు తుమ్మాను.  అది చూసి అందరూ  పగలబడి కడుపుబ్బ నవ్వారు.
 అవి ఎనిమిదవ తరగతి పరీక్షల సమయం.    శర్మ నేను కలిసి కర్ణాకర్ ఇంటికి చదువుకోడానికి వెళ్ళాం.   ఆ వూరి లో నే దాదాపుగా నెల రోజులు ఉన్నాం.  మేము చదువుకోడానికి మాకు ప్రత్యేకంగా ఒక గది కేటాయించారు. అందులో అందరం చాపలు వేసుకుని ,హాయిగా కూర్చుని చదువుకునేవాళ్ళం.  ఒక రోజు  పాఠ్యపుస్తకాలు కాసేపు పక్కన పెట్టి పేకాట ఆడుకుందామని నిశ్చయించుకున్నాం.  తలుపు లోపలి నుంచి గడియ పెట్టుకొని  రహస్యంగా ఆట మొదలు పెట్టాం.  అప్పుడు అనుకోకుండా మా  హెడ్ మిస్సెస్  విజయం జాన్  కూడా వారి ఇంటికి వచ్చారు.   బయట ఉన్న  వరండా నుండి వారి మాటలు ,కరుణాకర్ వాళ్ళ అమ్మా నాన్న మాటలు వినిపిస్తున్నాయి.  మేము ముగ్గురము గదిలో కూర్చొని చదువుకుంటున్నాము అనే విషయం తెలిసి చాలా సంతోషించారు.  వారందర్నీ మేము  వారిని బురిడీ  కొట్టిస్తున్నామని అనే విషయం అర్ధమయ్యి ఇంకా చాలా సంతోషంగా  ఆడుకున్నాము.   ఆట మంచి  రసకందాయంలో పడింది.  కాసేపటి తర్వాత ఆటలో కాస్త తికమక మరి కాస్త
 మా లో ఆట గురించి విభేదాలు మొదలయ్యాయి. పేకాట లో అవి మామూలే కదా.  అది చిలికిచిలికి గాలివానలా గా మేము పోట్లాడుకునే స్థాయికి ఎదిగింది.  ఆ విషయంలో మేం కాస్త పెద్దగా మాట్లాడుకునే సరికి అవతల కూర్చుని  మాట్లాడుకుంటున్న  పెద్దలందరికీ మేము పేకాట ఆడుతున్న విషయం అర్థం అయిపోయింది.  అప్పుడు మా హెడ్ మిస్సెస్ "ఏరా !!  మీరు చదువుకుంటున్నారా?   పేకాట ఆడుతున్నారా? " అని ఒక పెద్ద   అరుపు అరిచింది .  ఆ  అరుపు విని అందరం బిత్తరపోయాము.  అప్పుడు గానీ మేం చేసిన పొరపాటు ఏంటో మాకు అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.  మొత్తానికి మా తెలివితక్కువతనం వల్ల   దొంగతనం పట్టుబడి   పోయింది.  ఏదైనా విషయం చెప్పి  సర్ది చెబుదాం అని అనుకున్నాం, కానీ అప్పటికే ఆలస్యం జరిగి పోయింది.   తేలు కుట్టిన  దొంగలాగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అన్ని పేక ముక్కలు దాచిపెట్టి ,ఆ గదికి  అవతలివైపు ఉన్న ఇంకొక తలుపు తీసుకొని బయటకి   పరుగు తీశాం.  ఇంటికి వెనక ఉన్న తోట లోకి వెళ్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కడుపులు  పట్టుకొని పగలబడి నవ్వుకున్నాం.   అసలు మేము పెద్దగా మాట్లాడుకున్న మాటల్లో దేన్ని     బట్టి వాళ్ళు  మేము పేక ఆడుతున్నట్లు గ్రహించారు  అన్నది ,నాకు ఇప్పటికీ అర్థం కాలేదు .     మేమంతా అనుకున్నాం ,దొంగతనం చేయడం  అంత సులభమేమీ కాదు ,  ఒకవేళ చేసినా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అని .
 కర్ణాకర్ ఇంట్లో పద్మను తల్లిదండ్రులు చూసే ప్రేమ ఆప్యాయతలను గమనించి ,నా కనిపించేది అమ్మాయిలను ఇంట్లో ఇంత గారాబంగా, ఇంత ప్రేమగా చూసుకోవాలి అందరూ అని.  పెళ్లి అయిన తర్వాత అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కదా. 
 తర్వాత ఆ అమ్మాయికి మంచి ధనవంతుల సంబంధం చేసినప్పటికీ సంసారంలో విపరీతమైన బాధలు కలిగాయి.  ఎక్కడో చదివాను ,  అమ్మాయిలకు  కేశాలు ఎక్కువగా ఉంటే  క్లేశాలు, అంటే  కష్టాలు ఎక్కువగా ఉంటాయి అని.  ప్రస్తుతం వారి పిల్లలు ఇద్దరు కొడుకు కూతురు అమెరికాలో సెటిలయ్యారు.
  ఎంతో ఉన్నతంగా బ్రతికి , పిల్లలను మంచి స్థాయికి తీసుకెళ్ళిన కర్ణాకర్ అమ్మ, నాన్న గారు ఇద్దరు కొడుకుల ఆదరణ కరువై ,వారి ప్రేమకు తపించి తపించి ,ఆఖరి రోజుల్లో, ఎంతో బాధను అనుభవించి చాలా తక్కువ వయసులోనే కాలం చేశారు.( అప్పుడు వారు   ,ఒకప్పుడు ఇంట్లో పనిచేసే వ
 సత్తెమ్మ  దగ్గర వున్నారు).  వాళ్లను కూతురు పద్మజ  చూసుకుంది.  అప్పుడు విదేశాల్లో ఉంటూ కోట్లు సంపాదిస్తున్న నా స్నేహితుడు అయిన కరుణాకర్ మాత్రం రాలేదు. ఆ సమయంలో నేను దగ్గరగా ఉండి,   కొడుకుకి బదులుగా నేను ,( అల్లుడు కూడా) కర్మ కాండలో పాల్గొని వారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాను.  కానీ  వారు ఇచ్చిన ప్రేమకు ప్రతిగా నేను ఏం చేసినా కూడా  ఆ రుణం తీర్చుకోలేను ,ఎన్ని జన్మలకైనాకూడా!
                   ***

కామెంట్‌లు