ఇదేమిటీ ఒక్క రోజేనా నాన్న...
నాన్నెప్పుడూ నాన్నే....
ఏరోజైనా నాన్నే
నాన్నను స్మరించని రోజు లేదు
"నాన్న భుజాలమీద కూర్చుని
దేవుడిని చూసే ప్రాయంలో
తెలీలేదు
దేవుడిమీదే కూర్చున్నానని" అంటూ
ఓ కవితెక్కడో చదివాను తమిళంలో
కానీ
నేనలా మా నాన్న భుజాల మీద
కుర్చుని దేవుడ్ని చూసినట్టు
నాకేమీ గుర్తు లేదు
అయితే
నేనంటూ రాయడం
మొదలు పెట్టి
అక్షరయాత్రలో
నాలుగున్నర దశాబ్దాలుగా
కొనసాగడానికి
ముఖ్యకారకులు మా నాన్నే....
నాన్న రాస్తున్న రోజుల్లో
అవి అచ్చయి
ఇంటికి వచ్చిన
దిన, వార, మాసపత్రికలలో
నాన్న పేరుమీద అచ్చయినవి చూసి
నాకూ అలా అచ్చులో
నా పేరు చూసుకోవాలనిపించి
కలంపట్టాను
నాన్న సూచనమేరకే
నేను రాసి అచ్చయిన
తొలి కథ రామకృష్ణపరమహంస
చెప్పిన నీతకథే....
ఆ ముహూర్త బలంతోనే
నేనింత కాలమూ
రాయగలుగుతున్నానంటే
అది నాన్న ఆశీస్సులే
ఛందస్సూ
అలంకారాలూ నేర్పి
శబ్దమంజరీ చదివిస్తానన్న రోజున
అవన్నీ ఎందుకని
పెడచెవిన పెట్టి
నేర్చుకోవడానికి
ఏమాత్రం మక్కువ చూపని
నేనిప్పుడు బాధ పడుతున్నా
ఆరోజెందుకు నిర్లక్ష్యం చేసేనా అని
పద సంపద లేని నేను
ఒకటీ అరా రాయగలుగుతున్న
నేను
మా నాన్న చివరి శ్వాసప్పుడూ
ఆస్పత్రిలో నేనొక్కడినే ఉన్నా
అర్ధరాత్రి దాటి గంట అయిందో లేదో
నర్స్ బయటికొచ్చి
"ఉంగ తాత్తా ఎరన్దుట్టార్!
ఉంగ అప్పావ వరసొల్లు"
(మీ తాత చనిపోయారు,
మీ నాన్నను రమ్మను. నన్ను మనవడిననుకున్నారా నర్సు) అంటూ నన్ను లోపలికి తీసుకుపోయి
కప్పేసిన తెల్ల వస్త్రాన్ని తీసి
చూడమంది భౌతికంగా దూరమైన
మానాన్నను చూపించింది
సరే, తర్వాతి తతంగాలన్నీ
జరిగిపోయి ఇరవై నాలుగేళ్ళయినా
ఇంకా ఆ సంఘటనో
నాతో రాయించిన రోజులో
మరవలేనెప్పటికీ!!
మా నాన్నకు
నేను సుపుత్రుడనో
మా అబ్బాయికి
నేను ఆదర్శ నాన్ననో
కావడంలో విఫలమయ్యాను!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి