చిన్నారులు:---గద్వాల సోమన్న
రువ్వున ఎగిరే గువ్వలు
ముద్దుగ మ్రోగే మువ్వలు
సదనములో చిన్నారులు
సతతము వెలిగే దివ్వెలు

ముద్దులొలుకు నెలవంకలు
ఆకసాన తారమ్మలు
మాటలతో మదిని దోచు
పంచదార చిలుకమ్మలు

పురివిప్పి నాట్యమాడే
అందమైన నెమలమ్మలు
చెంగుచెంగున గంతులేయు
మురిపాల జింకపిల్లలు

కొలనులోన హంసమ్మలు
గుబాళించు కలువపూలు
జాతీయ పతాకంలో
మూడురంగులు చిన్నారులు


కామెంట్‌లు