పిచ్చుక యుక్తి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  పక్షిజాతిని పరిపాలించటం కోసం రాజును, మంత్రిని నియమించాలనుకున్నాయి పక్షులన్నీ.  ఒకరోజు సమావేశం అయ్యాయి. ఎక్కువ ఎత్తుకు ఎవరు ఎగిరితే వారిని  రాజుగా, తెలివిగల వారిని మంత్రిగా ఏర్పాటు చేయదలచాయి. అందుకు పోటీ నిర్వహించాయి.  పోటీలో చాలా పక్షులు పాల్గొన్నాయి. పోటీ ప్రారంభం అయింది. అన్నీ రయ్యినా పైకి ఎగిరాయి.
       గ్రద్ద చాలా  ఎత్తుకు ఎగిరింది.  ఇక అలసిపోయి దిగింది. అప్పటికే ఓ పిచ్చుక గ్రద్దకన్న పైన ఉండటం గ్రద్ద గమనించలేదు. ఇదెలా సాధ్యమో ఎవరికి అర్ధం కాలేదు.  అనుకున్న ప్రకారం  గెలిచిన పిచ్చుకను రాజుగా నియమించాయి. అప్పుడు పిచ్చుక ఇలా అంది. "అయ్యాలారా! నేను రాజుగా  అర్హుడను కాదు. నేను ముందుగానే గ్రద్దపైన కూర్చున్నాను. రెక్కల మధ్య దాక్కున్నాను. అది పైకి ఎగిరి అలసిపోయి దిగుతుండగా రెక్కలలో నుండి బయటకు వచ్చి పైకి వెళ్ళాను. ఇది అధర్మ గెలుపు" అంది.  యుక్తితో గెలిచి, ఓటమిని ఒప్పుకున్నందుకు  పిచ్చుకను అక్కడున్న పక్షులన్నీ మెచ్చుకున్నాయి. నిజాయితిని   పొగిడాయి. గ్రద్దను రాజుగా, పిచ్చుకను మంత్రిగా నియమించాయి. ఒకే పోటీలో రాజు, మంత్రి నియామకం జరిగింది.