పీవీగారింట్లోనాఆమూల్యమైనజ్ఞాపకం:-లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్,చెన్నై

 మన ప్రియతమ నేత, అపర చాణుక్యులు ,భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నర్సింహా రావు గారి శత జయంతి సందర్భంగా వారింట్లో నా అమూల్యమైన జ్ఞాపకం
మాకు పీవీ గారి  కుటుంబం తో సాన్నిహిత్యం ఉంది. మా నాన్న గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పీవీ స్వగ్రామం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు. అమ్మ నాన్న పీవీ గారింట్లోనే అద్దెకు ఉండేవారు( కానీ అద్దె ఎన్నడూ తీసుకోలేదు) ఓకే కుటుంబంలా కలిసి ఉండేవారు. ఇప్పటికి వారి సోదరులు పీవీ.మనోహర్ రావు గారు మా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా వుంటారు. నా చిన్నప్పుడు పీవీ గారిని చాలా సార్లు చూసాను. ఎంతో ప్రేమగా మాట్లాడేవారు మా కుటుంబం తో. 
నాకు ఇంకో  అమూల్యమైన జ్ఞాపకం  ఉంది పీవీ గారితో.
పీవీ గారి సోదరులు పీవీ మనోహర్ రావు గారు  ,పీవీ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఢిల్లీ లో ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయిలో స్పిరిచుల్ కాన్ఫెరెన్సు చేశారు. అప్పుడు వారి కుటుంబంతో నేను కూడా వెళ్ళాను. 3 రోజుల సదస్సులో పీవీ గారు 2 రోజులు వచ్చారు .
కార్యక్రమంలో ఎందరో మహానుభావులు బ్యూరోక్రాట్స్, స్వామిజీలు వచ్చారు విజయవంతంగా ముగిసింది.
అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ నాకు ఒక అదృష్టం పట్టింది. పీవీ గారి సోదరుని అబ్బాయి పీవీ.మదన్ మోహన్ అన్నయ్య కుటుంబం నన్ను వారితోనే ఒక 4,5 రోజులు ఉండాలని .దగ్గరలోని పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు అని చెప్పి, అది కూడా  ప్రధానమంత్రి గారితో వారి ఇంట్లో అని చెప్పారు. ఆనందంగా అనిపించింది. P.M ఇల్లు ఒక స్వర్గం. నేను చూడటం నా అదృష్టం. మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్ళడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేసి గేట్ లోపలికి వెళ్ళి ఒక కార్ లో పీవీ గారుండే  ఇంటికి చేరుకున్నాము.
ఆరోజు ఎదో ఫారన్ డెలిగేట్స్ మీటింగ్ అయింది పక్కనే ఉన్న ఇంకో భవనంలో.మమ్మల్ని బయటికి రావద్దని ప్రోటోకాల్  చెప్పారు. మేము అలాగే పాటించాము. తెల్లవారి ఉదయం  డైనింగ్ టేబుల్ వద్ద మేమందరం ( ఏడుగురం) టిఫిన్ తింటున్నాము హఠాత్తుగా పీవీ గారు వచ్చారు బ్రేక్ ఫాస్ట్ కి. మేమంతా లేచి నిల్చున్నాము. వారు కూర్చోండి టిఫిన్ తినండి అన్నారు. ఈ అమ్మాయి ఎవరు అని నన్ను చూపిస్తూ మదన్ అన్న ని అడిగారు. వంగరలో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశారు సదాశివ రావు, చిన్నాన గారి అమ్మాయి అనిచెప్పారు. పీవీ గారు గుర్తుపట్టి మీ నాన గారు వాళ్ళు మా ఇంట్లోనే వున్నారు,మీరు అప్పటికి ఇంకా పుట్టలేదు  అని చెప్పారు. మీ నాన గారు సార్ధక నామధేయులు. నిజంగా శివుడే అన్నారు కూడాతర్వాత
ఎన్నిరోజులు వుంటారు, ఏమేం చూస్తారు లాంటి ప్రశ్నలు అడిగి. సెక్యూరిటీ బాగా ఉంటుంది మీతో.షాపింగ్ అంటూ తిరగకుండా  జాగ్రత్తగా హరిద్వార్ రిషికేశ్ చూసి రండి అని చెప్పి  ఎవరికో మమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత అప్పచెప్పారు. ఇడ్లిలు మాత్రం తినే వెంటనే వెళ్లిపోయారు పీవీ గారు.
అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పీవీ గారింట్లో వంట చేసే రాజన్న  ఇంకో అతను,(పేరు గుర్తు లేదు) వారి స్వగ్రామం వంగర వారే. మేము వెళ్తే ఆసక్తిగా ఇష్టమైన వంటలు చేసి పెట్టారు.
మరుసటి రోజు ఉదయమే మాకు హరిద్వార్ రిషికేశ్ వెళ్ళడానికి కారు, కారుతో పాటు సెక్యూరిటీ జిప్సి కూడా వచ్చింది. ప్రతి ప్రదేశం లో పక్కనే సెక్యూరిటీ వారు, అనుక్షణం మా వెంటే వున్నారు. రెండో రోజు ఢిల్లీ చేరాక ఒక గమ్మత్తు జరిగింది. మేము సెక్యూరిటీ వారికి చెప్పాము. కరోల్ బాగ్,చాందిని చౌక్ లాంటి ప్రదేశాలు చూపించండి మాకు ఆంధ్రాలో దొరకనివి కొనుక్కుంటాము అని చెప్పాము. వారు తీసుకెళ్ళారు. కానీ మా అడుగు వెనకే వారి అడుగు మొత్తానికి కాస్త ఇబ్బంది గా అనిపించి బేరమాడలేక మన ఆంధ్రా కన్నా ఎక్కువ ధరే పెట్టి ఏవో కొనుక్కున్నాము ఢిల్లీ గుర్తుగా
రాత్రి మళ్ళీ పీవీ గారి ఇల్లు చేరాము. డిన్నర్ అప్పుడు మళ్ళీ పీవీ గారు కనిపించారు. ప్రయాణం ఎలా జరిగింది అని అడిగారు. చాలా బాగా అయింది అని చెప్పాము. వారు సంతోషించారు. ఇంకా ఏవైనా చూస్తారా అని అడిగారు. మదన్ అన్న షిమ్లా చూడాలని ఉంది అన్నారు. సరే వెల్దురుగాని అన్నారు. కానీ నాకు అప్పుడే డిగ్రీ పరీక్షలు  ఉన్నాయి. నేను వరంగల్ వెళ్తాను అని మదన్ అన్నయ్యకు చెప్పాను. వారితో శిమ్లా నేనుకూడా రావాలని మదన్ అన్నయ్యా సంధ్య వదిన ముఖ్యంగా సంధ్య వదిన చెల్లెల్లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పావని, సునీత అయితే చాలా చాలా ఫోర్స్ చేశారు నేను వుండి పోవాలని వారితో శిమ్లా చూడాలని. కానీ పరీక్షలు అని చెప్పి,వారిద్దరూ,నేను మూడ్ ఆఫ్ అయినా కూడా,  టికెట్ బుక్ చేయమని చెప్పాను. వారే వచ్చి ట్రైన్ ఎక్కించారు. 
నేను వరంగల్ చేరడంతో  *మన ప్రియతమ నేత,మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నర్సింహా రావు* గారింటికి వెళ్లొచ్చినప్పటి మధురమైన,మరపురాని  అమూల్యమైన జ్ఞాపకాలు ఇదిగో ఇలా మిగిలాయి
ఇంతటి అమూల్యమైన అవకాశం నాకు కల్పించిన P. V. మనోహర్ రావు పెద్దనాన గారికి, P. V. Madan anna కి హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్సులు తెలియచేస్తున్నాను
పీవీ గారు గొప్ప రాజకీయ వేత్త, బహుభాషా కోవిదులే కాదు,ప్రేమ అభిమానానికి చిరునామా. సింపుల్ అండ్ హంబుల్ అంటే నిదర్శనం పీవీ గారే. నిత్య విద్యార్థిగా ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవారు. అతి తక్కువ రోజుల్లోనే కంప్యూటర్ వచ్చిన కొత్తలో శ్రద్దగా నేర్చుకుని ఎన్నో టైప్ చేసుకున్నారు.
 వారో మూవింగ్ ఎన్సైక్లోపీడియా
 వారి శత జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటు నమస్సులు తెలియచేస్తున్నాను

కామెంట్‌లు