పుస్తకాలు, సంపాదన:-- యామిజాల జగదీశ్

 తమిళ కవులలో నాకిష్టమైన కవికో అబ్దుల్ రహ్మాన్ ఒకరు. ఆయనను కలుసుకోవడానికి వెళ్ళాను కానీ కుదరలేదు. అప్పుడాయన ఇంట లేరు. 
ఆయన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పురుషులకు చెప్పిన చిట్కా ....
భార్య కోప్పడ్డప్పుడు వెంటనే మొగుడు ప్రతిచర్యకు దిగకూడదు అంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరించారు. 
ఆయన ఎక్కడకు వెళ్ళినా ఇంటికి తిరిగొచ్చేటప్పుడు బోలెడన్ని పుస్తకాలు తీసుకొస్తుండేవారు.
ఇంట్లో మనముండటానికే జాగా లేదంటుంటే ఈ పుస్తకాలెందుకు పట్టుకొస్తారని ఆమె ఓమారు చెప్పారట.
అయితే ఆయన ఆ మాటలు విని మౌనం వహించారే తప్ప ఎదురు ఒక్క మాటా అనలేదు.
రోజులు గడుస్తున్నాయి. 
ఓమారు ఓ తమిళ వారపత్రిక నుంచి ఆయనకు ఓ వ్యాసానికి వంద రూపాయలు మనియార్డర్ ద్వారా వచ్చాయి. 
అప్పుడాయన ఇదే తగిన సమయమనుకుని భార్యనం పిలిచి "చూసేవా, అందరికి ఆ పత్రిక వారు వ్యాసానికి అరవై రూపాయలే ఇస్తుంటారు. నాకు నలబై రూపాయలు ఎక్కువగా వౌద రూపాయలిచ్చారు. అయినా ఈ వంద రూపాయల వ్యాసానికి మూలమేమిటో తెలుసా? ఇదిగో ఈ ఇరవై రూపాయల పుస్తకమే. నేనం ఇరవై రూపాయలకు కొన్న ఓ పుస్తకంలోని ఓ అంశాన్ని ప్రధానంగా చేసుకుని రాసిన వ్యాసమే ఇప్పుడీ పత్రిక వారు ప్రచురించి వంద రూపాయలిచ్చారు" అని.
ఈ మాట తర్వాత ఆమె ఇంకెప్పుడూ ఆయన ఎన్ని పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చినా ఏమీ అనేవారు కారట.
ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తాడులే అనుకున్నారట. 
అది అక్షరాలా జరిగిందట. 
ఆయన దాదాపు నాలుగైదు వందల విభిన్న వ్యాసాలు రాయడానికి కారణం రకరకాల పుస్తకాలు చదవడమే అని కవికో అబ్దుల్ రహ్మాన్ చెప్పారు.