ఆ మేక బలంగా విధిలించే సరికి నేను, సుధాకర్ పక్కకు పడిపోయాం. ఆ మేక పాలు పిండుతున్న అజ్మీర్, దాని కాలు దెబ్బ తో ఇంకొకవైపు పడిపోయాడు వాడి చేతిలో ఉన్న పాల గిన్నె దూరంగా ఎగిరిపడి దానిలోనున్న పాలన్నీ కిందకు వొలికి పోయాయి. అసలు ఈ మేక , పాలు పిండడం, దాని దెబ్బలకు మేము పడిపోవడం ఇవన్నీ జరగడానికి కారణం నా చిన్ననాటి స్నేహితుడు అజ్మీర్,వాటితో కలిసి మేము చేసిన అల్లరి పనులు.
--------------------------------
ఆఖరి సంతానం అజ్మీర్:
----------------------------------
అదెలాగంటే,నా చిన్ననాటి స్నేహితులలో ఒకడు అజ్మీర్. నాకంటే వయసులో దాదాపుగా మూడు సంవత్సరాలు చిన్నవాడనుకుంటాను. అతనితో నా సహవాసం నా వయస్సు దాదాపు 11 సంవత్సరాలు ఉండగా జరిగింది. అంత చిన్నతనంలో కూడా చాలా ధైర్యసాహసాలతో ఉండేవాడు. మొండితనం కూడా చాలా ఎక్కువే. ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం అజ్మీర్. తనకు కావాల్సింది ఇవ్వకపోతే ఇంటి బయటకు వెళ్లి తన పెంకుల ఇంటి పైన రాళ్లు వేసేవాడు. లేదా ఇంటి పైకి ఎక్కి పెంకులు అన్ని ఒక్కొక్కటిగా పీకే వాడు. ఇంటి పైన ఉన్న పెంకులు పగిలితే, వాన నీళ్లన్నీ ఇంట్లోకి కారుతాయి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎప్పుడు వర్షం వచ్చినా ఆ కారే చోట పెద్ద పెద్ద గిన్నెలు మరియు బకెట్లు పెట్ట వలసి వచ్చేది. అప్పుడు మళ్ళీ మేస్త్రి ని పిలిచి మరమ్మతులు చేస్తే గాని ఆ నీళ్ళు ఆగేవి కావు. అది డబ్బులతో కూడుకున్న వ్యవహారం,ఖర్చు , పైగా మళ్లీ అదొక తలనొప్పి పని. దానికి భయపడి అజ్మీర్ వాళ్ళ అమ్మగారు వాడిని పిలిచి ,వాడితో బేరసారాలు చేసి, వాడు ఒప్పుకుంటే అప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చేసేది. ఆవిడ నిస్సహాయత చూసి నాకు చాలా బాధ వేసేది . కానీ ఆవిడకి మాత్రం ఎలాంటి బాధ ఉండేది కాదు. తర్వాత అవి తలచుకొని నవ్వుకొనేది!!. ఐదుగురు అమ్మాయిల తర్వాత జన్మించిన చిన్న కొడుకు కదా ? అప్పటివరకు నానా యాగీ చేసి ఏడుస్తున్న అజ్మీర్ మొహంలో వెంటనే ఏడుపు మాయమయి నవ్వులు పూసేవి. అంతసేపు ఉన్న ఏడుపులు ,అరుపులు వాడి కళ్ళలో నీళ్ళు వెంటనే ఒక నిమిషంలో మాయం అయిపోయేవి.
వెంటనే మమ్మల్ని బజార్ కి తీసుకుని వెళ్లి రకరకాల తినుబండారాలు కొని, మాతో కలిసి పంచుకునే వాడు.
-----------------
మేకల వేట:
-----------------
ఒకసారి మేక పాలు చాలా బావుంటాయి అన్న విషయం మా లో చర్చకు వచ్చింది. గాంధీ తాత గారు ఎప్పుడూ మేక పాలు తాగే వారు అని , అవి ఆరోగ్యానికి మంచిది అని, మేము చదువుకున్న పుస్తకాల్లో ఉండేది. ఆ పాలు ఎలా సంపాదించాలో ఎక్కడినుంచి తేవాలో మాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు ఒక ఐడియా తట్టింది. రోడ్లమీద తిరుగుతున్న మేకలను పట్టుకుని పాలు పిండు కుంటే ఎలా ఉంటుంది అని. ఇక అపుడు మొదలుపెట్టాం మేకల వేట. కాని ఎంత పరిగెత్తినా అవి మాకు దొరకడం చాలా కష్టం అయింది. ఒకవేళ దొరికినా వాటిని నిలువరించడం మావల్ల
కాలేదు. అప్పుడు మాకు అజ్మీర్ ఒక ఉపాయాన్ని చెప్పాడు. అదేమిటంటే రాగి ఆకులు మేకలు బాగా తింటాయి ,వాటిని ఎరవేసి పట్టుకుందామనీ. మా ఇంటి వెనక పెద్ద రాగి వృక్షం ఉండేది. దాని మొదలు దాదాపుగా ఐదు అడుగుల వ్యాసంతో ఉండేది. ఇక దాన్ని ఎక్కడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. అది ఎవరి వల్ల కాలేదు. అప్పుడు అజ్మీర్ ఇంటి పైకి ఎక్కి ఆక్కడ నుండి అందుతున్న ఆకులు తీసుకుని వచ్చాడు. వాటిని తినిపిస్తూ పాలను పిండు కొనే ప్రయత్నం చేశాము.
ఆకులు తినేవి కానీ పాలు ఇచ్చేవి కాదు. పైగా వీధిలో అందరూ చూసి తిట్టేవారు. ఇలా కాదులే అనుకొని వాటిని మా ఇంట్లో కి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసాము. కానీ అవి వచ్చేవి కావు వాటి బలం ముందు మా బలం సరిపోయేది కాదు. ఇలా అయ్యే పని కాదని ఇంకో ప్రణాళిక రచించాను . అది ఎలాగంటే, రాగి చెట్టు ఆకులని వీధి నుండి గజానికి ఒకటి చొప్పున మా ఇంటి లోపల వరకు పెట్టాం. అప్పుడు ఆ మేక వాటిని ఒక్కొక్కటిగా తింటూ దానికి తెలియకుండానే మా ఇంట్లోకి ప్రవేశించేది. అది లోనికి రాగానే తలుపు వెనకాతల నక్కిన అజ్మీర్ వెంటనే
తలుపులు చాలా వేగంగా వేసేవాడు. కానీ అప్పుడు కూడా మాకు అంత సులువుగా అది చేతికి చిక్కేది కాదు , దొరకకుండా మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి పరిగెత్తేది. మధ్యమధ్యలో కొమ్ములతో పొడవడానికి ట్రై చేసేది కూడా. మొత్తానికి నానా బాధలు పడి మేక కాళ్లు, మెడ పట్టుకొని పాలు పిండుకుని వారం. మహా అయితే ఒక గ్లాసు పాలు వచ్చేవి .వాటిని మరగబెట్టి తలా కాసింత తాగేవాళ్ళం. వాటిలో కలుపుకోవడానికి చక్కెర కావాలి. అది ఒక పెద్ద ప్రహసనం.దానికి ఇంట్లో రభస. రెండు స్పూన్ల చక్కర ఇవ్వడానికి ఇంట్లో నానా గొడవ చేసేవారు. ఒక కిలో చక్కెర 80 పైసలు ఉండేది. అయితే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. తాగేవి పావు గ్లాసు పాలే అయినా, అవి తాగుతూ ఉంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు!
---------------------
గాలిపటం కథ :
---------------------
అజ్మీర్ తో కలిసి చేసిన ఇంకొక ప్రహసనం ఏమిటంటే గాలిపటాలు సొంతంగా తయారు చేసుకోవడం. గాలిపటాలు చాలా త్వరగా చినిగి పోవడం లేదా గాలిలో ఆడిస్తూ ఉన్నప్పుడే తెగి పడడం ,పోవటం లాంటివి జరిగేవి. వాటి ధర ఐదు పైసలు 10 పైసలు మాత్రమే అయినా ఇంట్లో ఇచ్చేవారు కాదు. ఇంట్లోనే కాదు దేశమంతా కూడా ఆర్థిక పరిస్థితి అలాగే ఉండేది. ఈ సమస్యను అధిగమించడానికి అజ్మీర్ చెప్పింది ఏంటంటే మనం గాలి పటాలు ఎందుకు తయారు చేసుకోకూడదు అని. ఇంట్లో ఉండే చీపురు పుల్లలతో న్యూస్ పేపర్ ల తో ,తెలుపు రంగు కాగితాలతో గాలిపటాలు తయారు చేయడం మొదలుపెట్టాను. చూడటానికి అవి బ్రహ్మాండంగా కనిపించాయి. కానీ ఎందువల్లనో ఏమో ఎంత ప్రయత్నించినా అవి గాలిలోకి ఎగరకుండా మొరాయించేవి. ఎన్ని రకాలుగా తయారుచేసినా , ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అవి మాత్రం ఎగిరి చావలేదు. ఆ ఓటమి చాలా రోజులు మాకు మింగుడు పడలేదు. ఏం చేస్తాం అది మర్చిపోయి, ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుకొని ఆ గాలిపటాల సీజన్ను కానిచ్చేశాం. గాలిపటాలు తయారు చేసేటప్పుడు చేసిన విధానం లోపం ఏంటో, అసలు ఎందుకు అవి గాలిలోకి ఎగుర లేదో ఎంత తలలు కొట్టుకున్నా
మాకు ఎప్పటికీ అర్థం కాలేదు
------------------
హొటల్ కథ :
------------------
మా ఊరి సెంటర్లో ఇందిరా భవన్ అనే ఒకే ఒక ఉడిపి హోటల్ ఉండేది. అందులో టిఫిన్లు చాలా బాగా ఉండేవి. పెద్ద వారు మాత్రమే అందులోకి వెళ్ళి తినేవారు .పిల్లలు దాదాపుగా హోటల్ లోకి వెళ్లడం అనేది అరుదుగా జరిగేది. ఏ టిఫిన్ ధర అయినా ఒక పావలాకు దొరికేది. పెద్దవాళ్లు చాలా వరకూ అందులో కాఫీలు తాగుతూ , టిఫిన్లు తింటూ కనిపించేవారు. మరికొందరేమో ఆ హోటల్ బయట ఉన్న చెట్టు కింద బాతాఖానీ కొడుతూ నిలబడి ఉండేవారు. అప్పుడప్పుడు అక్కడ నుండి మా బాబాయ్ బూందీ కార తీసుకుని ఇంటికి వస్తే దాంట్లో కాసిన్ని బొరుగులు కలుపుకొని దాని పరిమాణం పెంచి తినేవాళ్ళం.
అందులోకి వెళ్ళి తినడం అనేది మాకు దాదాపుగా కల లాగా ఉండేది. అప్పుడప్పుడు అజ్మీర్ తీసుకొని వెళ్లి నాకు టిఫిన్లు తినిపించే వాడు. మా బాబాయి చూడకుండా ఆయన కనపడకుండా జాగ్రత్త తీసుకుంటూ భయం భయంగా వెళ్లి తినేవాణ్ణి. ఆ హోటల్లో ముందున్న హాల్ కాకుండా వెనకవైపు కూడా ఒక చిన్న గది ఉండేది. దానికి ఇంకో వైపు గుండా బయటికి వెళ్లడానికి ఒక తలుపు, ఆ తలుపు పక్కన ఎత్తయిన అరుగులు దాని కింద వీధి ఉండేది. ఒకసారి ఇలాగే మసాలా దోశ తినిపించాడు అజ్మీర్. చెరి ఒక గులాబ్ జామున్ కూడా తిన్నాం. ఇక చేతులు కడుక్కొని బిల్లు కట్టవలసిన సమయం వచ్చింది . అప్పుడు అజ్మీర్ అటు ఇటు చూసి ఆ రూమ్ లో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని ,తర్వాత "శ్యామ్! ఇప్పుడు మనం ఆ వెనుక తలుపు గుండా వెంటనే పరిగెత్తాలి!! , పదపద!!!" అంటూ పరిగెత్తాడు. నాకు పరిస్థితి అర్థం కాక గుండెలు అదురుతూ ఉండగా నేను వాడి వెనక పరిగెత్తాను. ఆ వెనుక తలుపు లో నుంచి బయటికి వచ్చి అరుగు మీద నుంచి వీధిలోకి దూకి వెనక్కి చూడకుండా పరుగు
లంకించుకున్నాము. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడప్పుడే మనము హోటల్ కి వెళ్ళ కూడదు అని మాకు సలహా ఇచ్చాడు. మళ్లీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళాము. ఎందుకంటే మా ఊర్లో అదొక్కటే హోటల్ మరి. ఈసారి మేము కూర్చున్న తర్వాత అందులో ఉన్న ఒక పని వాడు మమ్మల్ని గుర్తు పట్టాడు. అజ్మీర్ ను పట్టుకొని నిలదీశాడు. ఇక మా పని అయిపోయింది, అనవసరంగా వాడితో వచ్చాను అని తల బాదుకున్నా ను. అయితే అజ్మీర్ మాత్రం ఎక్కడా జారకుండా, కంగారు పడకుండా , అమాయకంగా ముఖం పెట్టి ఏమైంది ? నాకేం సంబంధం, నాకేం తెలియదు, అంటూ చాలా నిదానంగా నిలకడగా సమాధానం చెప్పాడు . వాడి ధైర్యాన్ని చూసి మనసులో మెచ్చుకో లేకుండా ఉండిపోయాను. ఆ పని వాడు మొత్తానికి ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ వదిలేశాడు. ఆ తర్వాత ఎప్పుడు రమ్మన్నా నేను ఆ హోటల్ కి వెళ్ళలేదు అనుకోండి అది వేరే సంగతి.
ఇదిగో ఇలాంటి పనులు వాడు చేయడమే గాక మాతో కూడా చేయించేవాడు. అజ్మీర్ ఎన్ని రకాలుగా సతాయించిన , ఎన్ని రకాలుగా బెదిరించి డబ్బులు తీసుకున్నా సరే వారి అమ్మగారు మాత్రం ఏమీ అనక పోయేవారు. ఆ తర్వాత వాడు ఏరకంగా తనని హింసించినది ,ఏ రకంగా డబ్బులు తీసుకుంది అందరి తోటి చెప్పుకొని మురిసిపోయేది. కొడుకుని దార్లో పెట్టట్లేదు, భయం లో ఉంచటం లేదు, పైగా కొడుకుని చూసుకొని నడుస్తుంది అని అనుకునేవాణ్ణి. కానీ ఏది ఏమైనా అది తల్లి మనసు కదా. ఆ వయసులో తల్లి మనసు ఏంటో మాకు అర్థం కాలేదు. తల్లి మనస్సు తల్లికి తప్ప ఇంకొకరికి అర్థం కాదని తర్వాత తెలిసింది. కొడుకు ఎంత గొప్పవాడైనా కాకపోయినా తల్లి మాత్రం అంతే ప్రేమిస్తుంది అన్నది తెలిసింది. అజ్మీర్ వాళ్ళ నాన్న గారి పేరు ఖాజా మొయినుద్దీన్. నాయబ్ తహసిల్దార్ గా పనిచేసేవారు. వారి నాన్న గారు నల్గొండ కు ట్రాన్స్ఫర్ కావటం వలన వాళ్ళ కుటుంబం మొత్తం నల్గొండకు వెళ్ళిపోయింది.
బాల్యంలో స్నేహితులు వారి వారి ప్రత్యేకమైన మనస్తత్వము కలిగి ఉంటారు. అయినప్పటికీ అందరూ కలిసి ఆడుకుంటాం.
యెటువంటి తగాదాలు కొట్లాటలు వచ్చినా కూడా అది కొద్ది సమయం వరకు
మాత్రమే. వాటిని గుర్తు పెట్టుకుని కక్షలు పెంచుకోము. అది మన వయస్సు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే దుర్గుణం. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని బాల్యం గురించి ఆలోచిస్తే అందులో కొందరు చాలా ముఖ్యమైన పాత్ర వహించి మరచిపోలేని స్నేహితులుగా మిగిలిపోతారు. అందులో ఒకరు అజ్మీర్.
*************
ఫొటోలో...
చిన్న నాటి అజ్మీర్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి