బుద్ధిబలం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక ఊరిలో ఓ వస్తాదు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు. తన కండలు చూసుకుని మురిసిపోయేవాడు. తనతో ఏ పోటీకైనా రమ్మని సవాలు విసిరేవాడు. అతడి బలం ముందు ఎంతటి వాడైనా బలాదూర్. ఓటమిని అంగీకరించి తల వేలాడేయవలసిందే. 
     ఒకరోజు పట్టణంలో పోటీ జరుగుతుంది. పోటీకి వచ్చిన వారందరినీ చిత్తుగా ఓడించాడు.  విజయ గర్వంతో విర్ర వీగుతున్నాడు. అప్పుడు ఓ పన్నిండేళ్ల బాలుడు వచ్చాడు. "అయ్యా!  మీరు చాలా బలవంతులు కదా? ఈ చేతి రుమాలును గోడవతలకు విసరండి చూద్దాం?" అన్నాడు. 
       "ఓరి పిల్ల వెదవా! ఇదేంత పని"  అని విసిరాడు. అది అక్కడే పడింది. మళ్లీ బలంగా విసిరాడు. మళ్ళీ అక్కడే పడింది.  అలా అనేకసార్లు విసిరాడు. అది అక్కడే పడుతుంది. ఇక ఓటమిని ఒప్పుకున్నాడు.   
        "నీవు విసురు చూద్దాం" అన్నాడు.  బాలుడు చేతి గుడ్డకు చిన్న రాయిని కట్టి విసిరాడు. అది గోడవతల పడింది.  బుజ బలం కన్నా బుద్ధిబలం గొప్పదని వస్తాదు గుర్తించాడు. మరెప్పుడు పోటీకి సవాలు విసరలేదు.
కామెంట్‌లు