తెలుగు తేనియలు: హజరత్తయ్య- సింగరాయకొండ-- ప్రకాశం
1) జీవితంలో కోల్పోయింది
తిరిగిపొందడం కష్టమే
జీవితంలో పోయిన ప్రేమను 
పొందడము కష్టసాధ్యమే

2) ఇష్టంతో చేసే పనులకు
విజయాలు బాగా వచ్చును
ఎదుటివారిలో మంచి చూసే
మనసుకు ప్రశాంతత దొరుకును

3) మనుషులు పుట్టిన నాటినుండి
మంచి కోసం కృషిచేయండి
మరణాన్ని పొందే నాటికి
జననం సార్థకం చేసుకోండి

4) నిదురించేది రేపటి కొరకు
ప్రతి వేకువ మన కొరకే
అస్తమయం మరో వేకువకే
సాగిపోవాలి కడవరకు

5) అబద్ధానికి వేగం ఎక్కువ
త్వరగా ప్రచారం జరుగును
నిజానికి సహనం తక్కువ
నిదానంగా జనాల కెక్కును

6) చెట్టు ఎంత గట్టిగా ఉన్నా
కాలాన్ని బట్టి పూలు పూచు
 నువ్వెంత నీతిగా బ్రతికినా
కష్టాలు కన్నీళ్లు ఎదురుచూచు

7) ఏ మనిషి కూడా పుట్టుకతో
 వెంట తెచ్చుకోడు శత్రువును
వారి ప్రవర్తన మాటతీరు
మంచి చెడులను నిర్ణయించును

8) మనస్సు ఉంటే సరికాదు
కొంచమైన అర్థం చేసుకో
అపార్థాలను విడిచిపెట్టి
ఎదుటివారి మనసు తెలుసుకో

9) జ్ఞానము విజ్ఞానము ఇచ్చు
తెలివి విజ్ఞతను నేర్పించు
సంస్కారం మాట్లాడుట నేర్పు
సామర్థ్యం విజయం అందించు

10) మూర్ఖుడితో వాదించ వద్దు
నీ ముఖ్యమైన సమయమును
తెలివైన వారితో గడుపు
జీవితములో చాలా తెలియును

11) గొప్పలు చెప్పుకునే వారు
గౌరవం పోగొట్టు కుంటారు
కోపంతో రగిలే వారు
తననే పోగొట్టు కుంటారు

12) నిజమైన బంధాల కోసం
సమయాన్ని వెచ్చించ వచ్చు
సమయం కేటాయించే రోజు
బంధాలు ఉండక పోవచ్చు

13) ఎదుటి వారితో పోటీ పడు
వారి నాశనం కోరకూడదు.
పతనం కోరే మనస్తత్వం
మనకే ప్రమాదం కాగలదు

14) నీవు వయసులో ఉన్నప్పుడు
కష్టానికి సిగ్గు పడవద్దు
భయపడి మనం ఒళ్ళు దాచి
అందరి ముందు తలదించవద్దు

15) పేదరికం ఎన్నో నేర్పును
బ్రతకడం ఎలాగో నేర్పును
జీవితంలో క్రింద పడినా
లేచి నిలబడడం నేర్పును

16) ఇదివరకు మంచిపని చేస్తే
మిత్రులు తప్పక ఉండేవారు
ఇప్పుడు మంచిపని చేస్తే
శత్రువులు మిగిలి పోతున్నారు
17) మన మాట్లాడిన మాటలు
మనకు గుర్తుఉండక పోవచ్చును
విన్న వ్యక్తికి ఆ మాటలు
ఎప్పటికి గుర్తుండి పోవును

18) నువ్వు చేసే పని గురించి
నీ మనసుకు చెబితే చాలును
అందరికీ నచ్చ చెప్పాలంటే
నీ జీవితం ఇంకి పోవును

19) ఒకరు ఏదో అన్నారని
విడవకు ఇష్టమైన వాళ్లను
మంచి చెడులను ఆలోచించి
తీసుకో మంచి నిర్ణయమును

20) మనుషులు పడే బాధలుచూచి
కరుణతో మేఘము వర్షించును
మనుషులు ఆకలిని తెలుసుకుని
చెట్లు ఫలములు అందించును

21) దీపం కాంతిని వెదజల్లుతూ
తనను పరిచయం చేసుకునును
వ్యక్తిత్వం గలవారు కూడా
ఫలితం ఆశించక కష్టపడును

22) ఎప్పుడు నీ స్వార్థంకోసం
బ్రతక ఇతరులకు సాయపడు
వారి నీలోని గొప్పతనాన్ని
చూచి నీవంటే ఇష్టపడు

23) డబ్బుతో పైకి వచ్చినవారు 
డబ్బులకే విలువ నిస్తారు
కష్టపడి పైకి వచ్చినవారు
కష్టాన్ని నమ్మి సాగుతారు

24) పురుగు లాగా ఉన్నప్పుడు
ఛీ అని చిరాకు పడతారు
సీతాకోకచిలుకగా మారితే
అందం చూసి మురిసిపోతారు

25) మనం కాపాడ బడడానికి
ఇతరుల మీద నిందవేయకు
కాలచక్రంలో నిజము నిన్ను
 దోషిగా నిలబెట్టు మరవకు

26) సినిమాల్లో నటన కంటే
బయట ఎక్కువగా నటిస్తారు
కొంతమంది నటించడంలో
ఏకంగా జీవిస్తున్నారు

27) అర్థం చేసుకునే మనసు
ఓదార్చ కలిగిన హృదయము
చేతులు కలిపిన స్నేహము
మనకు దేవుడిచ్చిన వరము

28) సంతోషం నేర్పు లేనివి
కన్నీళ్లు మనకు నేర్పించును
గెలుపు నేర్పలేని పాఠాలను
ఎన్నో ఓటమి నేర్పించును

29) ఒకరు మాటలు విని ఇతరులపై
అభిప్రాయానికి రాకూడదు
మన కంటితో చూడని వాటిని
ఎవరు చెప్పినా నమ్మరాదు

30) లోకులు కాకులు లాగానే
కనిపించింది నమ్మేస్తారు
ఏ మాత్రం ఆలోచించక
నమ్మి మాటలుజారుతారు

31) ఒక్కోకసారి మన కళ్ళు
మనల్ని మోసం చేస్తాయి
మరొకసారి చెప్పుడు మాటలు
జీవితాన్ని పాడు చేస్తాయి

32) ముందు వైపు పొగుడుతూనే
వెనుకన తిడుతూ ఉంటారు
మన వెంట ఉంటూనే మన
నాశనమును కోరుకుంటారు

33) పూచే ప్రతి పువ్వు దేవుని
పాదాలను చేరాలను కునును
పుట్టిన ప్రతి మనిషి లక్ష్యము
సాధించాలని కృషి చేయును

34) తప్పులు చేసే వారిని మనం
 ఒక్కసారి క్షమించ వచ్చు
మోసం చేసే వారిని మాత్రం
ఎప్పటికీ క్షమించక పోవచ్చు

35) గొడవ లయినప్పుడు తగ్గితే
బంధువులలో నిలబడతాము
ఒక్క క్షణం నీవు ఓడినా
జీవితాంతం గెలుస్తాము

36) నాన్నను చూసి నేర్చుకో
కష్టపడనిది ఏదీ రాదని
అమ్మను చూశాక తెలుసుకో
ఓర్పు చాలా అవసరమని

37) జీవితాన్ని చదివే ముందు 
మన కుటుంబాన్ని చదవండి
సమాజాన్ని చదివే ముందు
నీ బాధ్యతలను తెలుసుకోండి

38) పదిమంది మిత్రులు కూర్చొని
చెడు విషయాలు చర్చించబోకు
మంచి పుస్తకాన్ని చదివిన
తెలివిని పెంచునని మరిచిపోకు

39) పాడుతా తీయగా అంటూ
పాడెను ఎన్నో వేల పాటలు
స్వరాభిషేకంలో స్వరాలను
పలికించి అలరించే బాలు

40) కోయిలకు ఈర్ష్య కలిగించెను
ప్రకృతికి పులకింప జేసెను
ఎందరో హృదయాలను మీటి
వినిపించే బాలు పాటలను

41) పాటతో మేఘాలు వర్షించే
గానముతో శిలలు కరిగించెను
పాటకు ప్రాణం పోసిన బాలు
గానగంధర్వుడిగా నిలిచెను

42) పేద పిల్లలు చదువు మీద
ఎదగడంపై దృష్టి పెట్టుము
గురియవుతున్న అవమానాలకు
విద్య చక్కటి పరిష్కారము

43) గుండె మీద కుంపటి కాదు
గుర్తుగా నిలిచే సంపుటి తాను
గుండెను కాచె దేవత కూతురు
అండగా నిలిచే దివిటీ తాను

44) లక్ష్యం నెరవేరాలంటే
పట్టుదల అదృష్టం కావాలి
అన్నిటికీ మించి మానవునికి
ఏకాగ్రత తప్పక ఉండాలి

45)  అధైర్యం ఆవహిస్తే దానిని
మొగ్గలోనే తుంచేయండి
అనుమానం వచ్చినా మీరు
విజ్ఞతతో వ్యవహరించండి

46) ఈ రోజే చివరి రోజులా
జీవితాన్ని బాగా చదవండి
ఎప్పటికీ నిలిచి ఉండేలా
మీరు జ్ఞానాన్ని సాధించండి

47) ఎదురు దెబ్బలను భరిస్తేనే
 జీవితంలో మనం గెలిచేది   
కష్టాలను అధిగమిస్తే కదా 
గెలుపు శిఖరం చేరుకునేది

48) మనుషుల మధ్య ఆత్మీయతకు
కానక్కర లేదు బంధువులే
మనసుకు నచ్చిన వారందరూ
నిజమైన ఆత్మ బంధువులే

49) మైత్రికి వయసుతో పని ఉండదు
డబ్బుతో సంబంధం లేదు
కుల మతాల విభజనలు లేవు
మంచి మనసే మైత్రికి పసందు

50) ఇతరులను గౌరవించడం
మహాత్ములు చూపిన మార్గాలు
అందరు కలిసి బతకడమనేది
మనిషి ఉన్నతమైన లక్షణాలు

51) నోటి లోకి వెళ్లే ఆహారం
రుచిగా ఉండటం ముఖ్యం
నోటి నుండి వచ్చే మాటలు
పెంచును నీయొక్క ప్రాముఖ్యం

52) ఒకరికి మంచి చేయకున్నా
చెడును మాత్రం చేయకండి
ఒకరి చెడును చెప్పి మిమ్మల్ని
మీరు హత్య చేసుకోకండి

53) చేదు జ్ఞాపకాలను వదిలేసి
అందమైన రోజును గడుపుము
గతమును మరిచి ముందుకు సాగు
జీవితములో తృప్తిని పొందుము

54) ఇతరులను బాధపెట్టటమే
బలహీనుల యొక్క లక్షణం
అందరూ బాగును కోరడం
బుద్ధిమంతుల యొక్కలక్షణం

55) ఎక్కడ విన్న మాటలను
అక్కడే మరచి పోవలెను
మాటలను మోయటం వలన
జీవితాలు నాశనం అగును

56) ప్రపంచంలో బ్రతకడానికి
మాటల గారడి ప్రదర్శించు
నిజాయితీని నమ్ముకుంటే
సమాజం నిన్ను గౌరవించు

57) హృదయంలో జీవించటము
ప్రేమకు మాత్రమే సాధ్యం
హృదయంగా జీవించడం
మాత్రం స్నేహానికే సాధ్యం

58) మాట జారుతావు కోపంలో
సమన్వయం కోల్పోతావు
కోపంలో జారిన మాటలు
జీవితంలో నిలిచిపోవు

59) మనసుకు ఆశలు ఎక్కువ
నచ్చిన ప్రతిది కావాలనును
కాలానికి స్పష్టత ఎక్కువ
దేవుడు తలచినదే ఇచ్చును

60) కలాం పసినవ్వుల పండితుడు
దేశ రక్షణ అతని మంత్రం
ప్రయోగాలలో అసాధ్యుడు
పౌర శిక్షణ నిత్య తంత్రం

61) కలాం కలలు సాకారమనినా
అతను సూక్తి స్ఫూర్తి నింపును
ఆశయ సాధనలో మిన్నగా
అతని ఆర్తి అభివృద్ధి నిచ్చును

62) దేశానికి ప్రథమ పౌరుడు
కలాం నైపుణ్యం గొప్పది
జ్ఞానాన్ని పంచి పెంచినాడు
దార్శనికత ఆదర్శమైనది

63) సంతృప్తితో ఉన్నవారికి
పేదరికం అయినా ఆనందమే
అసంతృప్తి ఉన్నవారికి
ఐశ్వర్య మున్నా దుఃఖమే

64) అందరిని సంతోష పెట్టడం
మనకు చాలా కష్టమైన పని
అందరితో సంతోషంగా 
ఉండడం మనకు సులువైన పని

65) తాటి చెట్టు ఎంత పెరిగినా
దానికింద ఎవరు నిలబడరు
వయసు పెద్దదైతే కాక
మంచి ఉంటేనే గౌరవిస్తారు

66) మనం కాపాడుకోవడానికి
ఇతరులపై నింద వేయకు
నిజాన్ని నిరూపించే శక్తి 
కాలానికి ఉందని మరువకు

67) పరుపు ఉన్నంత మాత్రాన
మనకు బాగా నిద్ర పట్టదు
ప్రశాంతంగా ఉన్నప్పటికి
మనస్సుకు చింతన ఉండదు

68) ధనం సంపాదించాలంటే
నువ్వు కష్టపడి సంపాదించు
మనస్సులో స్థానం కొరకు
ఎదుటివారి మనస్సు గ్రహించు

69) మన కంటితో చూడని వాటిని
ఇతరులతో పంచుకోవద్దు
చెప్పుడు మాటల వలన మనం
అనుబంధాలు కోల్పోవద్దు

70) కోల్పోయిన వాటి గురించే
ఆలోచిస్తూ కూర్చోకండి
దేవుడు బాధలను మరిచే
హృదయాన్ని తప్పక ఇస్తాడండి

71) ఎదుటి వారి హృదయాలలో
చోటు సంపాదించుకోవడము
జీవితంలో అన్నిటికంటే
ముఖ్యముగా నీవు భావించుము

72) ఎన్ని నీళ్లు మనం పోసినా
ఎడారిన మొక్కలు పెంచలేము
ఎంత సేవ మనం చేసినా
అమ్మనాన రుణం తీర్చలేము

73) ప్రేమ ఒక్కటే సరిపోదు
అర్థం గ్రహించే మనసుండాలి
సంపద ఉంటే సరిపోదు
సాయం చేసే గుణముండాలి

74) ముందు వాళ్ల అన్న మాట
ఎవ్వరికి మాత్రం చెప్పరు
మనం ఏమన్నామో మాత్రం
బాగా ప్రచారం చేస్తారు

75) సంపాదిస్తున్నంత కాలం
అందరికీ ఆత్మీయులమే
సంపాదన ఆగిపోతే
అయినోళ్ళకి పరాయివాళ్ళమే

76) అర్థం చేసుకునే మనసు
చెయ్యందించే స్నేహాలు
మనల్ని ఓదార్చే హృదయము
జీవితానికి మంచి ఆస్తులు

77) మంచి అలవాటున్న వారికి
మనసు హాయిగా ఉంటుంది
ఎదుటివారి ఎదుగుదల చూస్తే
జీవితం ఆనందమవుతుంది

78) పెరుగులో దాగియున్నటువంటి
నెయ్యికే విలువలు ఎక్కువ
మనిషిలో ఉన్న వాటి కంటే
మంచితనానికి విలువ ఎక్కువ

79) మనశ్శాంతి లేని జీవితం
ఎక్కువ బాధని ఇస్తుంది
మనసులో ఉన్న బాధ మాత్రం
ప్రతిక్షణమూ చంపుతుంది

80) ఈర్ష్య పడే కళ్ళు ఉంటాయి
నీ గమ్యం చేరే దారిలో
సాగిపో నిరంతరంగా
లక్ష్యం వచ్చి చేరి జేబులో

81) జీవితంలో ఎవరికి ఎవరూ
శాశ్వతం కాదు తెలుసుకో
ఉన్నన్ని రోజులు అందరితో
కలసి బతకడం నేర్చుకో

82) మాటలు మనుషులు మధ్య ఉన్న
దూరాన్ని దగ్గర చేయగలవు
మాటలు మనిషి జీవితంలో
అమృతములను నింపను గలవు

83) జీవితం సులభంగా ఉండదు
మనమే దృఢంగా ఉండాలి
అందుకే అన్ని పరిస్థితులను
ఎదుర్కొనే ధైర్యం ఉండాలి

84) కాలం ఆగక నడుస్తు ఉండు
అందుకే ఎప్పుడు గెల్చి తీరు
మనిషి కొన్నిసార్లు ఆగితే
తరచుగా ఓటములు దరిచేరు

85) మంచో చెడో ఒకడుగు వెయ్యి
గెలుపు వస్తే ముందుకెళ్ళు
ఓటమైతే ఆలోచించి
వ్యూహాలు మార్చి ముందుకెళ్ళు

86) సింహాంలా పరిగెత్తాలని
అందరికీ కుతూహలమే
జింక చాకచక్యం మాత్రం
కొందరికి మాత్రం సాధ్యమే

87) అవసరం లేని వారి గురించి
ఆలోచించి లాభం లేదు
మన విలువ తెలియని వారితో
ఏం చేసిన మన విలువ తెలియదు

88) అందం దుస్తుల్లో లేదు
మనిషి మంచితనంలో ఉంది
అలంకరణలో లేదు అందం
ఆదరించే మనసులోఉంది

89) ఆస్తులు కూడ బెట్టలేదని
అమ్మనానపై కక్ష కట్టకు
కని పెంచడం వారి బాధ్యత
నీవునిలబడి సాగు ముందుకు

90) మనం చదివిన ప్రతి అక్షరం
మనకు ఉపయోగపడుతుంది
చేసిన మంచి పని కూడా
తిరిగి మనకు మంచి చేస్తుంది

91) ప్రతి తప్పుకు  సరిదిద్దుకునే
ఒక అవకాశం ఉంటుంది
జరిగే తప్పులకు కాలమే
మనకు సమాధానం చెబుతుంది

92) నమ్మకం మన మీద ఉంచితే
అది మనకు బలం అవుతుంది
వేరొకరి పైన ఉంచితే
అది బలహీనత అవుతుంది

93) మౌనానికి రూపం లేదు
దహించు శక్తి మాత్రం ఉంది
మాటకు పదును లేకపోవచ్చు
మనసుని ముక్కలు చేస్తుంది

94) నచ్చని క్షణాలు వస్తాయి
మోసపోయానని మదన పడకు
గమ్యం చేరుకోవాలంటే
అడ్డంకులు దాటి సాగు ముందుకు

95) జీవితంలో ఓడిపోవడం
అనేదంటూ ఏమీ ఉండదు
జీవితం అనేది పాఠశాల
నిత్యం నేర్చుకోక తప్పదు

96) సుఖంగా ఉండాలి అంటే
జరిగిన దాన్ని మర్చిపోవాలి
మనిషి ఎప్పుడు జరిగే దానికి
 సంసిద్ధుడై ఉండి తీరాలి

97) అబద్ధాలు చెప్పే వాడికి
ఆనందం అనేది ఎక్కువే
నిజాయితీగ ఉండేవాడికి
మనశ్శాంతి అనేది తక్కువే

98) ఎదుటి వారికి నచ్చాలంటే
బతుకును సర్దుకు పోవాలి
అందరు చేరాలంటే నిను
జీవితాన నవ్వుతు బతకాలి

99) నీకు విలువ ఉండాలంటే
నిను గుర్తించు వారితో నడువు
నీ విలువను గుర్తించలేని
వారితో నడవద్దు నీవు

100) మట్టిలో మలిన పదార్థాలను
విగ్రహం చేస్తే మొక్కుతారు
అప్పుడు ఎవరు మట్టిని చూడరు
ఇష్టదైవాన్నే చూస్తారు