రంగారు బంగారు తంగేడు తెలంగాణ:-చంద్రకళ. దీకొండ
అన్నా అక్కా అంటూ
ఆప్యాయతా పిలుపులు...
భయ్యా బేటా అంటూ హిందీ, 
ఉర్దూ పదముల అలై బలైలు...!

ఉన్నదానిలో పంచుకుతినే ఔదార్యం...
తెలియనివారిని కూడా
కలుపుకునే స్నేహగుణం...
లేమినైనా సంతోషపు 
కలిమితో జీవనం...!

కాకతీయ శిల్పకళా తోరణం...
గోలుకొండ కోట ప్రాభవం...
రామప్ప ఉలిచేతల వైభవం
కలిగివున్న అశ్మిక జనపదం...!

పోతన భాగవత సుధ...
గోపన్న రామకీర్తనామృతం...
పాల్కురికి,మల్లినాథల 
రచనా వైశిష్ట్యం పొదవుకున్న
త్రిలింగదేశం...!

పొట్టికవితల అలిశెట్టి గట్టిదనం...
దాశరథి,కాళోజీల పౌరుషాగ్ని...
సినారె గజళ్ళ సృజన...
గద్దరన్న,గోరేటి ఎంకన్నల
ఉరకలెత్తించే పాట...
కూత ఆపని కబడ్డీ ఆట...!

రుద్రమ్మ పరిపాలనా యుక్తి...
సమ్మక్క,సారలమ్మల 
పోరాట

శక్తి...
బహుభాషా కోవిద పీ.వీ.ఠీవీని
స్ఫూర్తిగా నిలుపుకున్న తెలంగాణం...!

పాలపిట్ట పరుగులతో
కనువిందు చేసే 
పోరాటాల గడ్డ...
రంగారు బంగారు తంగేడు
పువ్వుల తెలంగాణ...!!!