తిట్లు తిట్టే చెట్టు:-ద్వారపురెడ్డి. జయరాం నాయుడు(టీచర్)కైకలూరు, కృష్ణా జిల్లా

 అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది సంవత్సరం పొడవునా పక్షులకు ఆవాసాన్నిస్తూ, దారిన పోయిన బాటసారులకి నీడనిస్తూ చల్లని గాలినిస్తూ,మధురమైన పండ్లనిస్తూ ఉండేది.
 ఎందరికో  ఉపయోగపడుతున్నాను అని సంతృప్తితో కాలం వెళ్లబుచ్చేది.కానీ మనసులో చిన్న సందేహం ఉండేది. "నేను ఈ మానవులు అందరికి ఉపయోగపడుతున్నాను. వారు మంచి వారైనా,చెడ్డ వారైనా ఒకేలా చూస్తున్నాను. మంచి వారికి ఉపయోగపడేలా చెడ్డవారిని మందలించి దారిలోకి తెచ్చేలా నాకు శక్తులు ఉంటే బాగుండును" అని అనుకునేది.
              ఒక రోజు ఆ దారిన తన శిష్యులతో వెళుతూ ఒక ముని ఆ చెట్టు క్రింద సేద తీరసాగాడు. ఆ చెట్టు వారికి కావలసినన్ని తీయని పండ్లనిచ్చి ఆకలిని తీర్చింది. ముని సంతుష్ఠుడై చెట్టు మనసులో ఉన్న కోరికను గమనించి "ఈ రోజు నుంచి చెట్టు క్రిందకు వచ్చిన వారిలో మంచి వారు అయితే మంచి మాటలతో ఆహ్వానిస్తూ వారికీ పండ్లనిస్తావు .చెడ్డ వారు అయితే తిట్లు తిడుతూ వారి మీద రాళ్ల వర్షం కురిపిస్తావు" అని వరమిచ్చాడు.
            ఆ రోజు నుంచి ఆ చెట్టు మంచివారికి మంచి మాటలు చెబుతూ పండ్లను ఇచ్చేది .చెడ్డ వారికి రాళ్ల వర్షం కురిపిస్తూ తిట్లు తిట్టేది.
 ఈ విషయం ఆ చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలందరికీ తెలిసి వింతగా చెప్పుకునే వాళ్ళు.మంచి వారికి పండ్లనిస్తూ చెడ్డ వారిని తిడుతూ రాళ్ళతో కొడుతుంది అని అందరికి అర్దమైంది.
ఈ వార్త ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజుగారికి చేరింది.రాజ్యంలో నేరం చేసిన వారెవరో చేయని వారెవరో తెలియక సతమతమవుతూ కొంతమంది నిర్దోషులను కూడా కారాగారంలో పెట్టవలసి వస్తుంది.ఇప్పుడు రాజుగారికి ఈ  వార్త తెలిసి కారాగారంలో ఉన్న వారందరిని చెట్టు దగ్గరకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పంపించేవారు భటులు.అసలు దొంగ ఎవరో తెలిసిపోయేది.
          ఆ దెబ్బతో ఆ రాజ్యంలో నేరం చేసి తప్పించుకునే పరిస్థితి లేదు.ఈ చెట్టు మనల్ని పట్టిస్తుంది అని భయపడి ప్రజలంతా సన్మార్గంలో పయనిస్తూ దొంగతనాలను,దొపిడీలను,హత్యలను,అరాచకాలను వదిలేసారు.
ఇంతటి మార్పుని నా కళ్ళతో చూస్తాననుకోలేదు అని చెట్టు ఎంతో సంతోష పడింది. నేను చెడ్డవారికి అపాత్రదానం చేస్తున్నానేమో అని భాధ పడేదాన్ని ఇప్పుడు ఆ చింత పోయింది అని నిశ్చింతగా కళ్ళు మూసుకుని ఆ మునికి మనసులో నమస్కారాలు పెట్టుకుంది.

కామెంట్‌లు