గొడ్డలి బలం ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 అడవిలోని చెట్లను విచ్చల విడిగా నరకసాగింది గొడ్డలి. దయదాక్షిన్యంగా లేకుండా గొడ్డలి నరుకుతూ ఉంటే చెట్లు నేలకొరుగుతున్నాయి. చెట్లకు ఆందోళన కలిగింది. ఎలాగైనా గొడ్డలికున్న బలాన్ని బలహీన పరచాలి అనుకున్నాయి. "అసలు ఈ గొడ్డలికి ఇంత బలం ఎక్కడిది?" అదే ఆలోచించటం మొదలు పెట్టాయి. గొడ్డలికి ఎవరో అండగా వున్నారు. సాయం చేస్తున్నారు. ఎవరూ? అదేవిషయం తీవ్రంగా ఆలోచించసాగాయి.  
         ఇంతలో ఓ చెట్టు "మిత్రులారా! గొడ్డలికి బలాన్ని ఇచ్చింది ఎవరో కాదు. మనమే.  మన జాతీయులమే. మనమే లేకుంటే దానికి ప్రాణమే లేదు" అంది. "నిజమా? అదెలాగు? మనమేలా గొడ్డలి కి సాయం చేస్తున్నాం" అడిగింది ఒక చెట్టు.  "చెబుతా వినండి. గొడ్డలి ఒంటరిగా ఉంటే దానికి బలమే ఉండదు. మన  చెట్టు నుండి వచ్చిన కట్టే దానికి బలం. అది తోడు అయిన వెంటనే దానికి బలం వస్తుంది. కట్టే లేకుంటే గొడ్డలే ఉండదు. మనల్ని మనమే నరుకుంటున్నాం అన్నమాట. అర్ధమైందా?"  అంది. ఎలాగైనా గొడ్డలికి కట్టెను దూరంగా ఉంచాలని చెట్లు నిర్ణయించుకున్నాయి.