మిడత మంచితనం:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.

 ఒక అడవిలో ఉడత, మిడత స్నేహంగా ఉండేవి.
అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న చిన్నలేడిని రోజూ చూస్తుండేవి. అందమైన ఆలేడితో స్నేహం చేయాలనుకునేది మిడత. 
ఒకరోజు మిడత లేడి దగ్గరకు వెళ్ళి తన మనసులో మాట చెప్పింది. 
లేడి నవ్వి "నువ్వు అల్పప్రాణివి. అందవికారంగా ఉంటావు. నీతో నాకు స్నేహమా?అంది అహంకారంగా! 
మిడత ముఖం చిన్నబోయింది. దిగులుగా ఉన్న మిడతను, ఉడత కారణం అడిగింది. జరిగిన సంగతి చెప్పింది మిడత.
"అహంకారులతో మనకెందుకు?  నేను నీతో స్నేహంగా ఉన్నాను కదా!దానిమాటలకు దిగులుపడకు"అంది ఉడత.
ఒకరోజు పచ్చిక మేస్తున్న జింకను చూసి ఒక వేటగాడు బాణం గురిపెట్టాడు. జింక వేటగాడిని గమనించలేదు. మిడత వేటగాడిని చూసింది. వేగంగా ఎగురుతూవెళ్ళిఒక్క ఉదుటున వాడి ముఖం మీద దుమికింది. బాణం గురితప్పి  లేడి పక్కన దూసుకెళ్ళింది. లేడి పరుగందుకుంది. ఈసంఘటనను గమనించిన ఉడత, మిడత మంచితనాన్ని అభినందించింది.
తర్వాత ఒకరోజు లేడి పచ్చికమేస్తుండగా ఒక పులి చూసింది. అడుగులో అడుగులేస్తూ మెల్లిగా లేడివైపు రాసాగింది. అదిగమనించిన మిడత తనమిత్రులైన మిడతలతో కలిసి పులి ముఖం మీదకు దుమికింది.అనుకోని ఆసంఘటనకు పులి గాండ్రించింది.ఆఅరుపుకు అదిరిపడిన లేడి తనశక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని పరుగెత్తింది.మిడత చేసిన పనిని ఉడత ప్రశంసించింది.
లేడి ఆరోజు నుండి భయంతో అటువైపు రావడం మానేసింది. 
'చిన్నలేడి ఏమరుపాటుతనంతో ఏ వేటగాడికి చిక్కిందో? ఏజంతువుకు ఆహారమైందో?'  అని ఉడత, మిడత దిగులుచెందాయి.
ఒకరోజు లేడికోసం వెదుకుతున్న ఉడతకు లేడి కనిపించింది. ఉడత లేడి దగ్గరకెళ్ళింది. వేటగాడినుండి, పులిబారినుండి మిడత లేడిని ఎలాకాపాడిందో చెప్పింది.
 "నీవు కనిపించకపోయేసరికి మిడత, నేను ఏంజరిగిందోనని భయంతో దిగులుపడ్డాము. నేను ఈసంగతులు నీమెప్పుకోసమో,ఏదైనా ప్రతిఫలం ఆశించో చెప్పడంలేదు.ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి చెబుతున్నాను.మీఅమ్మతో కలిసి పచ్చిక మేయడానికి రావాలి. ఒంటరిగా ఎందుకు వస్తున్నావు?"అని అడిగింది ఉడుత.
'నేను పెద్దదాన్నవవుతున్నాను.ఒంటరిగా మేతకు వెళ్ళడం నేర్చుకోవాలి' అని అమ్మ నావెంట రావడం లేదు." చెప్పింది.లేడికి తనతప్పు అర్థమయింది.
'తనతో స్నేహం ఆశించివస్తే, గర్వంతో తను హేళన చేసింది. అదేమీ మనసులో పెట్టుకోకుండా మిడత తనప్రాణాలను కాపాడింది.రోజూ కనిపించే తాను అటువైపు రాకపోవడంతో సాటిప్రాణిగా నాకోసం ఆందోళన చెందాయి. అందమనేది మంచితనంలో ఉంది. మంచిమనసుకు మించిన అందం ఎక్కడాలేదు.అడవిలో జంతువులమధ్య స్నేహం, పరస్పర సహకారం ఉండాలి" అనుకుంటూ లేడి పరుగున మిడత నివాసం దగ్గరికెళ్ళింది.క్షమించమని కోరింది. ఆనాటినుండి అవి మూడూ మంచి మిత్రులయ్యాయి.