చందు రోజు లాగే బడికి బయలుదేరి నడుచుకుంటూ వస్తున్నాడు.త్రోవలో ఒక జామ చెట్టు ఉంది.ఆ జామ చెట్టు క్రింద రాజుని చూసాడు చందు.రాజు అంటే చందుకు అసలు పడదు .రాజుని మాస్టారి దగ్గర దొంగగా ముద్ర వేయిస్తే కానీ నా మనసు కుదుటపడదు అని అనుకున్నాడు.
అంతకు రెండు రోజుల ముందు నీలిమ వాళ్ళ నాన్న వచ్చి "మా జామకాయలు మీ స్కూల్ పిల్లలు తెంపేస్తున్నారు వారిని మందలించండి" అని ఫిర్యాదు చేసి వెళ్లారు.
ఇదే మంచి సమయం అనుకొని " జామకాయలు రాజు తెంపడం నేను నా కళ్లారా చూశా" అని టీచర్ గారికి చెప్పాడు చందు .
రాజుని లేపి "జామ చెట్టు క్రిందకు వెళ్ళావా" అని టీచర్ అడిగారు.వెళ్ళాను టీచర్ అని రాజు అన్నాడు.అయితే నీవేనా రోజూ కాయలు కోస్తున్నావు" అని టీచర్ బెత్తం తీసారు."నేను జామకాయలు కోయలేదు.నా బంతి ఆ చెట్టు క్రిందకు వెళితే తెచ్చుకోవడానికి వెళ్ళాను టీచర్.అసలు ఆ చెట్టుకి కాయలే లేవు టీచర్" అని రాజు అన్నాడు.
"వాళ్ళ నాన్నే నా దగ్గరకి వచ్చి పిర్యాదు చేసాడు రెండు రోజుల క్రితం.అంటే నీలిమ వాళ్ళ నాన్న చెప్పింది అబద్దం అంటావా" అని టీచర్ కేకలు వేశారు."దేవుడు మీద ఒట్టు నా మాట నమ్మండి టీచర్" అని రాజు ఏడుస్తున్నాడు.
టీచర్ నీలిమను లేపి "ఏమి నీలిమ మీ చెట్టుకి కాయలు లేవా' అని అడిగారు ."అవును టీచర్ నిన్ననే కాయలన్నీ కోయించి మా నాన్న సంతలో అమ్మేశాడు" అని నీలిమ అన్నది.
చందుని లేపారు టీచర్ గారు."చందూ నిజం చెప్పు" అని గద్దించారు.చందు భయంతో లేచి "రాజు చెట్టు క్రింద ఉండడం చూశాను. తెంపుతున్న్సట్లు చూడలేదు టీచర్" అని గజ గజ వణుకుతూ చెప్పాడు.
ఇంతలో శ్యాము,పవన్ బురదను అంటించుకుని వచ్చారు."శ్యాము నా బట్టల మీద బురద జల్లాడు" అని ఏడుస్తూ పవన్ చెప్పాడు.శ్యాము చేతులు బట్టలు నిండా కూడా మరకలే.
అప్పుడు టీచర్ గారు "చూసావా చందూ! పవన్ మీద బురద జల్లాలి అని శ్యాము అనుకున్నాడు కానీ శ్యాము బట్టల నిండా మరకలే.అంటే మనం ఎవరికైనా చెడు తలపెట్టాలని అనుకుంటే మనకు కూడా హాని జరుగుతుంది.
నీవు చేసిన పని కూడా అదే.రాజును చెడ్డవానిగా చేయాలనుకున్నావు. కానీ నీవే తప్పుకు దొరికిపోయావు.
మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది గుర్తుపెట్టుకొని మసలుకోండి" అని చందుని,శ్యాముని మందలించారు టీచర్ గారు.
-×-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి