పండిత, పాఠక జన హృదయ సంచారి - విహారి:--డాక్టర్ ప్రభాకర్ జైనీ-ప్రధాన సంపాదకులు, -"సినీవాలి" ఆన్లైన్ ఉచిత వారపత్రిక
 ఒక మహా పండితుడి గురించి ఒక సామాన్య రచయిత ఏం రాయగలడు? అటువంటప్పుడు ఏం చేయాలి? ఆ మహాపండితుడినే శరణు జొచ్చి, "మహా ప్రభూ! మీ గురించి ఏం రాయను?" అని వేడుకోవాలి. అలా అడిగేంత చనువు కూడా వారితో మనకు ఉండాలి. కేవలం ఆ చనువు - ఒక్కటి - ఉన్న కారణంగానే విహారి గారి గురించి సంపాదకీయం రాయడానికి సాహసిస్తున్నాను. 
విహారి గారు గత రెండు మూడు సంవత్సరాలుగానే నాకు పరిచయం. ముందుగా పరిచయం కలగకపోవడం నా దురదృష్టం! ఈ స్వల్ప కాలంలోనే అయినా గాఢమైన పరిచయం ఏర్పడింది. ఒక వ్యక్తి, గత అర్థ శతాబ్దంగా ఇన్ని గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి, అంత సింపుల్ గా ఉండడం నన్ను విస్మయానికి గురి చేసిన విషయం. చాలా సౌమ్యులు, నిగర్వి, మృదుభాషి, అసూయాతత్వం లేని మనుషులను మనం కల్పనల్లోనే చూస్తామనుకోవడం తప్పని చెప్పడానికి, దేవుడు పంపిన ఉదాహరణ - విహారిగారు. 
ఇప్పుడంతా భజన బృందాల యుగం. మనకొక బ్యాచ్ ఉండాలి. ఆ బ్యాచ్ లోని వాళ్ళు అహోరాత్రులు స్వామి వారి భజన చేస్తూ ఉంటే స్వామి వారు కనికరించి తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తారు. 
ఇది ఈ నాటి తెలుగు సాహిత్య రంగపు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్!  
అందుకే, విహారి గారికి ప్రభుత్వం తరఫున ఏ అవార్డులూ రాలేదు కానీ పండిత, బుధజనుల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారు. 
లేకపోతే, 
"నేను హై స్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే ఙ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షిణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ఆ రచనలు" అని మునిపల్లె రాజు గారితో అనిపించుకోగలరా? 
"ఆధునిక యుగంలో కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. సంప్రదాయ సాహిత్యానికి కాలం చెల్లిందనేది మొదటి ప్రచారం. పద్యం హృద్యం కాదనీ; ఛందం వద్దు స్వచ్ఛందం ముద్దనీ రెండవ ప్రచారం. బృహత్కావ్యాలు జనాదరణకు నోచవు. కేవలం వామన కవితలనే ప్రజలు ఆదరిస్తారనేది మరొక అపప్రధ. 
విహారి ఈ మూడు దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో 'శ్రీ పదచిత్ర రామాయణము' పేరుతో పునర్నిర్మించి జనరంజకం చేసారు. తద్వారా తాను పునీతుడై సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఇదొక రసవిహారము. వయో పరిణితితో బాటు రచనా పరిణితిని కూడా మనం విహారిలో దర్శించవచ్చు. ఆధునికోత్తర యుగంలో పద్య రామాయణ కావ్యం వ్రాసి మెప్పించినందుకు విహారికి ధన్యవాదాలు" అని నాకు బీయస్సీలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు సాహిత్యాన్ని బోధించిన గురువు గారు ముదిగొండ శివప్రసాద్ గారు అనడంలో ఆశ్చర్యం లేదు. 
'శ్రీ పదచిత్ర రామాయణము' గురించి 'భావఝరి' అనే వ్యాసంలో కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్, ఒక పద్యం (100 వ పద్యం) గురించి చెబుతూ ఆ పద్యంలో ప్రయోగించిన "అభ్యున్నత లక్ష్యలక్షణ సమోపద" అనే ప్రయోగం ఎంతో సాభిప్రాయం అని అంటూ,  కిష్కింధ కాండ వస్తుతత్వాన్ని బట్టి ఒక విధంగా నేటి 'ఇంటిలిజెన్స్ బ్యూరో' వంటిది అని పేర్కోవడం ముదావహం. 
విహారి గారి అసలు, పూర్తి పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. అక్టోబర్ 15, 1941 లో జన్మించిన విహారిగారు రెండు గొప్ప తెలుగు సాహిత్య శతాబ్దాలకు వారధి. 
వారి సాహిత్య ప్రస్థానం గురించి తెలుసుకోవడానికి వారు ప్రచురించిన పుస్తకాల సంఖ్యతో బేరీజు వేయలేము. అయినా రికార్డు కొరకు - 1962లో 'చుక్కాని' అనే పత్రికలో ప్రచురించబడిన 'రాగజ్యోతి' కథతో ప్రారంభమైన సాహిత్య ప్రస్థానంలో 15 కథా సంపుటాలు; 3 నవలలు; 5 కవితా సంపుటాలు; 14 వ్యాస సంపుటాలు; మంజరి అనే పద్య కవిత్వం; ఛందస్సుందర మహ కావ్యము, శ్రీ పదచిత్ర రామాయణము (ఆరు కాండములు) - 6500 పద్యాలు తెలుగు తల్లి కంఠసీమన మణిమాణిక్య వజ్రవైఢూర్యాల దండలై కలకాలం నిలిచే విధంగా వారి కలం నుండి జాలువారాయి. 'చుక్కాని' పత్రిక, వారిని, విహారిని సరస్వతీ అమ్మవారి పాదాలను పూజిస్తున్న గంగా ప్రవాహ తీరాలలోనే విహరింప చేసేలా, మార్గ నిర్దేశనం చేసింది. 
వారు అవిశ్రాంత రచయిత. మా "జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్" వారు "హీరో మరియు పాకుడు రాళ్ళు" నవలలను తులనాత్మక పరిశీలన చేస్తూ పరిశోధనావ్యాస పోటీలలో పాల్గొని రెండు నవలలను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు వందల పేజీల వ్యాసాన్ని గడువు లోపల, అంటే 
మే నెల 30, 2021 లోగా, నీటుగా డీటీపీ చేయించి పంపారు. 
ఇదొక్కటనే కాదు. వారు సమయపాలనను ఖచ్ఛితంగా పాటిస్తారు. మనం వెళ్ళడం, ఆలస్యమైనా ఓపికగా వేచి చూస్తూ ఉంటారు. నలుగురిలో కలిసి నిలబడ్డప్పుడు అయన అతి సామాన్య వ్యక్తిగా అనిపించినా ఆయన సాహిత్యపు వీధుల్లో, పండితుల సమూహంలో మేరునగధీరుడు. 
ఎనభై ఏళ్ళ వయసులో కూడా చలాకీగా ఉంటారు. ఎక్కడికైనా కాలినడకనో, ఆటోలోనో వెళ్ళడం వారికి ఇష్టం. భేషజాలు లేని ఉత్తమోత్తములు. పోనీ సామాన్యులా అంటే కాదు. యల్ఐసీలో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసి, శేషజీవితం కాదు, విశేష సాహితీ జీవితం గడుపుతున్న వారు. 
వారిని వరించిన అనేక సన్మానాలూ, బిరుదులకు లెక్కే లేదు. వారి సాహిత్యంపై అనేక మంది విద్యార్థులు పరిశోధనలు చేసి యం.ఫిల్, పీహెచ్డీలు పొందారు. 
వీటన్నింటికీ తలమానికం - 2020 సంవత్సరానికి గాను "అజో విభొ" వారి విశిష్ట సాహితీ మూర్తి జీవనసాఫల్య పురస్కారం లక్ష రూపాయల నగదు అందుకున్న సందర్భంగా తెలుగు సాహిత్య రంగంలో ఎన్నదగిన సాహితీ మూర్తులందరూ విహారి గారి విశిష్ఠ వ్యక్తిత్వం, సాహితీ ప్రస్థానం గురించి వేనోళ్ళ పొగిడారు. ఆ వ్యాసాలన్నీ 'ప్రతిభా వైజయంతి' సమ్మానోత్సవ సంచికలో ప్రచురించి, విహారి గారికి చిరు కానుకగా సమర్పించారు. 
విహారి గారు ఈ అవార్డుల కన్నా చాలా పై స్థాయిలో ఉన్నారు. కానీ, మన దురదృష్ట వ్యవస్థ వారిని గుర్తించడం లేదు. ఇతర భాషల్లో వీరి స్థాయి వారిని కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, ఙ్ఞానపీఠ్, పద్మభూషణ్ వంటి సత్కారాలతో సన్మానించుకున్నారు. మనం పిపీలికాలను ఎంపిక చేసుకుని మురిసిపోతున్నాము. వారికి వెంటనే, ఈ అవార్డులన్నీ రావాలని కోరుకుంటున్నాను. 
విహారి గారు కేవలం గొప్ప రచయిత, కవి మాత్రమే కాదు. ప్రముఖ హోమియోపతి వైద్యులు. గత రెండు దశాబ్దాలుగా ఉచితంగా వైద్య సేవ చేస్తున్నారు. 
మా "జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్" తరఫున నిర్వహించిన "హీరో - పాకుడురాళ్ళు" తూలనాత్మక పరిశోధనా వ్యాస రచనల పోటీలో వారు విజేత. వారిని ప్రథమ బహుమతితో పాటు యాభై వేల నగదు పురస్కారంతో సత్కరించుకోవడం మా భాగ్యంగా భావిస్తున్నాం .