మండుటెండలలోన మలమల మాడిన
దేహాన్ని స్వేధమ్ము తేమజేయు,
భగభగ వేడితో భారము నెక్కువై
కాలము గడుపుట కష్టమాయె,
మెల్లగ చినుకులు మేదిని తాకగ
తనువులు పులకించె తనివిదీర,
పుడమితల్లి మురిసి పొంగిపోయెను గదా!
కాంచగ తొలకరి ఘనముగాను,
కర్షకులందరు కరమందు నాగలి
పట్టుకొని వెడలు పరవశించి,
హర్షించి పొలమును హాయిగ దున్నుచు
విత్తనంబులు దెచ్చి వేయు పంట,
దండ మెట్టుతువచ్చు ధరణి నుండి మొలక
పుడమి పొత్తిళ్లలో పురుడు పోసి,
ధాన్యపు రాశులు దండిగ వచ్చిన
కర్షక మోములు కాంతులీను.
తేటగీతి.
చెట్లు మిన్నగ పెంచిన చేయు మేలు,
వానలెన్నియో కురియును వసుధ నందు,
పనులు జేసేరు ప్రజలు పట్టుబట్టి,
దరికి రాదు కరువు జూడ ధరణియందు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి