బుల్లిపిల్లి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  బడి నుండి ఇంటికి వస్తున్నాడు బుజ్జిగాడు.  దారిలో ఓ బుల్లిపిల్లి కనిపించింది. అది మురుగు కాలువలో పడి బయటకు రాలేక అరుస్తూ ఉంది. దాన్ని కాలువలో నుండి బయటకు తీసాడు. ప్రక్కనే బోరింగ్ ఉంటే ఆ నీళ్లతో పిల్లిని  కడిగాడు. అది చలికి వణుకుతూ ఉంది. దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళాడు.  పిల్లిపిల్లను తెచ్చినందుకు అమ్మ కోప్పడింది. "ఎక్కడ తెచ్చావో అక్కడే వదిలేసి రాపో" అంది.  "అమ్మా! రేపు బడికి వెళ్ళేటప్పుడు తీసుకు వెళతాలే అని అమ్మ కోపాన్ని శాంతింప చేసాడు. దాన్ని పాత పొడిగుడ్డతో శుభ్రంగా  తుడిచాడు. దానికి వెచ్చదనం వచ్చింది. ఆకలి అయినట్టుంది "మ్యావ్, మ్యావ్" మంటూ అమ్మ చుట్టూ తిరుగుతుంది. అమ్మ పెరుగన్నం వేసింది. అటూఇటూ చూస్తూ గబగబా తిన్నది. ఆ రాత్రి  బుజ్జిగాడి దగ్గరే  పడుకుంది.  ఉదయం బడికి టైం అయింది. పుస్తకాలతో పాటు పిల్లిపిల్లను కూడా తీసుకున్నాడు. అమ్మకు బై చెప్పి ముందుకు కదిలాడు. "పిల్లిపిల్ల ఎక్కడికిరా? వుండనివ్వు" అంది అమ్మ .  బుజ్జిగాడికి  చాలా సంతోషం వేసింది. అప్పటినుండి  ఆడుకోవడానికి  వాడికి  ఓ మంచి మిత్రుడు దొరికాడు.