మా నాన్న:- సత్య వాణి

 ఆడపిల్ల
పురిటి గదిలోంచి మంత్రసాని నూకాలు కేక
అమ్మో !మళ్ళీ ఆడపిల్లే !
ఏడుగురమ్మాయిలే బాబోయ్ బంధువుల ఆక్రందన
'అయితే ఏంటి' ?నాన్న ధైర్యంతో కూడిన ఎదురు ప్రశ్న
మాఅమ్మ కాదు కోడి పెట్ట మానాన్నే!
నాన్న పొలంనుంచి వస్తే చాలు
ఒడిలో గోము
భుజాలపై గారాము
ఒకరిని ప్రక్కకి తోసి మరొకరు
నాన్న నాదీ  నాన్న నదీ
'తప్పురా కన్నా అలా దబ్బలాడకోకూడదు'
అదే పెద్ద మందలింపు నాన్నది
అన్నం తినేటప్పుడు కూడా
అసింటా వెళ్ళడం లేదు
వెళ్ళమనడం లేదు
'నాన్నని అన్నం తిననివ్వండి'
అమ్మ అదిలింపులు
'పోనీలేవే వాళ్ళగొడవ నీకెందుకూ !వాళ్ళనలా వుండనియ్ !'నాన్న భరోసాలు
బిడ్డలపై నమ్మకం
మొదటసారి చదువులకై
వూరు దాటింపు
ఆడపిల్లలకు చదువులేమిటన్న
ఊరివారి ప్రశ్నకు
చిరునవ్వేవారికి సమాధానం
పిల్లలు చదువులలో వృద్ధి
ఆడపిల్లలు మరింత అభివృధ్ధి
నాన్న కళ్ళలో నమ్మకం
నాన్న కళ్ళలో కించిత్ గర్వం
నాన్న పెదవుల చాటున దాచి పెట్టుకొన్న హాసం
పల్లెలో ఆడపిల్లల చదువుకు
మార్గదర్శనం
బాధ్యత కల తండ్రిగా సంతోషంగా బాధ్యత నిర్వర్తింపు
మద్యలో కడుపు చెరువైనా
సడలని గాంభీర్యం
కుటుంబ కలతల్ని గుండె వెనుక అణచి పెట్టుకొని
అదే గంభీరత
పిడుగులు పడినా చెదరని
నిగ్రహం
ఆత్మబలం.
అజాత శత్రువన్న పేరుకి
సార్థకత
కాలిక్రింద చీమ చావదు మారాజు నడిస్తే అన్న ఊరివారి
అభిమానంతో కూడిన ఆదరణ
నోములూపూజల సమయంలో
'నాన్నలాంటి మొగుడు కావావని దేవుణ్ణి కోరుకోండి పిల్లల్లారా 'అని అమ్మ అనేదంటే 
అమ్మకు నాన్న పట్ల కల అనురాగం అమ్మ కళ్ళలో
వెదకకుండానే దొరకడం
అంతా నిజం నిజం.
ఊరు మారకుండానే
ఊరు క్రొత్త తరం ఆధీనంలో
తన విలువ తరగకుండానే
తన మాట ఊరిలో చెల్లుబాటు
అవుతుండగానే
'రాజువయ్యా మారాజు వయ్యా' అని ఊరూవాడా
కొనియాడబడుతుండగానే
పిల్లలందరం చుట్టూ మూగివుండి చూస్తుండగనే
నిశ్చింతగా
స్వర్గారోహణం చేసిన
 మా ప్రియమైన నాన్నను
 మదినిండా నిలుపుకున్న
                    కుమార్తె
                     వాణి
కామెంట్‌లు