బాల్యం:-సత్యవాణి-కాకినాడ

 మా చిన్నప్పుడు,అదే నా బాల్యంలో నాకు అదే మాకు చాలా చాలా 
భయాలుండేవి.ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దవాళ్ళమైపోదామా అన్న ఆతృతగా వుండేది.
మాబాల్యంలో ,బడికెళ్ళే దారిలో ,'ఎర్రగ్గిపుల్ల' (అదే పోలీసును అలా అనేవాళ్ళం) కనిపిస్తే కాళ్ళు గడగడ వణికిపోయేవివి. పోలీసుకు కనపడకుండా ఏ చెట్టుచాటునో
దాక్కునేవాళ్ళం.
అలాగే దారిలో శవం కనుక ఎదురైతే ,ఆంజనేయ దండకం చదువుకోవడమే కాదు వారం రోజులు పక్కక్కెయ్యడమే! అమ్మ  
దిష్టలు ,దిగదుడుపులు, తాయత్తులు కట్టేక పది రోజుల తరువాత కూడా భయంభయంగానే బడికెళ్ళేవాళ్ళం.
ఊర్లో ఎవరో చని పోతే, సందెవేళ దీపాన్ని ,మేడగదుల నాలుగు మూలల చూపించమంటే ,తోడున్నా గుబులు
గుబులే.గుండెలరచేత పట్టుకొని వళ్ళడమే.ఆంజనేయుడి దండకం అరచేత వున్నాసరే.
 టీకాలినస్పెక్టరుగారూళ్ళోకి వచ్చారని తెలిస్తే బడినుంచి బలాదూరే,
చేటలో బిడ్డనెత్తుకొని,మొలకి గుడ్డ,తలకి రక్తం గుడ్డ కట్టుకొచ్చే
మూర్చదాన్ని చూస్తే, ఆమెకి అబద్దం మూర్చ,మాకు నిజంగా మూర్చ వచ్చినంత పనయ్యేది.
          గ్రామదేవత ఏములమ్మ గుడిదగ్గర,గంగిరావి చెట్టుక్రింద, మందులాళ్ళు మజలీ చేస్తే,--స్ఠవార్ట్ పురం గుంపులాళ్ళు ఊరిలో దిగేరని,,,మాదిగ అప్పడు చాటింపు వేస్తే,
వాళ్ళు ఊరిడిచి వెళ్ళేదాకా కడపునిండా తిండీ,కంటిమీద నిద్రా వుంటే ఒట్టంటే ఒట్టు.
గట్టచ్చిగాడు,ముక్కుసొట్టాడు ,నెత్తిమీద నూనెట్టి ,,పకోడీలొండేవాడు ,అందరూ భయపెట్టి ప్రాణాలు తోడేసేవారే.
రాత్రి చదువులు చూడ్డానికి అయ్యవారొస్తారేమోనని భయం.చదువుల ఇనస్పెక్టరుగారు వస్తారేమోనని భయం.వచ్చి
.
ప్రశ్నలు నన్నే అడుగుతారేమోనని భయం.
అమ్మ తమ్ముణ్ణి ఆడించకపోతే తిడుతుందని భయం. అన్నం పారేస్తే నానమ్మ తంతుందని భయం.తాత చెప్పినమాటవినలేదని
తెలిస్తే ,నాన్న తంతాడని భయం. దోస్తులతో కయ్యం తెస్తే ఇంట్లో తాటవలుస్తారన్న భయం,
బాబయ్య దొంగతనంగా  సిగరెట్ కాలుస్తున్నాడని చెపితే చెవ్వు కీ యిచ్చి, గుంజీలు తీయిస్తాడనీ,అత్త పాఠం పుస్తకంలో నవల పెట్టుకు చదువుతోందని
చెపితే తొడపాశం పెడుతుందని భయం.
అన్నీ విన్నవీ, చూసినవీ పచ్చి నిజలైనా, చెప్పడానికి భయం భయం భయం.
మరి ఇప్పటి పిల్లలకు బాల్యమూలేదు,బాల్యంలో బాధపెట్టే భయలూ లేవు.
.భయాలు లేకపోవడమన్నది మంచికో, చెడ్డకో మనకిప్పుడు
తెలియటం లేదు కానీ బాలలు బాల్యాన్నిమాత్రం బాధాకరం.పిల్లలు బాల్యం కోల్పోకుండా చూడల్సిన
బాధ్యత మాత్రం పెద్దలదే.బాల్య స్మృతులు లేని మనిషి జీవితం ,రసం కోల్పోయిన చెరకుపిప్పివంటిది.