బడిగంటలు ..!!:- -----శ్యామ్ కుమార్- నిజామాబాద్.

 బాల్యం లో జరిగే సంఘటనలే కాకుండాకొందరు  వ్యక్తులు కూడా చాలా ప్రభావితం చేస్తారు  మనజీవితాన్ని. మన  కంటే పెద్దవారు , చిన్న వారు ఎంతోమంది బాల్యంలో మనల్ని కలిసి మన బాల్యాన్ని చాలా ఆనందమయంగా చేస్తారు. ప్రతి వ్యక్తి తో, ప్రతి విషయంలో , ప్రతి సంఘటనలో మనం ఆనందాన్ని  మాత్రమే పంచుకునేది బాల్యం.  
         మా ఊరిలో జడల సత్తయ్య అనే వ్యక్తి కి  తోట ఊరి మధ్యలో ఉండేది. అందులోన బంగళా- మరియు చిన్న చిన్న ఇళ్లు ఉండేవి. ఆ చిన్న ఇల్లు సముదాయాన్ని  ఆయన కిరాయికి ఇచ్చేవాడు. అందులో వెనకవైపు  మూడు ఇళ్లు  ఉండేవి .అందులో మధ్యలో ఉండే ఇంట్లో తమిళనాడు నుంచి వచ్చిన కుటుంబం ఉండేది .అందులో 'నడిమింటి అత్త 'అనే ఆవిడ ఉండేది. మధ్య ఇంట్లో ఉండేవారు కాబట్టి ఆ పేరు అలాగే ప్రాముఖ్యం పొందింది. అత్తయ్య కి నలుగురు కూతుళ్లు ఒక కొడుకు .నలుగురు కూడా మంచి నాట్యం చేసే వారు . వాళ్ల పేర్లు లలిత ,  రమోల,గిరిజ  విమల.  పాటలు  కూడా పాడేవారు. కొడుకు పేరు  శ్యామ్. వారి ఇల్లు  బంధుమిత్రులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.  నేను అప్పుడు బహుశా 5 వ తరగతి  చదువుతూ ఉన్నాను.  నేను మా నానమ్మ  తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లేవాణ్ణి.  "గోపాల జాగేలరా,  బాల గోపాల జాగేలరా" అనే పాట పాడుతూ నృత్యం చేసేవారు.  వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ,  అత్తయ్య  అందరికీ కింద చాపలు పరిచి కూర్చో  పెట్టేది.  వచ్చినవారికి కాఫీలు టిఫిన్లు అయిన తర్వాత ఆ అక్కయ్యలు      డ్యాన్స్ చేసే వారు ,పాటలు పాడేవారు . ఆ చిన్నతనం లో కూడా నాకు కళలంటే ఆసక్తి ఉండేది. అందుకేనేమో చాలా ఆనందించే వాణ్ని. అత్తయ్య ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. రెండు వైపులా ముక్కు పుడకలు ఉండేవి.   రింగుల జుట్టు తో  సిగ కట్టుకొని ,  తొమ్మిది గజాల చీర , మడి  చార తో ఉండేది.
 ఆ బంగళాకు యజమాని అయిన   సత్తయ్య గారు మా తాత గారికి చాలా మంచి స్నేహితులు. ఆ రోజుల్లో ఆయన పేరు మోసిన కల్లు కాంట్రాక్టరు  ,  చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అందరూ భయపడేవారు.  మా నానమ్మ- తాతయ్య ఇద్దరూ  ఆయన మీద జోకులు వేస్తూ చాలా సరదాగా ఉండేవారు. అప్పటికి ఆయన వయసు దాదాపు 50 సంవత్సరాలు. ఆయన  రెండంతస్తుల బంగ్లా ముందు, ఆ తోటలో, విశాలమైన వసారా, అందులో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. అక్కడే సున్నంతో చేసిన పెద్ద సింహాసనం లాంటి ది ఉండేది  అందులోనే  కూర్చుని అతను తన లావాదేవీలు జరుపుకునేవారు. అక్కడికి చాలామంది రోజూ వచ్చి ఆయనతో ఆర్థిక లావాదేవీలు చేసుకునేవారు. ఆయన కూతుళ్లు - , వనజ అక్క ,మహేశ్వరి అక్క  వజ్ర అక్క. నన్ను  పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని ఆడించారట! . నేను పుట్టగానే మొట్టమొదటిసారిగా చేతిలో ఎత్తుకున్నది ఆ సత్తయ్య మామ యొక్క మొదటి  భార్య లక్ష్మమ్మ .  రెండవ భార్య అయిన వీరమ్మ అత్త  చాలా అందమైన మనిషి. అందరిని ఆదరించి చాలా ప్రేమగా చూసే వ్యక్తిత్వం కల మనిషి అని చెప్పుకునేవారు .  లక్ష్మమ్మ అత్తకు  గయ్యాళి ది అని పేరు ఉండేది.  నేను మొండితనం చేసినప్పుడల్లా ఆమెను గుర్తు చేసుకొని ఆమె నా మొండి తనానికి కారణం అని అందరూ నవ్వేవారు, ఎందుకంటే పుట్టగానే ఎత్తుకొని నా మొహం  మీద  నీళ్లు కొట్టిందట.  దవఖాన లో కాకుండా నేను వారి ఇంట్లోనే పుట్టాను.  ఆ   ప్రసవం    కార్యక్రమాలన్నీ  దవాఖానాల్లో కాకుండా ఇంట్లోనే  లక్ష్మమ్మ అత్త చేసిందని చెబుతారు. 
బయట కూర్చున్న సత్తయ్య మామ,  నన్ను చూడకుండా తప్పించుకొని లోపలకి వెళ్ళే వాడిని. నన్ను చూడగానే ఆ సత్తయ్య మామ "ఒరేయ్ శ్యామ్ గా !!నిన్ను చంపేస్తాను రా " అని పెద్దగా అరిచే వాడు. ఆయనంటే నేను భయపడి,చచ్చే వాడిని.   "  పట్టుకోండి రా ,  వాడిని పట్టుకోండి రా !!" అని   భయపెట్టే వాడు.  "వీడు ఎక్కడ దాపురించాడు రా బాబు, నా కర్మకి"  అనుకుంటూ అక్కడి నుంచి పరుగు లంకించుకునే వాణ్ని.
  సత్తయ్య మామ చిన్నకొడుకు అయిన  రంగా నాతోటి చిన్నప్పటినుంచి ఆడుకునేవాడు. వారితో మా తాతగారు స్నేహం ఎంతలా ఉండేద అంటే నాకు ఏది కొంటే అది 
  రంగా కు కూడా  కొనేవారు, బట్టలతో  సహా.    ఆ   సమయంలో చాలా ఖరీదైన  మూడు చక్రాల సైకిలు నాకు ఒకటి రంగాకు ఒకటి  కొన్నారు. రంగా కూడా నాతోటే గర్ల్స్ హై స్కూల్లో ఒకటవ తరగతిలో చేరాడు. నేను, సుధాకర్ ,వినోద్ ,  రంగా ఒకటే క్లాసులో  చదివాము. 
 ఆఖరి గంటలో తెలుగు లేదా కథలు చెప్పేవారు. ఆ  క్లాసులో మేమందరమూ దాదాపుగా తలుపు దగ్గరగా వచ్చి కూర్చొనే వాళ్ళం. గంట కొట్టగానే  ఒక్క ఉదుటున పరిగెత్తి ముందుగా స్కూల్  గేటు  దాటే  వాళ్ళం. ఎవరు ముందుగా స్కూల్ గేటు దాటారు ?అన్నది మా లో  ప్రతిరోజు ఒక పరుగుపందెం అన్నమాట. ఆ స్కూల్లో రెండు అడుగుల పొడవాటి ఒక  ఇనుపస్తంభం  వరండాలో వేలాడుతూ ఉండేది . దానికి వరుసగా మూడు నాలుగు పెద్ద పెద్ద రంద్రాలు ఉండేవి. ఆ రంధ్రంలో ఒక పొడవాటి బోల్ట్ను  ఉంచే వారు. ప్రతి తరగతి సమయం కాగానే ఆ  బోల్ట్ని ఆ రంధ్రం నుంచి లాగి గంటలు కొట్టే వారు.  అయితే ఆ బోల్ట్  ను  అందులోంచి లాగుతున్నప్పుడు కణకణ అంటూ  చప్పుడు అయ్యేది. ఆ  చప్పుడు కాగానే ఇక గంట కొడతారు అని మాకు అర్థం అయ్యేది .మేము అప్పటికే బ్యాగులు సర్దుకొని, చేతిలో పెట్టుకొని రెడీగా ఉండేవాళ్ళం. ఆ లాంగ్   బెల్ లో మొదటి గంట చప్పుడు కే మేము  గేటు ఆవల ఉండేవాళ్ళం.   గేట్ దాటగానే  మేము      పగలబడి నవ్వే వాళ్లము.  అందులో ఏదో సాధించామని విపరీతమైన ఆనందం,       ఆ  ఆనందానికి అంతే లేదు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు  ఫస్ట్ , ఎవరు సెకండ్  అంటూ డిక్లేర్ చేసుకునేవాళ్ళం. మనసులో ఎప్పుడూ సంతోషమే.  చిరు తిండి  ఇంకాస్త కావాలి అని అడిగితే   పెద్దలు ఇవ్వనప్పుడు, సినిమాలు వద్దన్నప్పుడు మాత్రమే ఎందుకో  దుఃఖము చిరాకు ఉండేవి.  ఇంట్లో చేసిన అరిసెలు కర్జికాయలు లాంటివి ఒక డబ్బాలో  తాళం వేసి పెట్టేవారు. స్కూల్ కి వెళ్ళే ముందు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక  ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చేవారు రెండోది  అరిచి గీ పెట్టినా కూడా ఇవ్వక పోయే వారు.  ఒక్కోసారి నా గొడవ భరించలేక మా నానమ్మ   ఇచ్చేది వాటిని,విసిరి    కొట్టే ది.  అయినా సరే మనకు ఏ ఫీలింగ్ ఉండేది కాదు ,కింద పడ్డ అది తీసుకుని  నిక్కర్ జోబులో      పెట్టుకుని,   అనుకున్నది సాధించాను అని తృప్తి తో హాయిగా బయటకు పరుగెత్తి వాణ్ని.
 మేము 8వ తరగతి చదువుతున్న సమయంలో మా ఊరి భువనగిరి కోట మీద ఏదో మైక్రోవేవ్ స్టేషను పెట్టడానికి  పనులు మొదలుపెట్టారు. అప్పుడు అందరు  అనుకుంటుంటే విన్నాము ఏమిటంటే, కొండపైకి ఒక రాయిని తీసుకెళ్తే రెండు రూపాయలు ఇస్తారు అని.     నేను నా స్నేహితులం  ఇదేదో బావుంది అని,ట్రై చేసి డబ్బులు సంపాదించు కుందామని వెళ్ళాం. అయితే కొండ కింద అక్కడ ఎవరూ లేరు కానీ  రాతి   బండలు  పడేసి ఉన్నాయి. దగ్గరికి వెళ్లి వాటిని  ఎత్తటానికి  ప్రయత్నించాం.  అయితే వాటిని  కనీసం కదిలించలేక పోయాం ,   పైకి ఎత్తటం తర్వాత సంగతి.   వాటిని కొండ పైకి మేము  మోసుకుంటూ వెళ్లటం దాదాపుగా అసంభవం అని అర్థమైంది. అవి ఒక్కొక్కటి 30 కిలోల పైగా బరువు ఉంటుందనుకుంటాను. మా బరువు దాదాపు అంతే ఉంటుంది ఆ వయసులో.
. ఆ రకంగా డబ్బులు సంపాదించుకొనే  ప్రణాళిక ఫ్లాప్ అయ్యి , దిగాలుగా మొహాలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాల్లం.  అసలు వాటిని ఎలా ఎత్తుకొని వెళ్తారు ?చూద్దాము!! అనే కుతూహలంతో రెండవ రోజు మళ్లీ వెళ్లాం.   అక్కడ గజం దూరానికి  ఒకరు నిలబడి ,ఒకరి చేతిలో నుంచి ఇంకొకరు అందించుకుంటూ ,పైవరకు అలా ఒకరి తర్వాత ఒకరు  వంతుల వారీగా మోస్తున్నారు. కాకపోతే అందరూ పెద్దవాళ్లే, మా వయసు వాళ్ళు ఎవరూ లేరు. అలా  శ్రమ శక్తిని ఒకరినొకరు పంచుకుంటూ  రాళ్లను మోసారు.
 నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు బాలయ్య గారు అనే మాస్టారు  సైన్స్ పాఠాలు చెప్పేవారు. ఆ రోజుల్లో సైన్స్  పుస్తకాన్ని సామాన్య శాస్త్రము అనేవారు.  బాలయ్య మాస్టారు ఎందుకు  గుర్తు ఉన్నారంటే ఆయన సైన్సు పాఠాలు చాలా బాగా చెప్పేవారు .  సైన్సు పుస్తకంలో  ఉండే విషయాలే కాకుండా సైన్సుకు సంబంధించిన వేరే విషయాలు కూడా చెబుతూ ఉండేవారు. ముఖ్యంగా మానవ శరీర భాగాల గురించి,  ఎవరు చెప్పని ,మాకు తెలియని విషయాలు చెప్పేవారు.
 యాదగిరి సార్ అనే మాస్టారు సాంఘిక శాస్త్రం చెప్పేవారు . అయితే ఇందులో భారత రాజ్యాంగం గురించి చాలా బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పేవారు అంటే దాదాపుగా  మా అందరికీ ఆయన గుర్తుండిపోయారు.  చెప్పిన పాఠం గుర్తుండిపోయింది .  ఆయన గురించి  స్నేహితులం కలిసినప్పుడు, ఎప్పుడు గుర్తు చేసుకున్నా, సాంఘిక శాస్త్రం లో ఉన్న భారత రాజ్యాంగం  భలేగా చెప్పేవాడు కదా !!!అని మాత్రం  తప్పకుండా  అనుకుంటాము.
సాంఘిక శాస్త్రం లో ఉన్న చరిత్ర భాగాన్ని మల్లయ్య గారు  చెప్పేవారు. మల్లయ్య మాస్టారు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చేది .  పుస్తకాన్ని తీసి ఒకసారి చూసి దాన్ని పక్కన పెట్టి  హాయిగా  మొత్తం చెప్పేవారు.  ముఖ్యంగా శివాజీ గురించి చెప్పిన విషయాలు మా మనసులో చెరగని ముద్ర గా  ఉండిపోయాయి.  మా చిన్నప్పటి గురువులు  ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిబద్ధతతో, ప్రణాళికతో మాకు పాఠాలు చెప్పేవారు.  గుర్తుకొచ్చినప్పుడల్లా  వారిని మనసులో పూజించుకుంటాను . దాదాపుగా చాలామంది  ప్రస్తుతం  ఈ లోకంలో మరి లేరు.  అప్పుడప్పుడు వారిని ఒకసారి చూడాలని కలవాలని మాట్లాడాలని బలీయమైన కోరిక  కలుగుతూ ఉంటుంది.  మనసైనప్పుడల్లా మా ఊరికి వెళ్లి ఆ వీధుల వెంబడి నడుచుకుంటూ తిరుగుతూ ఉంటే   అక్కడ ఉన్న వీధులు,  పాత ఇల్లు ,పెద్ద పెద్ద వృక్షాలు నన్ను చూసి పలకరిస్తుంటాయి కానీ అందులో ఉండే  నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎవరూ కనిపించరు.  వారిలో కొద్దిమంది పట్టణాలకు వెళ్ళిపోతే మరి కొందరు చనిపోయారు.  కానీ నన్ను గుర్తుపట్టి మాట్లాడించే వారు మాత్రము  ఎనలేని ఆనందాన్ని పొంది ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారు.  మనం పుట్టి పెరిగిన ఊరిలో వీధుల వెంబడి తిరిగినప్పుడు కలిగే ఆనందం ప్రపంచంలో  ఎన్ని వింత వింత ప్రదేశాలు చూసినా  దొరకదు .
బాల్యం అంటే అందరికీ ఎంత చెప్పుకున్నా తీరని తీయటి కథలే. బాల్యం  గొప్పతనాన్ని మనం తెలుసుకునే  లోగా అది మనకు తెలియకుండా  , చెప్పకుండా, మనకి దూరం అయిపోతుంది.  మన మీద ఏమాత్రం దయ  చూపకుండా   నవ్వుతూ, వెళ్ళిపోతుంది.  రంగు రంగుల హరివిల్లు లాంటి యవ్వనంలోకి అడుగుపెడుతున్న మనం  బాల్యంగురించి  ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడము.  అదే  మనం జీవితంలో  తెలియకుండానే చేసే పెద్ద పొరపాటు. ఆ తర్వాత  మనం ఎన్ని వేల దండాలు పెట్టిన అది తిరిగి రాదు కదా!!
      -------------------------------
ఫోటోలో>వీరమ్మ అత్త-రంగా*