యమునాతీరం మణిపూసలు :- ఎం. వి. ఉమాదేవి
మోగెను మోహన మురళీ 
ఘల్లున అందెల రవళీ 
సుందర యమునా తటిలో 
అలలై పొంగిన సరళీ 

గోవులు మోరలు చాచే 
సురపొన్న విరులు పూచే 
వీచే మలయ సమీరo 
పున్నమి వెన్నెల కాచే 

తీరము చేరు గోపికలు 
కపట మెరుగని జీవికలు 
శ్రామిక జీవన సిరిలో 
ఆటవిడుపుగ ప్రేమికలు 

నటనము రాధాకృష్ణా 
తీరును గోపిక తృష్ణా 
కోలాటం సవ్వడిలో 
యదలో యదుకుల కృష్ణా 



కామెంట్‌లు