తుమ్ము తెచ్చిన తంట (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼దార్ల బుజ్జిబాబు

  వెంకట్రావు బజారుకు పోవలసివచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మోటారు సైకిల్ ఎక్కి   స్టార్ట్ చేసాడు. అదే సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న  ముసలి తాత "హాచ్" అంటూ తుమ్మా డు.  వెంకట్రావుకు మూఢ నమ్మకం పిచ్చి.  ఎదుటి వారు తుమ్ము  మన ప్రమాదానికి  హెచ్చరిక అని వెంకట్రావు భావన. 
     ఇంజను అపి, బండి దిగి  ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. అదే సమయంలో అతడు కూర్చున్న ప్రాంతంలో  ఇంటి పైకప్పు పెచ్చులు వూడి  మీద పడ్డాయి.  తలకు బలమైన గాయం  అయింది. రక్తం కారుతూవుంది. వెంటనే  మోటారు సైకిలుపై ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరారు. మళ్లీ ఆ ముసలి తాత  పెద్దగా తుమ్మాడు.  ఆ తాతకు జలుబు చేయటం వల్ల  తుమ్ములు వస్తున్నాయి. "కాసేపు ఆగండ్రా ఎవరో తుమ్మారు" అని వెంకట్రావు అరుస్తున్నా  బండిని అపకుండా వేగంగా తీసుకు వెళ్లారు.  వైద్యుడు తగిన వైద్యం చేసి "సకాలానికి తెచ్చారు.  కొంచెం ఆలస్యమైనా రక్తం ఎక్కువగా పోయేది. పరిస్థితి  విషమించేది. ఇంకేమి పర్వాలేదు. రెండురోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది"  అన్నాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.