ఇలా ..ఎందుకు ..!?:---బి.రామకృష్ణారెడ్డి- సఫిల్ గూడ-సికింద్రాబాద్

 ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది. అది పుట్టుకతో రావచ్చు ,వారసత్వంగా రావచ్చు, తాను నివసిస్తున్న పరిసరాల ప్రభావం లేదా స్వయంకృషితో ఎదిగేకొద్దీ జీవితాన్ని చదవటం వలన రావచ్చు.కానీ ఈ విశిష్ట లక్షణాలను ఎదుటివారి లో బహుకొద్దిమంది మాత్రమే పసిగడతారు.
   నా ప్రాథమిక విద్యాభ్యాసం అయిన తర్వాత పక్క ఊరిలో ఉన్న హై స్కూల్ లో ఆరవ తరగతి లో చేర్పించారు. ప్రతి విద్యా సంవత్సరం మొదటి నెలలో విద్యార్థులు పూర్తిగా చేరిన తర్వాత, ప్రతి తరగతికి ఒక క్లాస్ పీపుల్ లీడర్ని.,స్కూల్ మొత్తానికి స్కూల్ పీపుల్ లీడర్ని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది. మా క్లాస్కొచ్చేసరికి మా క్లాస్ టీచర్ ఆ బాధ్యతలు నిర్వహించే క్రమములో పిల్లలందరూ కొత్తవారు, ఎవరి గుణగణాలు ఎటువంటివో పూర్తిగా తెలియకపోవడంతో క్లాస్లో ఉండే విద్యార్థులలో వయసులో కొంచెం పెద్దవాడిగా ,మరియు ఎత్తుగా, బలంగా కనిపిస్తున్న రాజు అనే విద్యార్థిని ఆ పదవికి నామినేట్ చేయడం జరిగింది. ఆ నియామకాన్ని రిజిస్టర్ లో వ్రాసి ఆ రాజును హెడ్మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని రాములు అనే అటెండర్  కి అప్పజెప్పారు.
    వయసులోను ,అనుభవంలోనూ పెద్దవాడు కనుక రాములు, స్టాఫ్ అందరితోనూ చాలా చనువుగా ఉండేవారు .ఆ చనువుతో క్లాస్ పీపుల్ లీడర్ గా నియమించిన విద్యార్థిని ఉద్దేశించి టీచరు తో ,ఇతను ఆ పదవికి సరైన వాడు కాదు, ఈ అబ్బాయిని నియమించండి... అని నా వైపు వేలు పెట్టి చూపి దగ్గరకు రమ్మన్నాడు. కానీ దానికి టీచర్ ..ఏమిటీ ఇంత పీలగా ,చిన్న గా ఉన్నాడు, పిల్లలను ఏమి కంట్రోల్ చేయగలడు అని ఒప్పుకోలేదు .తిరిగి రాములు నన్ను ఉద్దేశించి ఇతనే సరైన వ్యక్తి ,అతను మాట్లాడే విధానంలో ,మిగతా పిల్లలతో మెసలుకొనే పద్ధతి ,మరియు పిల్లలను కంట్రోల్ చేయగలిగే కంఠము ఉన్నాయి .ఇతనినే నియమించమని సలహా ఇచ్చారు.
        అలా జరిగిన నియామకము ,రాములు నాలో ఉన్న, అతను ఊహించిన లక్షణాలను ఏమి పసిగట్టాడో కానీ వాటన్నిటినీ అమలుచేస్తూ హై స్కూల్ అయ్యేంతవరకు క్లాస్ లీడర్ గా కొనసాగుతూ , పదవతరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అనుభవం మరువలేనిది.
    కాలక్రమంలో ఈ కుళ్ళు రాజకీయాలప్రభావము విద్యార్ధి లోకం మీద కూడా పడటంతో పైచదువుల ప్పుడు ఆ పదవుల జోలికి పోలేదు అనేది వేరే విషయం.
    విద్యార్థి దశ నుండి ఉద్యోగరీత్యా రైల్వేలో పూర్తి ప్రజాసంబంధాలతో అనుసంధానమైన వాణిజ్య విభాగం లో చేరటం జరిగింది .సూటిగా మాట్లాడే తత్వము ,పుట్టుకతో వచ్చిన హై ఓల్టేజ్ గల కంఠము, నిబంధనలకు లోబడి చేసిన పని సరి అయినది అని వివరించే ఈ క్రమంలో వాగ్ధాటిలో తడబాటు  లేకపోవటం వంటి కొన్ని లక్షణాలు కొందరికి" రఫ్ బిహేవియర్ "గా అనిపించి తాత్కాలికంగా కొంత ఇబ్బందికి గురి చేశారు. తర్వాత ఆలోచించి వారే వెనక్కు తగ్గుతూ వచ్చారు.
   నా కంఠం విషయానికి వస్తే ..ముందు రూమ్ లో కూర్చొని ఫోన్లో ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు మా ఆవిడ గమనించి మీరు ఫోన్ లో ఎందుకు మాట్లాడాలి డేటా వేస్ట్ కదా ,ఫోన్ లేకుండా మాట్లాడినా పక్క వీధి వారికి కూడా వినపడుతుంది ఫోన్ అవసరం లేదు ,అని సరదాగా అప్పుడప్పుడూ అంటూ ఉంటుంది .
     ఇప్పటికీ ఈ విధానం కొనసాగటం వలన దగ్గరి వారితో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది.... ఇలా ఎందుకు? నలుగురితో పాటే మనం కూడా మనకెందుకులే ..అనే ధోరణిలో ఉంటే బాగుంటుంది కదా అని. కానీ ఏదో ఒక సామెతలో చెప్పినట్టు "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడగలతో గాని పోదు" అనేది నా విషయంలోనే రుజువు అవుతుంది అనుకుంటాను.
     
కామెంట్‌లు