ఆఖరి శ్వాస:-యాడవరo చంద్రకాంత్ గౌడ్ పెద్దగుండవెల్లి ,సిద్దిపేట-9441762105

 రంగారెడ్డి రెండెకరాల భూమి ఉన్న సన్నకారు రైతు. ఇందులో ఎకరం భూమి మాత్రమే  సాగుచేసే వాడు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. తక్కువ పెట్టుబడితో ,ఎక్కువ పంట దిగుబడి తెచ్చేవాడు. అందుకే చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శ రైతు గా పేరు తెచ్చుకున్నాడు. ఇంత మంచి రంగారెడ్డిని గ్రామ ప్రజలందరూ ప్రేమగా "రంగన్న" అని పిలుచుకునేవారు.
రంగన్నకు ఇద్దరు కుమార్తెలు. వారికి మంచి పెళ్లి సంబంధాలు వస్తే ,తన రెండు ఎకరాల భూమిని అమ్మి,ఏమైనాసరే పెళ్లిళ్లు చేయాలని అనుకునేవాడు. అనుకోకుండా పెద్ద కూతురు కి మంచి సంబంధం రాగానే ఎకరం పొలం అమ్మేసి ఘనంగా వివాహం జరిపించాడు.  వారి దాంపత్యానికి గుర్తుగా,  కూతురుకి ఒక బాబు కూడా పుట్టాడు .ఇంతలో అనుకోని ఉపద్రవం ముంచుకు వచ్చింది. అల్లుడు వ్యవసాయ బావి దగ్గర కరెంటు షాక్ తో మరణించాడు .ఇది రంగన్నకు ఊహించని పరిణామం .తన ఆరునెలల కొడుకుతో , చిన్న వయసులోనే విధవగా మారి, మళ్ళీ పుట్టింటికి చేరింది కుమార్తె. దేవుడు చిన్నచూపు చూసిండు బిడ్డా, అని కుమార్తెను , మనవడిని ప్రేమగా చూసుకునేవాడు రంగన్న.
రెండవ కుమార్తె కు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న సంబంధo చూసి వివాహం జరిపించాడు రంగన్న. ఇగ తన మనవడిని పెద్ద కుమార్తెను చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్న ,రంగన్నకు మరో ఉపద్రవం ముంచుకు వచ్చింది. తమ గ్రామ పరిసరాల్లోని సీతారామ ప్రాజెక్టు కడతామని ప్రభుత్వం వారు సర్వే కోసం రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపుగా ఇరవై గ్రామాలు ముంపునకు గురి అవుతాయని, వారందరూ కూడా తమ గ్రామాలను ఖాళీ చేయాలని ,నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పారు.
ప్రాజెక్టు విషయం తెలిసినప్పటి నుండి రంగన్న మనసు మనసులో లేదు ఇప్పటికే 60 సంవత్సరాల వయసు దాటిన, ఈ వయసులో పుట్టిన ఊరు, పెరిగిన ఊరు వదిలి ఎక్కడికి వెళ్తాం. ఈ మట్టిలోనే పుట్టి పెరిగాను ,ఈ మట్టిలోనే కలిసిపోవాలి. నా ఆఖరి శ్వాస నా ఊర్లోనే ఆగిపోవాలి అని మనసులో అనుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది ఇక అందరూ గ్రామాలను విడిచి వెళ్లిపోవాలని అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. సరిగ్గా 10 రోజుల తర్వాత అధికారులు వచ్చి గ్రామంలోని ఇళ్లను కూల్చివేసేందుకు వచ్చారు. రంగన్న ఇంటిని  కూడా కూల్చేశారు. ఇది చూసి తట్టుకోలేక పోయాడు రంగన్న.
ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రంగన్న. ఊరు దాటి వెళ్లడం అంటే నా శ్వాస ఆగిపోవడమే అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన వ్యవసాయ భూమి దగ్గర ఉన్న కట్టెలను తీసుకొచ్చి తన ఇంట్లోనే చితి పేర్చుకున్నాడు. అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్న సమయంలో, చితిపై తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నడు.  భార్యా పిల్లలు పరుగెత్తుకు వచ్చేసరికి కాలిబూడిదైపోయాడు రంగన్న.
రంగన్న తన ఆఖరి శ్వాస తన ఊర్లోనే వదిలి పెట్టాలి. అనుకున్న కోరిక తీర్చుకున్నాడు. ఆఖరి శ్వాస తీసుకున్నాడు.కానీ ఇది గ్రామ ప్రజలను కదిలించింది .వారి హృదయాలు తల్లడిల్లాయి. "ఉన్న ఊరు కన్న తల్లితో సమానం" .ఇక్కడే పుట్టి ,ఇక్కడే పెరిగి ,ఇక్కడి మట్టిలోనే కలుస్తనన్న రంగన్న ప్రాణత్యాగం గొప్పదన్నారు.

నీతి: 
ఉన్న ఊరు_కన్న తల్లిని మించింది లేదు

కామెంట్‌లు