*"సద్గుణాలు"*(మినీ కథ):-చైతన్య భారతి పోతుల-హైదరాబాద్--ఫోన్ నo.7013264464

 ఎప్పుడూ ఎంత గొడ్డుచాకిరి చేసినా, అణకువగా ఉన్నా, అత్త తనను ప్రేమగా చూడదని ,తన కష్టాన్ని గుర్తించదని పెద్దకోడలు మనసులో బాధ పడుతూ ఉంటుంది.అత్త గంగమ్మ సూటి పోటీ మాటలతో ఆమె చేసే పనులకు వంకలు పెడుతూ ఉండేది.పెద్దకోడలు పదవ తరగతి వరకు చదువుకున్నది.పెద్ద చదువులు చదవాలని ఉన్నా, పెళ్లయ్యాక పిల్లలు,ఇంటి బాధ్యతలతోనే సరిపోతున్నది. శీలవంతురాలు ఎవరినీ బాధపెట్టే మనస్తత్వం కాదు.ఇల్లును ,సంసారాన్ని సహనంతో ముందుకు నడిపిస్తూ ఉన్నది.
   గంగమ్మకు చిన్నకోడలు మీద మిక్కిలి మక్కువ .కాలు కింద పెట్టనిచ్చేది కాదు.వాళ్ళ ఇంట్లో బోర్ మోటర్ కాలిపోయి నీళ్లకు చాలా ఇబ్బంది అయింది.అది పల్లెటూరు.దూరంగా పొలందగ్గర లోతైన బావి ఉన్నది.అక్కడికి వెళ్లి పెద్దకోడలు నీళ్లు తెస్తూ ఉంటే, దారిలో ఒక సాధువు ఎదురై చాలా దాహంతో ఇబ్బంది పడటం గమనించి సంతోషంగా అతని దాహాన్నీ తీర్చింది.ఆ సాధువు చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించి వెళ్ళాడు.
    నీళ్ళకడవతో పెద్దకోడలు ఇంటికి చేరగానే అద్భుతం జరిగింది.ఆమె మాట్లాడినప్పుడల్లా ఇంట్లో దైవ వాక్యాలు ఆకాశవాణిలా విన్పిస్తున్నాయి. సుగంధ పరిమళ వాసన ఇల్లంతా వ్యాపించింది.
   అత్త విషయమంతా తెలుసుకొని మరుసటిరోజు నీళ్లు తేవడానికి చిన్నకోడలిని పంపించింది. విసుక్కుంటూ వెళ్లిన ఆమె సగం కడవ నీళ్లతో మాత్రమే వస్తూ ఉండగా దారిలో ఇంకో సాధువు ఎదురయ్యాడు.దప్పికతో అలమటించి పోతున్నా కనికరించకుండా విసుగుతో ఇల్లు చేరింది.
    ఆమె ఇల్లు చేరగానే విచిత్రంగా పాములు, తేళ్లు, జెర్రెలు బయట పడ్డాయి.
    కాబట్టి పై కథవల్ల మనం ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు...
   మన మాటలు ,చేతలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్థాయి.మన మనస్సు ప్రేమ,కరుణ,జాలి,దయతో తొణికిసలాడినప్పుడు మాటల్లో చేతల్లో అమృతం లాంటి తేజస్సు ప్రస్ఫుటం ఔతుంది.అలా కాకుండా విసుగు ,కోపం,ద్వేషం,అసహనం,అయిష్టం మనలో పేరుకు పోయినప్పుడు మాటల్లో, చేతల్లో అవి క్రియారూపం దాలుస్తాయి.
  మన ప్రతి చర్యలో"నేను"ను ప్రక్కన పెట్టి మనం అన్న భావనతో పని చేస్తూ పోతే మృదుత్వం,శాంతి,,సౌఖ్యం,ఆహ్లాదం,ఆనందం గోచరిస్థాయి.వీటి(సానుకూలధోరణి)వల్ల మనలో ఉన్న శక్తిని గుర్తించి  సమాజానికి ఉపయుక్తంగా ఉండే పనులు చేయగల్గుతాము.దానివల్ల మనలో వ్యతిరేక ధోరణి పటాపంచలై సత్పలితాలను పొందగలుగుతాము.ఎంతటి అసాధ్యాలైనా సుసాధ్యం చేయవచ్చు.ప్రశాంతంగా ఉండటం,సేద తీరటం,నైతిక విలువల పట్ల ఉదాత్త భావాలు కల్గి ఉండటం సాధన చేస్తూ ఉండాలి.
   సత్యం,ధర్మo, కరుణ మొ. న సద్గుణాలకు మన అంతరంగం ఆలవాలం కావాలి. ఈ గుణాలను పెంచి పోషించుకుంటూ సత్సాంగత్యం ద్వారా భావితరాలకు అందచేయాలి.మనిషి మనుగడకు ఇవి పునాది కావాలి.అష్టైశ్వర్యాల,సుగుణాల,సమసమాజ సౌధ నిర్మాణo జరిగి ,భారతదేశం ప్రపంచ దేశాలకాదర్శం కావాలి.
నీతి:-సచీలం,సత్ప్రవర్తన ఉన్నచోట ఆనందం,అభివృద్ధి తప్పక ఉంటుంది.