అయ్యా!నేను చదువుకుంటానయ్యా!:-ద్వారపురెడ్డి. జయరాం నాయుడు(టీచర్) ప్రాథమికోన్నత పాఠశాల,వెలమపేట Ph.9441519570కైకలూరు

 బారెడు పొద్దెక్కింది పాలేరు సాంబయ్య ఇంకా పనిలోకి రాలేదని లక్ష్మీపతి కాలు కాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు తిరగుతున్నాడు.ఎంతకు సాంబయ్య రాకపోయేసరికి కబురు పెట్టించాడు అయినా సాంబయ్య రాలేదు.దానితో పాలేరు ఇంటికి వెళ్లి కోపంతో "ఒరేయ్!సాంబ! ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా!  పనులు ఎవడు చేస్తాడనుకున్నావురా!మీ అయ్యేమో తీసుకున్న అప్పు తీర్చకుండానే చచ్చాడు. నీవు చేసే పనికి వచ్చే జీతం వడ్డికే సరిపోవడం లేదు.ఇలా పనులు ఎగ్గొడితే ఇక అప్పు ఈ జన్మకు తీరినట్టే నడురా ముందు నడువు" అని అరిచాడు. 
"అయ్యగారు !మరి....మరి...” ఏంట్రా మరి !”నేను మా ఆవిడా బుడ్డోడు కిట్టి గాడిని తీసుకుని పట్నం వెళ్తున్నామయ్యా! అక్కడ నాలుగు డబ్బులు సంపాదించి మీ అప్పు తీర్చేస్తామయ్యా.. మా కిట్టిగాడికి చదువు అంటే చాలా  ఇష్టం అయ్యా ! ఇక్కడ ఇల్లుగడవక వాడిచేత గొర్రెలు కాయిస్తున్నానయ్యా!అక్కడైనా ఆడికి చదువు చెప్పిస్తానయ్యా”.అని బ్రతిమలాడాడు సాంబయ్య.
”ఏంట్రా మతుండే మాట్లాడుతున్నావా! నీ అయ్య అప్పు తీర్చకుండా చచ్చాడు.నువ్వు అప్పు ఎగ్గొట్టాలని చూస్తున్నావు.ఈ ఊరు విడిచి పోతే బాకి ఎవడు తీరుస్తాడురా? మర్యాదగా అప్పు తీర్చే వరకు నా దగ్గర పాలేరుగా పడి ఉండు లేదంటే నా అప్పు తీర్చి ఈ ఊరి నుంచి కదులు"అని కేకలేశాడు లక్ష్మీపతి.
 .”అయ్యగారు !మీ కాలుమొక్కుతా పట్నమెల్లి మీ బాకీ అణా పైసలతో సహా తీర్చేస్తాను కనికరించండయ్యా!"అని సాంబయ్య కాళ్లావేళ్ళా పడ్డాడు. "సరే నువ్వు ఇంత ఇదిగా కాళ్ళావేళ్ళా పడి బ్రతిమలాడుతున్నావు గనుక నిన్ను పంపిస్తున్నాను.అంతవరకు నీ కొడుకుని నా దగ్గర పాలేరుగా ఉంచుకుంటున్నాను".అని బలవంతంగా కిష్టయ్యను లక్ష్మీపతి ఈడ్చుకు పోతుంటే “అయ్యా! అయ్యా! నేను పట్నంలో చదువుకుంటానయ్యా నన్ను విడిపించి తీసుకెళ్లయ్యా! "అని అంటున్న కొడుకు మాటలకు సాంబయ్య ఏమి  చెయ్యలేక బాధపడుతూ కొడుకుని చదివించలేకపోయాను సరికదా పాలేరుని చేశాను అని గుండెలవిసేలా కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కూలబడిపోయాడు.
                లక్ష్మీపతి కిష్టయ్యతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నాడు.ఆ కష్టాలు భరించలేక కుమిలి కుమిలి ఏడ్చేవాడు కిష్టయ్య.తన ఈడు పిల్లలు ఆడుతూ పాడుతూ ఆనందంగా చదువుకుంటుంటే వారి లాగే చదువుకోవాలనిఎంతో ఆరాటపడే వాడు.చాటు మాటుగా తోటి పిల్లల దగ్గర చదువు నేర్చుకునే వాడు.అది ఒకనాడు లక్ష్మీపతి కంట పడింది."ఏరా ! నీకు చదువు కావాల్సి వచ్చిందా! మీ లాంటి వాళ్ళు చదువుకుంటే మా పనులు ఎవడు చేస్తాడ్రా!" అంటూ కోపంతో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ విచక్షణారహితంగా కొట్టాడు.పాపం కిష్టయ్య ఆ బాధలన్ని భరిస్తూ బండెడు చాకిరీ చేసేవాడు.
               ఒకరోజు పోలీసులు లక్ష్మీపతిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. లక్ష్మీపతి ఆశ్చర్యపోతూ “నేను చేసిన తప్పేంటి !నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు” అని అడిగాడు.”మీరు 14సం.ల లోపు పిల్లాడితో పని చేయిస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది.మా పోలీసులు విచారించగా మీరు పిల్లాడితో పని చేస్తున్నారన్న మాట నిజమని తెల్సింది.ఇది బాల కార్మిక చట్ట రీత్యా నేరము .అందుకు గాను మీకు 5 నుండి10 సం.రాలు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విదించే అవకాశముంది"అని అన్నారు పోలీసులు.
”ఇంతకి నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి”మీ ఇంట్లో పని చేస్తున్న కుర్రాడే మాకు కంప్లైంట్ ఇచ్చాడు.ఏరా! నా మీదే ఎదురు తిరిగేంత మొనగాడివి అయ్యావే!అసలు నీకిన్ని తెలివితేటలు ఎక్కడినుంచి వచ్చాయి".అసహనంగా అడిగాడు లక్ష్మీపతి.”మన ఊరిలోని మాష్టారుగారి దగ్గరకు మీకు తెలియకుండా రాత్రిపూట వెళ్ళే వాడిని.నా ఆసక్తి గమనించి మాస్టారు గారు ప్రత్యేక శ్రద్ధతో చదువు నేర్పారు.సారు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.వెట్టి చాకిరీ నుండి విముక్తి అయ్యే మార్గాన్ని తెల్సుకున్నాను".అన్నాడు కిష్టయ్య. ఆ మాటలు విన్న లక్ష్మీపతి తెల్లబోయాడు .పోలీసులు లక్ష్మీపతిని అరెస్ట్ చేసి కిష్టయ్యకు విముక్తి గావించి ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ లో చేర్పించారు.
  ఇప్పుడు కిష్టయ్య అందరిలానే ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నాడు.
కామెంట్‌లు