మన భాష తెలుగు-తెలుసుకుంటే వెలుగు-తెలుగు ఒడిలో....10:-వ్యాసకర్త:-రాజావాసిరెడ్డిమల్లీశ్వరి

  తీగె పూలు
 "దోసిట గల పూలు వాసనల్ సమముగా
హస్త యుగం మునకు
నంటజేయు
సమముగా లభించు సుమనమోదంబు
వాము దక్షిణముల వాసి లేక. " ..( భావ తరంగాలు ..పువ్వులు). అంటూ పూల గొప్పతనం చెప్పబడింది
అలాంటి గొప్ప పూలలో
తీగె లకు పూసే పూలు కొన్ని ఉన్నాయి. ఈ తీగెలు  కఱ్ఱ, పందిరి, చెట్టు, ఇంటి చూరు మొదలైన వాటి ఆధారం లేకుండా పెరగలేవు. తీగె అనే దానిని తివ్వ, తీవ, ప్రతతి, లత, వల్లరి, లతిక, వల్లి మొదలైన పేర్లతో పిలుస్తారు.
 జాజి, మల్లె,మాలతి,
విరజాజి, సన్నజాజి, బటాణి, కాగితపు పూలు, కాశీరత్నం, సంపెంగ – మొదలైన ఎన్నో రకాల పూలు తీవలకే పూస్తాయి. ఈ తీవెలలో కాశీరత్నం పూల తీవ , దాని ఆకులు చాలా సుకుమారంగా ఉంటాయి. బఠాణి పూలు అచ్చం బఠాణీల్లా గుండ్రంగా చాలా  అందంగా ఉంటాయి.
ఇళ్ళు, తోటలు, విద్యాలయాలు, ఉద్యాన వనాలు మొదలైన చోట్ల ఇనుప చట్రాలు మొదలైన వాటినమర్చి వాటి మీద ఆయా పూల తీగలను పాకించటం జరుగుతూ ఉంటుంది.ఆ పూల తీగెలన్నీ పెంచబడిన ప్రాంత పరిసరాలకి అందాన్ని, సువాసననిస్తూ అక్కడున్న వారి మనసులకు హాయిని, మత్తును కలిగిస్తాయి
దాదాపు ఈ పూలన్ని 
సాయంకాలాలలో పూస్తాయి. ఈ పూలన్నీ ఎరుపు,తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉంటాయి. 
బోగన్ విల్లా మొదలైన వాటిని వివిధ ఆకృతులలో కూడా కత్తిరించి ఆ ప్రాంతాన్ని సౌందర్యవంతంగా చేయటం జరుగుతుంటుంది. 
“సన్నజాతి తీవెలోయ్ 
సంపంగి పూవులోయ్ –చిలిపి చిన్నారులోయ్ పాపలు” – అని  అన్నారొక కవి. 
 " విధవ కేల విరజాజి పూదండ "– అంటున్న సామెత ఒకనాటి సమాజాన విధవ( భర్త లేని స్త్రీ )ల పరిస్థితిని చెప్తోంది. 
తీగెకు పూచే జాజి పూవును జాది, విరహది అనే పేర్లతో పిలుస్తారు. 
“మావి కొమ్మను అల్లుకున్నది మాధవీలతొక్కటి” – అంటూ సాగిన కవితలలోను ఈ తీవ పూలు వర్ణించబడ్డాయి.