మన భాష తెలుగుతెలుసుకుంటే వెలుగు తెలుగు ఒడిలో....11పద్మం:-రాజావాసిరెడ్డి మల్లీశ్వరి

 మనకు బాగా తెలిసిన అందమైన పూలలో తామరపువ్వు ఒకటి. ఈ పూవును అంబుజము, అబ్జము, అరవిందం, కంజము, తమ్మి, తామర, నీరజము, పంకజము, సరసిజం, కుముదము, నళిని మొదలైన ఎన్నో పేర్లతో పిలుస్రారు. చెరువు లేదా కొలను లేదా సరస్సు నీటిలో విరిసే ఈ తామర పూలు లేదా పద్మాల వలన చెరువు, కొలను, సరస్సును నీరజాకరము,
 పద్మాకరము అని అంటారు. ఎక్కువ పూలున్న దానిని 
" నాళీకము "  ని అంటారు. ఈ పూలు చెట్టుకు కాక తీగకు పూస్తాయి.  ఆ తీగను "కమలిని, పద్మిని "అని అంటారు. 
ఈ తామరపూలు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఎర్ర తామరలను కెందమ్మి, కెందామర, కోకనదము మొదలగు పేర్లతో పిలుస్తారు. తెల్ల తామరలను తెలిదమ్మి, పుండరీకము, వెలిదమ్మి మొదలైన పేర్లతో పిలుస్తారు ఇంకా జలవల్లి అని పిలువబడే అంతరదామర. ఛ్రతపత్రం, పైడి దామర, బయలు దామర మొదలైన పేర్లతో పిలువబడే మెట్టదామర పూలు ఉన్నాయి. తామర తూడును కోరకము మృణాళి అంటారు.
సరస్వతీ దేవికి తెల్లతామర పూలంటే చాలా ఇష్టమట, అందుకే ఆమెని వర్ణించేటపుడు పద్మాలయే, పద్మాసనే, పద్మహస్తే, పద్మముఖే
అంటూ స్తుతిస్తారు. సరస్వతి పూజలో, వినాయక పూజలో తామరలను ఉంచి పూజిస్తారు. విష్ణువును కూడా పద్మగర్భుడు, తామరకంటి, తెలిదమ్మికంటి, పద్మాక్షుడు, మొదలైన పేర్లతో పిలుస్తారు. బ్రహ్మను పద్మజుడు, పద్మభవుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. యముణ్ణి పద్మమిత్రపుత్రుడు అని, సూర్యుణ్ణి పద్మవల్లభుడు అని అంటారు.
 
మన తెలుగు సాహిత్యంలో పద్మానికి ఎంతో విలువైన స్థానమీయబడింది. స్త్రీలను నాలుగు రకాలుగా వర్ణించి – అందులో పద్మినీజాతి స్త్రీ ఒకటి అన్నారు స్త్రీ కళ్ళు, ముఖం, పాదాలు పద్మాలతో పోల్చి చెప్పబడ్డాయి. తామరకు, సూర్యునికి బంధం కలిపి సూర్యుణ్ణి కమల బాంధవుడు అన్నారు కవులు. తామర పూలు విచ్చుకోవటాన్ని కూడా ద్రౌపతి స్థితికి జాలిపడినవి తామరలంటూ తామరలను – 
‘ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
..దురసిల్లుచునున్న కరణి.... ............................. ....................
............... ..................... ..................
మూతులువిచ్చెకొత్త తావి నెత్తమ్మి విరులు’ అంటూ తిక్కన కవి చెప్పారు.

కమలములునీటబాసిన కమలాప్తుని రశ్మిసోకి
        కమలిన భంగిన్
తమతమ నెలవులు 
                 తప్పిన
తమ మిత్రులె శత్రులౌట
  తథ్యము సుమతీ....
అంటూ బద్దెన అనే కవి
లోకం నీతిని, రీతిని తెలియజెప్పారు.అభివృద్ధిని తెలపటానికి
" తామర తుంపర  "  అనే  తెలుపటం జరుగుతోంది. పద్మం రంగు వంటి ఎరుపు రంగుగల కెంపును
" పద్మ రాగం " అని అంటారు. అందాల వెన్నెలతో ఉన్న తుమ్మెదలు  " పద్మ బంధువు " అని అంటారు.
అంతే కాదు ...
అమ్మణి కన్నులు 
తమ్మి పూవుల్లు " అంటూ అమ్మాయిని 
పద్మాక్షి, పద్మ పత్ర విశాలాక్షి, పద్మ దళాయతాక్షి అని వర్ణించారు కవులు.
ఇలా ప్రకృతిలోని ప్రతి అంశంతో ఎంతో విలువైన సాహిత్యాన్ని అందించారు  మన వాళ్ళు
యుద్ధ వ్యూహాలలో పద్మం పేరుతో ఉన్న వ్యూహం పద్మవ్యూహం.మహాభారత కథలో అభిమన్యుడు ఈ పద్మ వ్యూహంలో ప్రవేశించి
అందులోనే సంహరించబడ్డాడనే
అంశాన్ని చదివాం కదా.
ఎన్నో దేవాలయాలలో పై కప్పులు, గోడలు, సంభాల మీద పద్మాలే శిల్పించారు శిల్పులు. ముగ్గులలోను పద్మాలను చిత్రిస్తారు. భవన నిర్మాణంలోను పద్మం తన ఉనికిని చాటుకుంది.
తామరలు, వాటి రేకులు, గింజలు, ఆకులు, తూళ్ళు మొదలగునవన్నీ మానవుడికి ఆరోగ్యాన్ని  ప్రసాదించేవే, మనిషి శరీరపు వేడిని తగ్గించి చల్లబరచటం మొదలుకొని అతిసార వ్యాధి, హృద్రోగం, చర్మవ్యాధులు, కుష్ఠువ్యాధి మొదలైన వ్యాధుల నివారణకు ఔషధాలుగా పని చేస్తాయి. 
ఈ పూలు మొదలైనవి వ్యాపార వస్తువులుగా వ్యాపారంగా మారి కొందరికి జీవనోపాధిని ఇస్తాయి. వేల సంవత్సరాలుగా పూలెంతో ప్రయోజన కారకంగానే ఉన్నాయి. 
ఇంత మహిమాన్విత పుష్పం కనుకనే పద్మం మన జాతీయ పుష్పంగా గౌరవించబడుతోంది. 

-
కామెంట్‌లు