మత్తేభము:
*పవమానాశన భూషణ ప్రకరము | ల్భద్రేభచర్మంబు, నా*
*టకవిత్వంబు బ్రియంబులై భుజగశుం | డాలటవీచారులన్*
*భవదుఃఖంబులబాపు, టొప్పుగొలదిం | బాటించి కైవల్య మి*
*చ్చి వినోదించుట కేమి కారణమయా | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీకు గాలనే భోజనముగా తీసుకునే పాములు హారముగా వేసుకోవడం, ఏనుగు చర్మాన్ని కొట్టుకోవడం, అడవుల్లో తిరుగుతూ ఎరుకల వారితో స్నేహం చేయడం చాలా ఇష్టం. అందుకే, ఏమీ తెలియని జీవాలు పాము, ఏనుగు, కోయవాడైన తిన్నడు వీళ్ళకు సంసార బాధలు రానివ్వక నీవు ప్రత్యక్షముగా కనిపించి మోక్షము ఇచ్షావు. వీరి పై ఇంత దయ ఎందుకు చూపావో నాకు మాత్రం అర్ధం అవడం లేదు.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఎమని చెప్పాలీ, ఎన్నని చెప్పాలి నీ ఆటలు. ఏమీ తెలియని అమాయక ప్రాణిని దగ్గరకు తీసుకుని, లాలించి నీలో కలుపుకుంటావు. మేమేదో నిన్ను అడిగినట్టు,మాకు ఆలోచించే సామర్థ్యం ఇచ్చి, సరియైన మార్గంలో ఆలోచిచటల్లేదు అని పరీక్షలు పెట్టి, నీ మీద మాకున్న శ్రద్ధ ను పరీక్షించి, మా చేత "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ!" అని పించి నిన్ను నీవే మాకు తెలియ పరచుకుంటావు. ఈ నీ ఆటలు మాకు ఎక్కడ అర్థం అవుతాయి, భస్మధూళి విగ్రహా! శ్రీ రాముడు, విష్ణుమూర్తి, బ్రహ్మ మొదలగు వారు నీ ఆటలు అర్ధం కాక నివ్వెర పోతే మే మేపాటి వారము,తండ్రీ! పన్నగభూషణా! అందుకనే ఈ నాటి ఒక మధుర కవి అన్నాడు "ఆట గదరా శివా! ఆట గద కేశవా!" అని. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మామీద సాగే నీ ఆటలను గెలవడం మావల్ల అవ్వదు అని నీకూ తెలుసు. తెలిసి తెలిసి మమ్మల్ని ఇంత కవ్వించడం అవసరమా,అంబికానాధా! ఇదిగో,నీవు కరుణ చూపితే సరే. లేకపోతే మా అమ్మనే వేడుకుంటాము, కాపాలా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి