*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౪ - 54)

 శార్దూలము:
*ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు ని | ష్టార్ధంబులీనేర్తురే*
*వేళన్వారిభజింప జాలిపడకా | విర్భూత మోదంబునన్*
*కాలంబెల్ల సుఖంబు నీకు, నిక భ | క్తశ్రేణి రక్షింపకే*
*శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
భార్యా, పిల్లలు, స్నేహితులు, తోడ బుట్టిన అన్నా చెల్లెళ్ళు వీళ్ళందరనీ మేము అందరమూ ప్రేమ, ఆదరణలతో దగ్గరకు తీసినా, వీళ్ళు ఎవరూ మా కష్టాలు పోగొట్ట లేరు, మాకు సంతోషాన్ని ఇవ్వ లేరు.  శివా, నీ దగ్గర వున్న సంతోషాన్ని నీవు మాత్రమే అనుభవిస్తూ మా వంటి వారిని పట్టించు కోకుండా వున్నావు, కదా. ఎందుకయా మా మీద ఇంత దయ లేకుండా వున్నావు.  నిన్ను పూజచేసే నీ భక్తలకు కాకుండా నీ ఆశీస్సులు ఇంకెవరికి ఇస్తావయా సాంబశివా!.......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ మాయతో నీవే ఏర్పరచిన కళత్రము, సంతానము, బంధాలు అనుబంధాలు ఇవేవీ మా కష్టాలను తీర్చలేవు అనేది యదార్ధమైన విషయం కదా, కారుణ్యధామా! అయినా, మా కళ్ళకు ఇంకా మాయ పొరలు కప్పి వుంచుతావు ఎందుకు, కపటసాత్రధారి.  అతి త్వరగా మా మీద నుంచి నీ మాయను తొలగించి, మమ్మల్ని నీ వారిగా చేసుకుని మాకు మోక్షము ప్రసాదించు స్వామీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు