*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౯ - 59)

 మత్తేభము:
*రతిరాజుద్ధతిమీర నొక్క పరిగో | రాజాశ్వున్నిన్నొత్తబో*
*నతడా దర్పకువేగనత్తగవయం | బాబోతు నూదాకి యు*
*గ్రత జోరాడగనున్న యున్నడిమిలే | గల్వోలె శోకానల*
*స్థితిపాలై మొరవెట్టనన్ మనుపవే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.
మన్మధుడు తాను ఎంతటి వారనైన గెలవగలను అనే గర్వముతో ఎద్దును వాహనముగా చేసుకొని తిరిగే నిన్ను కూడా గెలవాలని నీ మీదకు వచ్చినప్పుడు, నీవు ఆ మన్మధుని తో యద్ధం చేశావు.  ఆ యుద్ధంలో, మీ ఇద్దరి మధ్యా నీ భక్తులు నలిగిపోతూ కాపాడమని ప్రార్ధిస్తే, వారిని అందరినీ కాపాడావు కదా, శివా! .........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఎంతటి మదోద్ధరుడైనా, నీ అనితర సాధ్యమైన శక్తి ముందు నిర్బలుడౌతాడు కదా, సదాశివా!  ఇంక పూవింటి వాని శక్తి ఏపాటిది స్వామీ.  అంబను, నిన్ను కలపాలనే ప్రయత్నంలో నీ మీదే తన ప్రభావం చూపి, ప్రాభవం పెంచుకోవాలి అనుకున్నాడు.  నీ మూడో కన్ను వేడిలో శలభమై మాడిపోయాడు.  నీ భక్తురాలు, రతీ దేవీ కావుమని ప్రార్ధించగా, నీ దయతో, మన్మధుడు తిరిగి తన నిజ రూపాన్ని పొందాడు. నీ ముందు చేయి చాచినవారు ఎవ్వరూ రిక్త హస్తులై తిరిగి వెళ్ళరు కదా, సదాశివ సమారంభా! అన్యధా శరణం నాస్తి! త్వమేవ శరణం మమ!  రక్ష రక్ష మహేశ్వర!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు