తాతయ్య కథలు-62..:- ఎన్నవెళ్లి రాజమౌళి

  ప్రార్ధన అయిన తర్వాత క్లాస్ మానిటర్లు అందరూ ఆఫీస్ కు రావాలి అన్నాడు ప్రధానోపాధ్యాయుడు.
ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మానిటర్లు ఆఫీసుకు వెళ్లారు.
 నేను డబ్బులు ఇస్తున్న... మీరందరూ బుక్ డిపోలకు వెళ్లి మీకు కావలసిన మ్యాపులు తెచ్చుకోండి అనగానే-సరే సార్ అని, పెద్ద సార్ వద్ద డబ్బులు తీసుకుని బుక్కు డిపోకు వెళ్లి మ్యాపులు తెచ్చుకున్నారు.
పదవ తరగతి చదివే ప్రతాప్ తను తెచ్చుకున్న మ్యాపులు బీరువాపై పెట్టాడు.
తరగతి టీచర్ వచ్చి-మ్యాపులు ఏవిరా అనగానే-బీరువా పైనుండి తీసి ఇచ్చాడు ప్రతాప్.
ఈ మ్యాపులలో ఇండియా మ్యాప్ లేదేమి రా అని అడగగా-
తెచ్చాను సార్ అన్నాడు. ఏదిరా ఎన్నిసార్లు చూసినా కనపడుటలేదు అనగానే-
మరునాడు వెళ్లి బుక్ డిపో లో అడిగాడు.
అన్ని మ్యాపులు ఇచ్చానని, బుక్ డిపో అతను అనగా-లేదని అతనిమీదికి కోపానికి వచ్చాడు ప్రతాప్. మళ్లీ  ఇండియా మ్యాప్ ఇవ్వగా-స్కూలుకు తీసుకు వెళ్ళాడు.
ఒకరోజు అనుకోకుండా బీరువా పక్కన చూసేసరికి మ్యాప్ ఉంది. నేను వెళ్లి ఇచ్చి వస్తానంటే మిత్రులు వద్దన్నారు.
మళ్లీ పోతే ఏమన్నా  అనుకోవచ్చు. నన్ను ఏమన్నా సరే ఇచ్చి వస్తానని వెళ్లి ఇవ్వగా- ప్రతాప్ నిజాయితీకి అభినందించాడు . బుక్ డిపో యజమాని.