మట్టిని నమ్ముకున్నోడు...!:-జటావత్ మునినాయక్.7659888655 :- జాల్ తండా (నల్గొండ ).
మట్టిని నమ్ముకుని
అమ్ముకోలేని  అమ్మతనమున్నోడు
నువు బెదిరించినా అదిరించినా
ప్రకృతి వైపరీత్యమై కాటేసినా
ఆ మట్టిని కప్పుకునే వరకు
నెలల బిడ్డకువలే నీకు
కాపలా తనవుతూనే వుంటాడు..

అర్ధరాత్రో అపరాత్రో నీ గొంతెండిన ప్రతిసారి
నిద్రకళ్ళను తరిమికొట్టి
తన ప్రాణాన్ని పణంగా పెట్టి
పచ్చని పైరుని తన గుండెలో మొలిపించుకుని
ఎదిగే కొడుకువలే నిను సాకుతుంటడు...

చేతికచ్చిన పసిడివి నీవైతే
పండంగ సంభరమంతా తన కళ్ళలో నింపుకుని
అప్పుల తీర్చే ఆశవు నీవయితే
మార్కెట్లోని మాయ జూదానికి మోసపోవటం తనవంతైనా
విశాదమంతా గుండెలో ఒంపుకుని
కన్నీళ్ళను కంటికి కాపలా చేస్తుంటడు..

గుండెపై తన్నిన పంటరేటువు నువయిన
ఆ కొండ మనసులో మార్పును చూపక
తొలకరి జల్లుకి ఎదురుచూపై
ఏరువాక తన మది వాకిలైతే
తన కంటి గుమ్మంలో
నెలలతల్లికి చేసిన సేవలే నీకు చేస్తుంటడు...

మట్టి పిసికిన చేతులు నీగుండెను తడుముతూ..
తన బ్రతుకు ఆశకు ఊపిరి పోయమంటూ వేడుకోలుతో..
అన్నదాత పేరును అమ్ముకోక
నేలతల్లివంటూ పూజిస్తుంటడు
నిను పంచప్రాణంలా భావిస్తుంటడు..!