*సుచిత్రం*:--*' రసస్రవంతి ' ' కావ్యసుధ '*-9247313488 : హైదరాబాదు.
మనసు నేదో తొలుస్తున్నది
 దృశ్యమేదో  నిలుస్తున్నది
 కనురెప్పల మాటు నేదో
 కలగ సాక్షాత్కరిస్తుంది
 ఎన్నడెరుగని పరిసరాలలొ
 దేహమే సంచరిస్తున్నది

 గాలి లోపల తేలి నీలపు
 మేఘమాలలొ లీనమగుచు
 మేఘ గర్జన వేళ్ళ మెరుపుల
 తళ తళమ్ముల మెలికలవుచు
 గగన వీధుల గమనములతొ
 హృదయమే పులకరిస్తుంది

 అప్సరసలతొ అభినయిస్తు
 హాయిగా నర్తించినట్లు
 సరిగమా పదనిసా యని
 గంధర్వగాన మొనరించినట్లు
 ఆది దేవుని అంబతో గని 
 సంతసాన ధరించినట్లు

 ఆత్మయే పరమాత్ము యెదురై
 వరములిడునని భ్రమిస్తున్నది
 ఊహయే ఊపిరిగ మారుతు
 యెడదలో సంచరిస్తున్నది
 చిత్రమే యిది సచిత్రమ్ముగ
 కన్నుల పొర లాక్రమిస్తున్నది.