ఇక పారేయను!:- కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   రాజు,వాసు నడచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చిప్స్ తింటూ నడుస్తున్నారు.అలా కొంత దూరం వెళ్ళాక చిప్స్ అయిపోయాయి.రోడ్డు పక్కన పొట్లాలు పడేశారు.అక్కడే పడుకుని ఉన్న ఒక ఆవు ఆ పొట్లాలను చూసి లేచింది.ఆవు ఏంచేస్తుందా అని ఆవు వైపు చూస్తే ఇక ఏముంది అది పొట్లాలను ఆవురు ఆవురు మంటూ తినసాగింది.నేల మీద పడిన పొట్లాలు ఆ ఆవు కడుపులోకి చేరి పోయాయి.
     ఆ దృశ్యం చూసి రాజు,వాసు భలే నవ్వు కున్నారు.ఇంటికెళ్ళాక ఆవిషయం చిరునవ్వుతో తన తండ్రి రాజారావుకి చెప్పాడు రాజు.ఆయన వెటర్నరీ డాక్టర్,అంటే జంతువులకు జబ్బుచేస్తే నయం చేసే డాక్టరన్న మాట.
      "ఎంతపని చేశావు రాజు,ఎప్పుడుకానీ అలా రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు గానీ,ప్లాస్టిక్ పేపర్లు గానీ పారేయకూడదు.అది ఎంత ప్రమాదమో తెలుసా? ఆవులకి,బర్రెలకు ప్లాస్టిక్ కవర్ల ను గురించి తెలియదు కదా, వాటిని అవి అమాయకంగా తినేస్తాయి,తరువాత వాటి కడుపుల్లో అవి అరగవు ఉండచుట్టుకుని కడుపులో ఉండి పోయి వాటికి అమిత బాధ కలుగ చేసాతాయి! ఆ బాధతో అవి ఏడుస్తాయి.మేము మా హాస్పిటల్లో నిన్ననే ఒక ఆవు కడుపుకి ఆపరేషన్ చేసి అర్థ కిలో ప్లాస్టిక్ ఉండ బయటకు తీశాం.అర్థమయిందా,ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడవేయటం ఎంత ప్రమాదమో,నీ ఫ్రెండ్ వాసూకి 
 చెప్పు,వీలైతే మీ క్లాస్ లో అందరికీ చెప్పు ,ఆవులను,బర్రెలను ఈ ప్లాస్టిక్ ప్రమాదాల నుండి కాపాడిన వారవుతారు" అని చెప్పారు రాజారావు.
       "అవునా నాన్నా ప్లాస్టిక్  తో ఇంతప్రమాదం ఆవులకు,బర్రెలకు ఉంటుందని మాకు తెలియదు.మా సైన్సు మాస్టారు ప్లాస్టిక్ భూమిలో కలసి పోదని అలా ఉండి పోయి వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని చెప్పారు"అని చెప్పాడు రాజు.
      "అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్లాసిక్ కవర్లు వాడొద్దొని చెబుతోంది అర్థమయిందా?" అన్నారు రాజారావు.
      "ఈ రోజు మంచి విషయం తెలుసుకున్నాను నాన్నా వాసూకి మిగతా మా క్లాస్ మేట్స్ అందరికీ  మీరు చెప్పిన విషయాలు చెబుతాను"అని అనందంగా చెప్పాడు రాజు.