కల్పిత సైన్స్ కథలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   మన దేశ సాహిత్యంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే కొంత సైన్స్(శాస్త్రీయత) చోటు చేసుకుంది.ఆలోచిస్తే మహాభారతంలో కౌరవులు కుండల్లో పుట్టడం!విచిత్ర ఆయుధాలు,మత్స్య యంత్రం,థశరధుడి శవాన్ని నూనెలో భద్ర పరచడం(రామాయణం) వంటి శాస్త్ర విషయాలు ఎన్నో ఉన్నాయి!
       ప్రపంచ వ్యాప్తంగా 'కల్పిత సైన్స్ కథలు'(science fiction) 'కల్పిత సైన్స్ నవలలు' అనేకమంది రచయితలు వ్రాశారు.
       మేరీ షెల్లీ అనే రచయిత్రి 19వ శతాబ్దంలో 'ఫ్రాంకిన్ స్టైన్' అనే నవల వ్రాసింది.దీనిలో ఫ్రాంకిన్ స్టైన్ అనే వాడిని సృష్టిస్తే వాడిలో విపరీత గుణాలు ఏర్పడి నానా భీబత్సం సృష్టించడం,తనను సృష్టించిన శాస్త్రజ్ఞుణ్ణి చంపివేయడం వంటివాటితో నవల ఆసక్తికరంగా సాగుతుంది!
      
        జూల్స్ వెర్న్ అనే ఫ్రెంచి రచయిత (1828-1905) అత్యధ్బుతమైన సైన్స్ నవలలు వ్రాశాడు.ఆయన ఊహించినవి తరువాత కాలంలో కొన్ని నిజమయ్యాయి కూడా! ఆయన నవలల్లో మనుషులు బెలూన్లలో ప్రయాణించడం,సముద్రపు అట్టడుగుకు వెళ్ళి సాహసాలు చెయ్యడం(2000 leagues under the sea),చంద్రుడి మీద కాలు పెట్టడం(A trip to the moon),ప్రపంచాన్ని 80 రోజుల్లో చుట్టి రావడం(Around the world in 80 days)వంటివి ఎన్నో ఉన్నాయి.చిత్రమేమిటంటే ఈయన నవలలు అనేక మంది శాస్రజ్ఞులను ప్రభావితంచేసి వారు పరిశోధనలు చేయడానికి ఉపకరించాయి! అనేక నవలలు సినిమాలుగా తీయబడ్డాయి!ఈయన నవలలు పిల్లలు చదవాలి ఇప్పుడు ఈయన తెలుగు అనువాద నవలలు దొరుకుతున్నాయి.
        హెచ్ జి వెల్స్(1866-1946)(ఇంగ్లాండు) నవలలు కూడా మనల్ని వేరే లోకాలకి తీసుక వెడతాయి.ఆయన 'The first men in the moon' 'The time machine,'The invisible man' వంటి నవలలు వ్రాశాడు.వీటినికూడా సినిమాలు తీశారు.మన తెలుగులో వచ్చిన'ఆదిత్య 369' ది టైమ్ మిషన్ ఆధారంగా తీసినదే.
       మీరు 'జురాసిక్ పార్క్' సినిమా చూసే ఉంటారు.ఇది అమెరికాకు చెందినమైఖేల్ క్రిటన్ (1942-2008) నవల ఆధారంగా తీసినదే.ఈయన నవలలో వ్రాసినట్టుగా  ఇప్పుడు శాస్త్రజ్ఞులు అంతరించి పోయిన జంతువులను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు!
      కొన్ని నవలల్లో మనం సైన్స్ జాగ్రత్తగా ఉపయోగించకపోతే అంతులేని ముప్పు వస్తుందని హెచ్చరికలు కనబడతాయి.
      ఇతరగ్రహాల నుండి వచ్చే బుద్ధి జీవులు,ప్రయోగశాలల నుండి తప్పించుకునే జంతువులు,చిత్రంగా ప్రవర్తించే కంప్యూటర్లు,రోబోలు ఆధారంగా సినిమాలు తయారు అవుతున్నాయి.
       'ఆండ్రాయడ్ కట్టప్ప' అనే మళయాళం సినిమా(తెలుగులో కూడా ఉంది).దీనిలో రాబో చేసే మంచి పనులు సరదాగా చూపించారు.
       కొన్ని తెలుగు సినిమాలలో కూడా కొంత సైన్స్ రంగరించి అప్పటిలో మంచి సినిమాలు వచ్చాయి!
      మన తెలుగులో కూడా కె.ఆర్.కె.మోహన్,మల్లాది,వసుంధర,యండమూరి, ఎలక్ట్రాన్,కీ॥శే॥ మైనంపాటి భాస్కర్ వంటి ఎంతో మంది రచయితలు కల్పిత సైన్స్ కథలు,నవలలు వ్రాశారు.ఈ పుస్తకాలు చదివితే కేవలం వినోదమే కాకుండా బుర్రకు కాస్త మేత కూడా దొరుకుతుంది.
 మన బాలల కథా రచయితలు,మిగిలిన రచయితలు ఈ కోణంలో ఆలోచించి చక్కని కథలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.
        నేను కూడా'మామయ్యతో కిట్టూ సాహస యాత్ర'అనే సైన్స్ నవల పిల్లల కోసం వ్రాశాను.అది 'తానా మంచిపుస్తకం' వారు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి గెలుచుకుంది.మీరూ వ్రాయండి పిల్లల చేత కల్పిత సైన్స్ కథలు చదివించండి.