మంచి లాభం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   రామనాథం అమాయకుడు,అంతకంటె లోభి.ప్రతి పైసాను ఏ విధంగా కూడబెట్టాలో ఆలోచిస్తూ,భార్య కు ఒక మంచి చీర కొనాలన్నా అది ఖర్చని భావించే పిసినారి.చేసేది ఒక చిన్న ఉద్యోగం.ఆదివారం లేక ఏదైనా శెలవు రోజునఒక బుట్టతో రోడ్ల వెంబడి తిరిగి పేడ సేకరణ చేసేవాడు.అలా పోగయిన పేడను తోటల వారికి అమ్ముకునే వాడు!ఇక మీరు ఊహించుకోవచ్చు అతను డబ్బుకోసంఏ పనైనా చేస్తాడని.అలా అని అన్యాయంగా సంపాదించే వాడు కాదు!
        అలాకడుపు మాడ్చుకుని,కండలు అరగదీసుకుని ఓ రెండు లక్షలు వెనకేసుకున్నాడు రామనాథం!
        ఒకరోజు రామనాథం తను పనిచేసే బట్టలకొట్టుకి బయలుదేరాడు.ఓ ఇద్దరు వ్యక్తులు "స్వామీ"అంటూ రామనాథాన్ని ఆపారు. "ఏం" అన్నట్టు చూసాడు రామనాథం.
     చిన్నగా ఈ విధంగా చెప్పారు వారు.
    "స్వామీ మాదగ్గర కొంతబంగారు ఉంది ,అది నాలుగు తులాలు ఉంటుంది,పరిస్థితులవలన తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం"చెప్పారు.
      రామనాథానికి ఇద్దరి మీద అనుమానం వేసింది. "ఇంతకూ అసలు మీరెవ్వరు,ఎందుకు బంగారం అమ్ముతున్నారు?" అడిగాడు.
      "స్వామీ, నిజం చెబుతున్నాము మేము దొంగలం,బంగారు దొంగలించాం,ఎక్కడ అని అడక్కండి,కావాలంటే ఈ హారంలోని ఒక చిన్న ముక్క విరగొట్టి ఇస్తాం వెళ్ళి కంసాలి దగ్గర చూపించండి"చెప్పారు.
      రామనాథంలోని ఆశ పూర్తిగా వళ్ళు విరుచుకుని నిద్ర లేచింది.
       దండలోంచి వారిచ్చిన ముక్కని తీసుకుని కంసాలి వద్దకు తీసుక వెళ్ళి పరీక్ష చేయించాడు.
       "మంచి బంగారమే...ఎక్కడిది?"అడిగాడు కంసాలి.
     వివరాలు చెబితే ఏం ప్రమాదమో అని "నాదేలే" అని వడివడిగా వెళ్ళి పోయాడు.
      దూరంగా చెట్టుకింద నిలబడి ఉన్న ఆ ఇద్దరినీ కలసి"తులం ఎంతకు అమ్ముతారు?"అడిగాడు.
      "అయ్యా,మార్కెట్టు ధర ప్రకారం తులం సమారు ఏభైవేలు ఉంది,మీకు కేవలం ముప్పైవేలకు ఇస్తాం" అని ఓరగా చూస్తూ అన్నారు.
      "దొంగ సొత్తే కదాఇరవై చేసుకోండి"చిరునవ్వుతో అన్నాడు.
      "సరే కానియ్యి స్వామీ...మాకు అంతే ప్రాప్తం అనుకుంటాము,ఇక్కడే ఉంటాం వెళ్ళి డబ్బు తీసుకరండి"అని చెప్పి ఒక చిన్న మూటను విప్పి చూపించారు.దానిలో కొన్ని బంగారు గాజులు,హారాలు దగ దగ లాడుతూ  ఉన్నాయి.
      "ఇవి నాలుగు తులాలు ఉన్నాయా?"
     "మేము దొంగలమే కానీ మోసగాళ్ళంకాము,ఆ ఎల్లమ్మ సాక్షిగి ఈబంగారు నాలుగు తులాల పైనే ఉంటుంది!"అలా చెప్పే సరికి రామనాథం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళి పోయాడు.
       "సరే ఇక్కడే ఉండండి బ్యాంకు నుండి డబ్బు తెచ్చి ఇస్తాను"అని చెప్పి వేగంగా  ఇంటికి వెళ్ళి ఫిక్సెడ్ డిపాజిట్ పేపర్లు తీసుకుని బ్యాంకుకు వెళ్ళి అవి వారికిచ్చి ఎనభైవేలు తీసుకుని  వారిద్దరినీ కలసి డబ్బు ఇచ్చి నగల మూట తీసుకుని ఇంటికి వెళ్ళాడు.దొంగ ల్లో సంతోషం వెల్లి విరసింది.చౌకగా బంగారం దక్కినందుకు రామనాథం ఆనంద డోలికల్లో మునిగి పోయాడు.
     ఎందుకో రామనాథానికి ఆ బంగారం మీద అనుమానం పుట్టుకొచ్చింది.వెంటనే రెండు హారాలు తీసుకుని కంసాలి వద్దకు వెళ్ళి పరీక్ష చేయించాడు.కంసాలి పెదవి విరిచాడు.
       "ఇవి బంగారువి కావు,గిల్టు నగలు"చెప్పాడు కంసాలి.రామనాథం అడ్డంగా మోసపొయ్యాడు. ఇప్పుడు పోలీసులకు చెప్పలేడు ,ఎందుకంటే దొంగసొత్తు కొనడం నేరం! ఆ వచ్చిన దొంగలు ఎక్కడుంటారో తెలియదు.
       కడుపు మాడ్చుకుని,పిసినారిగా బతికి,పేడకూడా అమ్ముకుని కూడ బెట్టిన డబ్బు దొంగల పాలయ్యింది.దొంగలు రామనాథం బుద్ధికి కన్నం పెట్టారు.
       ఆ రోజు సాయంత్రం రామనాథం ఒక విధమైన షాక్ కు గురి అయ్యాడు!108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు.రామనాథానికి మాటరాలేదు! కప్పు కేసి చూస్తుండి పోయాడు.అతని చేతికి ఇంజక్షన్ ఇస్తూ డాక్టర్ "హి ఈజ్ ఇన్ టోటల్ షాక్" అన్నాడు.