ఫెంటాస్టిక్ వాయోజ్:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కొన్ని సినిమాలు కేవలం వినోదాత్మకంగానే కాదు,విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి.ఒక విధంగా చెప్పాలంటే చూడదగ్గ సినిమా.అటువంటి సినిమానే  'ఫెంటాస్టిక్ వాయోజ్' దీనిని 1966 లో అమెరికాలో మొదటి సారి ప్రదర్శించారు,తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడింది.మనదేశంలో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడింది అప్పటిలో అనేక పాఠశాలలకోసం ప్రత్యేక షోలు వేశారు.
          ఈ సినిమాకి రిచార్డ్ ఫ్లిషర్ దర్శకత్వం వహించాడు.ట్వంటియత్సెంచరీ ఫాక్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
         దీనికి మూలం ఐసాక్ అసిమోవ్ రచించిన కథ కానీ సినిమాకోసం ఓట్టోక్లిమంట్,జీరోమ్ బిక్సీ,డేవిడ్ డంకన్ సినిమాకు సరిపోయే విధంగా కథ రచించారు.
    కథ విషయానికి వస్తే జాన్ బీన్స్ ఒక తెలివిగల శాస్త్రజ్ఞుడు ఆయనకు ప్రమాదవశాత్తు అతని మెదడులో రక్తపుగడ్డ ఏర్పడుతుంది! చిత్రమేమిటంటే జాన్ బీన్స్ వస్తువులను సూక్ష్మంగా చేసే సాంకేతికతను కనిబెడతాడు.అదే సాంకేతికతను ఉపయోగించి ఆయనను కాపాడతారు.
        శాస్త్రజ్ఞుల్ని ,ఒక సబ్ మైరన్ ని అతి సూక్ష్మాతిసూక్ష్మంగా మార్చి వారిని ఒక ఇంజెక్షన్లోకి ఎక్కించి,ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి'కారోటిడ్ ఆర్టరీ' లో(రక్తం గుండెకు తీసుకపోయే రక్త నాళం) ప్రవేశ పెడతారు.ఈ ప్రక్రియ నాలుగు దశల్లో చేసి,ఐదు మంది డాక్టర్లు,ఇంజనీర్లను ఆయన శరీరంలో సబ్మెరైన్ ద్వరా ప్రవేశ పెడతారు.
        వారు సూక్ష్మరూపంలో శరీరంలో ప్రయాణిస్తూ రకరకాలుగా శరీరంలో జరిగే విశేషాలు చూస్తారు.ఎర్ర రక్త కణాలు,అవి ఆక్సిజన్ చేరవేసే ప్రక్రియ తెల్లరక్త కణాలు బాక్టీరియాను ఎదుర్కొనే పద్దతి,గుండె లబ్ డబ్ శబ్దాలు వింటూ ప్రయాణిస్తారు.ఊపిరి తిత్తుల పనితీరు ఆక్సిజన్ రక్తంలో కలవడం చూస్తారు.వినోదం కోసం  వారిలో వారికి అభిప్రాయబేధాలు కలిగినట్టు చూపిస్తారు.కంటి దగ్గరకు వచ్చేసరికి రెటీనా పై కాంతి పడే మార్గాన్ని చూస్తారు!
        సబ్ మెరైన్ చెవి దగ్గరకు వచ్చేసరికి శబ్ద ప్రకంపనాలు కర్ణ భేరి మీద ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుంటారు.ఇంతలో  ఆపరేషన్ థియేటర్ లో ఒక సహాయకుడు కత్తెర కింద పడవేస్తాడు,ఆ శబ్దం వలన కర్ణభేరిలో తీవ్ర ప్రకంపనాలు ఏర్పడి సబ్ మెరైన్ అటు ఇటు ఊగి పోతుంది!
        ఈ విశేష ప్రయాణాన్ని అంతా బయట శాస్త్రజ్ఞులు కంప్యూటర్ లోచూస్తూ వారికి తగిన సూచనలిస్తుంటారు.శరీరంలో ప్రయాణించే సబ్మెరైన్ పేరు 'ప్రొటియస్'  ఒకానొక దశలో శాస్త్రజ్ఞులు సబ్ మెరైన్ నుండి బయటికి వస్తే రోగనిరోధక శక్తి కణాలు వారి మీద దాడి చేస్తాయి.కష్టపడి తప్పించుకుంటారు.అలా ప్రయాణించి వారు మెదడు భాగాన్ని చేరుకుంటారు .డాక్టర్ పీటర్ తన లేజర్ తుపాకీతో జాగ్రత్తగా మెదడులో రక్తపు గడ్డను చిన్నాభిన్నం చేసి తొలగిస్తాడు!
         మెల్లగా వారు ప్రయాణించి కంటి ప్రాంతానికి వస్తారు.కంటి నీటిలోకి వస్తే శాస్త్రజ్ఞులు జాగ్రత్తగా సబ్ మెరైన్ మనుషులతో సహా బయటికి తీసి అందరినీ మామూలు రూపుల్లోకి తెస్తారు.ఇది స్థూలంగా కథ.
      సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది.ఇప్పుడు కూడా ఈ సినిమా 'అమెజాన్'లో ఉంది వీలైతే చూడండి,మీ పిల్లలకు చూపించండి.
    వినోదంతో పాటు,విజ్ఞానం పొందండి.