రంగుటద్దాలు:- కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

 సుధాకర్ బోలెడు పుస్తకాలు, పత్రికలు చదువుతాడు. కథలు,కవితలు వ్రాస్తుంటాడు.వాటిలో నీతి కథలు,ఆలోచనలు రేకెత్తించే కవితలు ఎక్కువ!
        అలా అతని ఇంట్లో బోలెడు పుస్తకాలు పేరుక పోయాయి. రెండు ఆదివారాలలో సుధాకర్ అతని శ్రీమతి రమణి పుస్తకాలను  దాచిపెట్టదగినవి,అమ్మివేయదగినవిగా విభజంచి దొంతర్లు పెట్టారు.
     ఒకరోజు  "పాత పుస్తకాలు,పేపర్లు కొంటాం" అని అరచుకొంటూ వీధిలో ఓ యువకుడు బండి తోసుకుంటూ వస్తున్నాడు.
       వాడి కేక సుధాకర్ విని బయటకు వచ్చి వాడిని పిలిచాడు. వాడు ఎండలో చెమటలు పట్టి అలసటగా కనుపంచాడు.
        "అయ్యా,మొదట తాగటానికి కొన్ని నీళ్ళు ఇప్పించండి" అన్నాడు.
         ఇంట్లోకి వెళ్ళి చెంబు,కాగితం గ్లాసు తేవడానికి వెళ్ళాడు సుధాకర్.
        "ఏమండీ వాడిని కొంచెం గమనిస్తుండండి,ఏదైనా వస్తువు మనకు తెలియకుండా ఎత్తుక పోగలడు.స్టౌ మీద పప్పు ఉడుకు తోంది ,అందుకే బయటకు రాలేక పోతున్నాను"అన్నది రమణి.
        "నేను చూసుకుంటానులే" చెప్పి బయటకు వచ్చి వాడికి నీళ్ళు ఇచ్చాడు.     
        వాడు నీళ్ళు తాగి "అయ్యా,ఈ పేపరు గ్లాసులు కొంత నయం హాని చేయవు,ప్లాస్టిక్ గ్లాసులు వాడకండయ్యా" అన్నాడు 
       వాడి పరిజ్ఞానానికి సుధాకర్ మనసులోనే వాడికి జేజేలు పలికి, లోపలికి వెళ్ళి పుస్తకాలు, పేపర్ల దొంతర తెచ్చాడు.
       వాడు అవన్నీ చూస్తూ కొన్ని పేజీలు తిప్పి చూసి అయ్యా,వీటిలో మంచివిషయాలు కట్ చేసి దాచుకున్నారా?" అడిగాడు వాడు.
         "నీవేం చదువుకున్నావురా?నీకు మంచి విషయాలు తెలుసే!" అడిగాడు.
      . ."అయ్యా,చదివింది ఏడోతరగతి కాని ఈ విధంగా కొన్న పుస్తకాలు చదువుతూ,వాటిలో మంచి విషయాలు కత్తిరించి దాచుకుంటాను"అని చిరునవ్వు తో చెప్పాడు.
        అబ్బో వీడిలో చాలా విషయం ఉందే అనకున్నాడు సుధాకర్.
      ఈ లోపల వంట ఇంట్లోంచి రమణి కూడా బయటకు వచ్చింది.
       వాడు పుస్తకాలను తూకం వేసి "అయ్యా,ఐదు కెజీలు ఉన్నాయి,ఇదుగోండి మప్ఫై ఐదు రూపాయలు"అని డబ్బు ఇచ్చాడు 
      "అంతేనా మరో ఐదు రూపాయలు ఇవ్వు" అన్నది రమణి.
       " అమ్మా, నేను తూకంలో మోసం చెయ్యను"అని నమస్కారం పెట్టి చెప్పాడు.
        సుధాకరం రమణిని ఇక అడగవద్దని వారించి,వాడిని ఇక వెళ్ళమని చెప్పాడు.
       అలా వెళ్ళిన వాడు రెండో రోజు సుధాకరం ఇంటికి వచ్చి తలుపు తట్టి పిలిచాడు.
     సుధాకరం తలుపు తీసి చూసి "ఏమిటి" అని అడిగాడు.
       "అయ్యా,నిన్న మీ పుస్తకాలు ఇంటికి తీసుకవెళ్ళి మంచివిషయాల కోసం చూస్తుంటే ఓ పుస్తకంలో ఈ ఏభై రూపాయల నోటు దొరికింది,ఇదుగోండి" అంటూ ఇచ్చాడు.
         వాడి మంచితనానికి సుధాకరం ఆశ్చర్య పోయి, వాడికి పుస్తకాలలోని మంచి విషయ సేకరణ మీదున్న ఆసక్తిని మనసులోనే మెచ్చుకున్నాడు.
       ఈ లోపల అక్కడికి వచ్చిన రమణి వాడి మంచితనం తెలుసుకుని ఆశ్చర్యపోయింది!
     సుధాకరం వాడికి తను చదివేసిన శంకర్  కథల పుస్తకం బహుమతిగా ఇచ్చాడు,
        "ఏభై రూపాయలు కూడా వాడికే ఇచ్చి మంచిపుస్తకం కొనుక్కో" అన్నాడు.    
        అయ్యా, ఈ ఏభై రూపాయలు మీవి "అంటూ ఇవ్వబోయాడు. 
       "నేను చెబుతున్నాను కదా తీసుకో "అన్నాడు సుధాకరం.
       వాడు సుధాకరానికి, రమణికి నమస్కారం పెట్టి వెళ్ళి పోయాడు.
        "మనం రంగుటద్దాలు అనే అనుమానపు అద్దాల్లోంచి కొంతమంది మనుషుల్ని చూస్తుంటాము.నిజానికి అద్దాలు తీసేస్తే వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో మంచితనంతో తెల్లటి రంగులో కనబడతారు" అని చెప్పాడు సుధాకరం.
  నిజమేనండీ, ఎవ్వరినీ తక్కువ అంచనా వేసి చూడకూడదు" అని చెప్పింది రమణి.