కథ చెప్పండి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   ఓ మంచికథ మంచి గొంతుతో,మంచి భావాలతో చెబుతుంటే ఎవరికి వినాలని ఉండదని చెప్పండి. పుస్తకంలో చదివిన కథ కంటే మనస్ఫూర్తిగా విన్న కథ మెదడులో పదికాలాల పాటు నిలచిపోతుంది!
      ప్రపంచవ్యాప్తంగా కొన్ని విశ్వవిద్యాలయాలు  కథ చెప్పడంలో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
మనదేశంలో బెంగుళూరులో 'కథాలయ' అనే సంస్థ సుమారు ఏడు వేలమందికి శిక్షణ ఇచ్చింది!కథ చెప్పడంలో డిప్లమో కోర్స్ లో శిక్షణ ఇస్తోంది.
       పురాతనకాలం నుండే రాతకు పూర్వం  కథలు చెప్పడం ఉండేది.కొన్ని కథల ఆధారంగా రాతి గుహల్లో బొమ్మలు చిత్రీకరించడం జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు.
        కొన్ని అత్యధ్బుతమైన కథలను,ఒకరికొకరు చెప్పుకోక పోవడం వలన ఆ కథలు కాలగర్భంలో కలసి పోయినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
       అన్ని పాతకథలు అందరికీ తెలియాలని లేదు.ఈ ఉరుకుల పరుగుల యుగంలో ఎంతమంది కథలను చదివి గుర్తు పెట్టుకుంటున్నారు?
       తెలిసిన కథ అయినా అధ్బుతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే విన్నవాళ్ళకి ఆనందం,కథను మరచిపోరు.కథలో సూక్ష్మాలను గ్రహిస్తే ఆలోచనా శక్తి పెరుగుతుంది,సృజనాత్మకతకూడా పెరుగుతుంది!
       కథల్లో జానపద,చారిత్రాత్మక,సాంఘీక,ప్రపంచ సాహిత్య కథలే కాకుండా,రచయితలు సృజనాత్మకంగా వ్రాసిన కథలు కూడా చెప్పవచ్చు.
       అమెరికా మొదలైన దేశాల్లో 'కథలు చెప్పే పండుగ'లను కూడా నిర్వహిస్తున్నారు.ఇది మంచి ఆలోచన,మనదేశంలో ఈ పండుగలు నిర్వహిస్తే ఎన్నోకథలు బతికి పోతాయి.
       అమెరికాలో కథలు చెప్పేవారిచిరునామాలు, వారి ప్రత్యేకతలతో,వివరాలతో 'డైరక్టరీ' పుస్తకాలను కూడా వెలువరిస్తున్నారు.
       "చరిత్రను కథల రూపంలో చెబితే చరిత్రను ఎప్పటికీ మరచిపోరు"అని రూయార్డకిప్లింగ్ చెప్పారు.
       అప్పటిలో 'బుర్రకథ','హరికథ' ఆటపాట సంగీత రూపంలో చెప్పడంవలన అవి ప్రేక్షకుల మనసుల్ని దోచుకొనేవి!
      మహాకవి గురజాడ అప్పారావు వ్రాసిన అధ్బుతమైన 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' కథను తెరవెనుక నీడల కథగా(షాడో షో) ప్రదర్శిస్తుంటే అందులో కథ పాట రూపంలో అలరిస్తోంది కదా!
        జర్మనీలో గ్రిమ్ సోదరులు ఎన్నోకథలు వినడం ద్వారా సేకరించి,ప్రపంచానికి ఇచ్చారు,అవే'స్నో వైట్ అండ్ సెవన్ డ్వార్ఫ్స్','సిండ్రెల్లా'మొదలైనవి.
       హైదరాబాద్ లో దీపాకిరణ్ వంటివారు కథలు చెప్పడంలో మెళకువలు నేర్పిస్తున్నారు.
       మా అమ్మ మాచిన్నప్పుడు 'గుణసుందరి కథ' చెప్పింది.అది ఇప్పటికీ మా అన్నదమ్ములం మరచి పోలేదు!
       కథలు అంతరించి పోకుండా మన పెద్దవాళ్ళు పిల్లలకి కథలు చెప్పాలి.దానితో పిల్లల సృజనాత్మకత పెరుగుతుంది.ఉపాధ్యాయులు కూడా తగిన సమయంలో పిల్లలను వారి పెద్దలకు ఇబ్బంది లేనప్ఫుడు కథలు చెప్పించుకొని తరగతిలో ఇతర పిల్లలకు చెబితే కథలు నిలబడతాయి.వీలైతే ఆ కథలు గ్రంథస్తం చేస్తే భావితరాలకు ఆ కథలు లభిస్తాయి!
                   

కామెంట్‌లు