డెన్నిస్ ద మనేస్:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మీరు ఎప్పుడైనా 'డెన్నిస్ ద మేనేస్' కామిక్ కార్టూన్ చూశారా? అందులోని చిలిపి అల్లరి పిల్లవాడే 'డెన్నిస్' వాడికి ఐదున్నర ఏళ్ళ వయస్సు.
      ఈ డెన్నిస్ పాత్రని అమెరికాకు చెందిన హాంక్ కెచ్ మాన్ (1920-2001).అక్టోబర్ 1950 లో సృష్టించాడు.అప్పటినుండి అనేక పత్రికల్లో ఈ కామిక్ వస్తూనే ఉంది! ఐదున్నర ఏళ్ళ చిన్నపిల్లల్లో చిలిపితనం ఎక్కువ ఉంటుంది,అదిగాక ప్రపంచం వాళ్ళకు కొత్త కొత్తగా కనబడుతుంది.ఆ పాత్రకు తన చిన్నకొడుకే ప్రేరణ అని కెచ్ మాన్ చెప్పేవారు.
       డెన్నిస్ చిలిపి అల్లరి చిలిపి ప్రశ్నలకు తల్లిదండ్రులు, చుట్టు పక్కలవారు ఆశ్చర్యపోతుంటారు.ఈ కార్టూన్ చూస్తుంటే మనకు ఒక ఆనందం.
        ఈ డెన్నిస్ మేనేస్ కార్టూన్ ప్రేరణతోనే కీ॥శే॥ ముళ్ళపూడి వెంకట రమణ, బాపూలుచిలిపి కథతో అధ్బుత బొమ్మలతో 'బుడుగు-1,బుడుగు-2'పుస్తకాలుతెచ్చి బాల సాహిత్యంలో నిలిచి పోయారు.
         హాంక్ కెచ్ మాన్ కి ఆరవ ఏటనుండే బొమ్మలు వేయడంమీద ఆసక్తి పెరిగి పోయిందట!డెన్నిస్ సృష్టించాక ఆయన ఆక్రిలిక్,నీటిరంగులతో,పెన్ తో చిత్రకారుడు పికాసో,సంగీతకారుడైన ఆర్మ్ స్ట్రాంగ్ వంటి వారి బొమ్మలు కూడా అధ్బుతంగా సృష్టించాడు.
        ప్రపంచ వ్యాప్తంగా ఈ డెన్నిస్ మేనేస్ పుస్తకాలు ఏభైమిలియను పై చిలుకు అమ్ముడు పోయాయి!
         1993 లో'డెన్నెస్ ద మేనేస్' చలన చిత్రం కూడా వచ్చింది,దానిలో పేరొందిన నటులు నటించారు.
        అమెరికాలోనికింగ్ ఫీచర్ సిండికేట్ ద్వారా సుమారు 48 దేశాల్లో వెయ్యి దిన పత్రికల్లో,పుస్తకాల్లో ఈ కార్టూన్లు ప్రచురింప బడుతున్నాయి.కొద్దికాలం తరువాత ఈ బొమ్మలు వేయడంలో సహాయం చేయాడానికి 'మార్కస్ హామిల్టన్','రోనాల్డ్ ఫెర్డినాండ్' నియమించుకున్నాడు హాంక్ కెచ్ మాన్.
      2001లో కెచ్మాన్ చనిపోయాక వీరు డెన్నిస్ కార్టూన్లు వేస్తున్నారు.అనేక ప్రపంచ భాషల్లో ఈ కార్టూన్లు వస్తున్నాయి.మనదేశంలో కూడా పుస్తకాల రూపంలో ఈ కార్టూన్లు లభిస్తున్నాయి.
        అమెరికాలో1986 లో  టి.వి సీరియల్ గా 234 వారాలు ఈకార్టూన్ ప్రసారం చేయబడింది.
        'డెక్కన్ క్రానికల్'ఆంగ్లపత్రిక  ఇప్పటికీ ఈ కార్టూన్ ప్రచురిస్తోంది.
        హాంక్ కెచ్ మాన్ తన కొడుక్కి కూడా డెన్నిస్ అనేపేరు పెట్టుకున్నాడంటే ఆయన ఆ పాత్రని ఎంత ప్రేమించాడో అర్థం అవుతుంది.
        ఇది డెన్నెస్ ద మేనస్ కథ!
                
    
కామెంట్‌లు